Abn logo
Sep 23 2020 @ 00:00AM

కన్నవారికి ఇంతకన్నా ఏం కావాలి

Kaakateeya

కొడుకు ఏదో ఒక ఉద్యోగం చేస్తే చాలని ఆమె అనుకోలేదు! టీసీఎ్‌సలో  బంగారం లాంటి ఉద్యోగం మానేసినప్పుడు కూడా కొడుక్కి ఎదురు చెప్పలేదు. అనుకున్న లక్ష్యం సాధించటానికి అన్ని విధాలుగా అండగా నిలిస్తూ, అతడికి వెయ్యి  ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఆమే సివిల్స్‌ ఏపీ టాపర్‌ మల్లవరపు సూర్య తేజ తల్లి సంధ్యారాణి. ఈ ఏడాది సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 76వ ర్యాంకుతో పాటు ఏపీ టాపర్‌గా నిలిచిన తన కొడుకును చూసి మురిసిపోతున్న ఆమె  నవ్యతో పంచుకున్న విశేషాలివి...


మాది గుంటూరు. నా భర్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. మాకు తేజ ఒక్కడే కొడుకు. నా భర్త ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలల్లో ఉన్నా, తేజ చదువుకోసం నేను గుంటూరులోనే ఉన్నా. ప్రతి ఏటా కుటుంబ సభ్యులం అందరం కలిసి విహార యాత్రలకు వెళ్లేవాళ్లం. అలా తేజకు 8ఏళ్ల వయసులో ముస్సోరీలోని ఐఏఎస్‌  శిక్షణా సంస్థను చూపించే అవకాశం కలిగింది. నాడు మాటల సందర్భంలో  ‘మన కుటుంబం నుంచి ఎవరైనా ఇక్కడ శిక్షణ పొందుతారా!’ అని మా తండ్రి(తేజ తాతగారు) అడగితే తేజ చేయ్యెత్తి ‘నేను కలెక్టర్‌ అవుతాను’ అన్నాడు. అదే నేడు నిజమయింది. తేజకు బాల్యం నుంచే ఐఏఏస్‌ కావాలని బలమైన కోరిక ఉండేది.   మేము అతడికి పూర్తి సహాయం అందించాం. 


అనుకున్నది అనుకున్నట్లుగా చేసేవాడు

అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలనేది పట్టుదల తేజది. దానికోసం రేయింబవళ్లు కష్టపడేవాడు. అది గమనించి తనకు ఏ చిన్న పని కూడా చెప్పేవాళ్లం కాదు. ఇన్నేళ్లలో వాడి చేత కూరగాయలు కూడా తెప్పించలేదు. వాడు పూర్తిగా లక్ష్యం చేరటానికే అకింతమయ్యాడని అర్ధం చేసుకున్నాం. నా భర్త 2014లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ ప్రభావం వాడిమీద పడకుండా జాగ్రత్తపడ్డాం. కుటుంబ విషయాలు, ఆర్థిక స్థితిగతులు ఇలా ఏ విషయాలను వాడి దాకా చేరనివ్వలేదు.. 


ఐదో ప్రయత్నంలో.....

తప్పులను బేరీజు వేసుకొని మరలా ఆ తప్పులు జరగకుండా చూసుకోవడం తేజకు అలవాటు. అదే వాడి విజయానికి కారణం అనుకుంటున్నాను. ఐదో ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు. ఈ నాలుగు సార్లు తాను చేసిన తప్పులను సరిచేసుకున్నాడు తప్పా ఎప్పుడు కుంగిపోలేదు.  


అన్నం తిన్నావా అని అడిగాడు!

గత ఏడాది ఫలితాల్లో వాడు క్వాలిఫై కాలేదు. ఆ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. బాగా పొద్దుపోతోంది. ఇంకా ఇంటికి రాలేదన్న కంగారు మాకుంది. ఆ సమయంలో ఇంటికి వస్తూనే ‘అమ్మా అన్నం తిన్నావా’ అని అడిగాడు. అలా ఎప్పుడూ అడగడు. పరిస్థితి మాకు అర్థమయ్యింది. కానీ వాడే మాలో నైతిక స్థైర్యం నింపాడు. ఈసారి సాధిస్తానని రోజుకు 14 గంటలు నిర్విరామంగా కృషి చేశాడు. ఐదో ప్రయత్నంలో విజయం సాధించాడు.

మా తాత కన్నెగంటి సూర్యనారాయణ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన గుర్తుగా మా వాడికి సూర్యతేజ అని పేరుపెట్టాం.  భవిష్యత్తులో మంచి అధికారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడనే నమ్మకం నాకుంది.


 ఉద్యోగం మానేస్తా అంటే కంగారుపడ్డాం!

టీసీఎ్‌సలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు ఫోన్‌ చేసి ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతానన్నాడు. మంచి ఉద్యోగం మానేస్తాననటం బాధగా అనిపించింది. కాని వాడి పట్టుదల చూసి ఎదురు చెప్పలేదు. తేజ చిన్నప్పటి నుంచి తోటివాళ్లతో సరిగ్గా ఆడుకున్నది లేదు, బంధువులతో గడిపింది లేదు.

ఇన్ని త్యాగాలు చేసి ఇప్పుడు పెద్ద ఉద్యోగం సాధించి మాకూ పేరు తెచ్చాడు. కొడుకు విజయం చూడటానికి వాళ్ల నాన్న లేరు. అయినా ఆయన ఆశీస్సులు వాడికి ఎప్పుడూ ఉంటాయి. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకన్నా ఏం కావాలి? ఈ జన్మకు ఈ ఆనందం చాలు నాకు!


 తప్పులను బేరీజు వేసుకొని మరలా ఆ తప్పులు జరగకుండా చూసుకోవటం తేజకు అలవాటు. అదే మా వాడి విజయ రహస్యం.

అమ్మ చలవే!

అమ్మ అందించిన సహాయం, చేసిన సేవలు వెల కట్టలేనివి. ఈ రోజు నేను ఈ స్థాయికి చేరానంటే అదంతా అమ్మ చలవే! నాన్న చనిపోయిన తరువాత నేను కుంగిపోకుండా నా గెలుపే తన జీవిత లక్ష్యంగా భావించి నన్ను నడిపించారు. స్కూల్‌లో పోటీ పరీక్షలలో ప్రథమ స్థానం వచ్చినప్పుడు అప్పటి కలెక్టర్‌ జయలక్ష్మి చేతుల మీదుగా బహుమతి అందుకున్నా. ఇప్పటికీ ఆ  ఫొటో భద్రంగా ఉంది. ఆ ఫోటో చూసినప్పుడల్లా నేనూ ఆ స్థాయికి ఎప్పుడు చేరతానా! అని అనుకొనే వాడిని. ఇప్పుడది నెరవేరింది.        

- సూర్యతేజ
 

 గోగినేని మనోజ్‌ కుమార్‌, గుంటూరు

ఫొటో: దాసరి రమణ


Advertisement
Advertisement
Advertisement