ఏమి ఉద్ధరించారని ఈ ఉత్సవాలు?

ABN , First Publish Date - 2021-07-08T05:45:49+05:30 IST

రైతుదినోత్సవాలు జరిపే అర్హత వైసీపీ ప్రభుత్వానికి ఉందా? ఏటా జూలై 8 (వైఎస్ పుట్టిన రోజు)న రైతు దినోత్సవం నిర్వహించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది....

ఏమి ఉద్ధరించారని ఈ ఉత్సవాలు?

రైతుదినోత్సవాలు జరిపే అర్హత వైసీపీ ప్రభుత్వానికి ఉందా? ఏటా జూలై 8 (వైఎస్ పుట్టిన రోజు)న రైతు దినోత్సవం నిర్వహించాలని జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చి వారిని పుట్టెడు దుఖంలో ముంచిందే వైఎస్ పాలన. రెండేళ్ల జగన్ జమానా రైతులకు చేసిన సాయం కంటే చేసిన మోసమే ఎక్కువ అని చెప్పాలి. అంకెల గారడీ, అబద్ధాలతో రైతులను దారుణంగా దగా చేస్తున్నారు. వ్యవసాయ పురోభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా  రైతు దినోత్సవాలు జరుపుతున్నారు. అసలు రైతులను ఈ రెండేళ్లలో కొత్తగా ఉద్ధరించింది ఏమిటి?


జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘రైతు భరోసా’ పథకం కార్యాచరణలో చతికిల పడింది. రైతుల ఖాతాలు మొత్తం 79,50,844 ఉండగా 45 లక్షల మందినే ‘రైతు భరోసా’కి అర్హులను చేశారు. రైతులను ఇలా మోసం చేసినందుకు రైతు దినోత్సవం జరుపుతున్నారా? రైతు భరోసాకి రాష్ట్ర ప్రభుత్వ నిధులు నుంచే రూ.12,500 ఒకే సారి ఇస్తామని ప్రకటించారు. తరువాత ఈ మొత్తానికి రూ.1000 కలిపారు. దీనికి, కేంద్రం ఇస్తానన్న రూ.6000 కలిపి రూ.19,500 రైతుకి ఇవాల్సి ఉంది. అయితే కేంద్రం ఇచ్చే రూ.6000కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి రూ.13,500 మాత్రమే ఇస్తోంది! తెలుగు దేశం ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.15 వేలు ఒకే విడతగా ఇస్తే, జగన్ ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కూడా మూడు విడతల్లో విదిలిస్తోంది. ఇలా రైతులను దగా చేస్తున్నందుకేనా రైతు దినోత్సవమా? రైతులను కులాలవారీగా విడదీసి రైతు భరోసా పథకంలో అగ్రకులాల పేద రైతులకు అన్యాయం చేసినందుకు రైతు దినోత్సవమా?


వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రంగమైన సాగునీటి రంగాన్ని గాలికి వదిలేసి కోట్లాది రైతులకు అన్యాయం చేస్తున్నందుకా? ధరల స్థిరీ కరణ నిధి కింద రూ.3,000 కోట్లు, ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద రూ.4000 కోట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, చేయకుండా రైతులను మోసం చేసినందుకే రైతు దినోత్సవమా? వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ఉత్పత్తి పెంపునకు, పంటల సాగు నిర్ధారణ వంటి అంశాలకు భూసార పరీక్షలు కీలకం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు పోషక పదార్ధాలు అందించారు. వైసీపీ సర్కార్ అంతటి కీలకమైన భూసార పరీక్షలకు మంగళం పాడినందుకా రైతు దినోత్సవమా? వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకు జీఓ నెంబర్ 22 తీసుకువచ్చి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నందుకు రైతు దినోత్సవమా? రెండేళ్లలో 1123 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచినందుకు రైతు దినోత్సవమా? రాష్ట్ర వ్యాప్తంగా రబీ ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన సొమ్మును 21 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చి నెలరోజులు దాటినా రైతులకు ఇవ్వాల్సిన రూ.4,000 కోట్లను చెల్లించనందుకా?


ప్రస్తుతం వ్యవసాయరంగం పూర్తిగా యాంత్రీకరణ పై ఆధార పడి ఉంది. దుక్కి మొదలుకొని నూర్పిడి వరకు, తెలుగుదేశం ప్రభుత్వం యాంత్రీకరణ ద్వారా సాగులో సమూల మార్పులు చేయాలని పెద్ద ఎత్తున యాంత్రీకరణకు శ్రీకారం చుట్టి ‘రైతు రథం’ పథకం ద్వారా 17,949 ట్రాక్టర్లను వ్యవసాయ పరికరాలు గోర్రు, నాగలి, రోటోవేటర్, తైవాన్ స్వేయర్స్రై తదితర వ్యవసాయ పరికరాలను అందిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక రైతు రథం పధకానికి.యాంత్రీకరణకు మంగళం పాడారు. ఇందుకా రైతు దినోత్సవం? డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం రాయితీ,ఎస్సీ,ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ అందిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రాణ పదమైన డ్రిప్ ఇరిగేషన్‌ను అటకెక్కించారు. ఉచితంగా అందించే సూక్ష్మ పోషకాలు మైక్రో న్యూట్రియంట్స్ ఎరువుల పంపిణీ నిలిపి వేశారు. ఇందుకా రైతు దినోత్సవం? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పంట నష్ట పోయిన వరి రైతులకు హెక్టారుకి రూ.20 వేల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించారు. జగన్ ప్రభుత్వం ఆ సబ్సిడీని రూ. 15 వేలకు తగ్గించింది. ఈ ఏడాది వరస తుపానులతో 37 లక్షల ఎకరాల్లో పంట నష్ట పోతే కేవలం 11 లక్షల ఎకరాలకే ఇన్‌పుట్ సబ్సిడీ అందించినందుకా రైతు దినోత్సవం?


అమరావతి రాజధానికి 28 వేల మంది రైతులు33 వేల ఎకరాలు త్యాగం చేశారు. రాజధానిని తరలించ వద్దని, తమకి అన్యాయం చెయ్యవద్దని దాదాపు 570 రోజులుగా రోడ్ల పైనే ఉంటూ ఆ రైతులు పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆ 28 వేల మంది రైతుల హక్కులను కాల రాస్తూ వారి జీవితాలను నాశనం చేసినందుకు రైతు దినోత్సవమా? పంటలకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీకి రుణాలు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పధకాల అమలులో చిత్త శుద్ధి లేక లేక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దాదాపు రూ.22 వేల కోట్లు నష్టపోయినందుకు రైతు దినోత్సవమా? 


రైతుల శ్రేయస్సు పట్ల చిలక పలుకులు కాదు, చిత్తశుద్ధి ముఖ్యం. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో రైతులు మూడు లక్షల ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది వైఎస్ హయాంలోనే కాదా? 14,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది వైఎస్ పాలనలోనే కాదూ? ఎరువులు అడిగిన రైతుల పై లాఠీలతో విరుచుకు పడటం, రైతులు గుండెలు ఆగిన సంఘటనలు వైఎస్ పాలనలోనే చోటు చేసుకున్నాయి. 99 సెజ్‌లు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను, తోటలను 2 లక్షల ఎకరాల భూములు అప్పనంగా గుంజుకొని రైతుల బతుకులు నాశనం చేశారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరం వెంట ప్రగతి మాటున నానా రకాల కుతంత్రాలు నిర్లజ్జగా సాగాయి. రైతుల సమాధుల పైనే తన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకొన్న జగన్ నేడు రైతుల పట్ల దయామయుడుగా జగన్నాటకాలు ఆడుతున్నారు. తన తండ్రి వైఎస్ పరిపాలన రైతులను ఉద్ధరించినట్లు ఆయన పేరుతో రైతు దినోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉంది. వ్యవసాయరంగాన్ని నాశనం చేస్తున్న జగన్ ప్రభుత్వం రైతు దినోత్సవాలు జరపడమేమిటి? 

మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2021-07-08T05:45:49+05:30 IST