మోదీతో మమత ఏం చర్చించారంటే..?

ABN , First Publish Date - 2021-07-27T23:09:19+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వేళ మోదీ-దీదీ మధ్య మాటల యుద్ధం సాగింది. విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ, టీఎంసీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా రాజకీయ హింస నెలకొంది

మోదీతో మమత ఏం చర్చించారంటే..?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. బెంగాల్ సీఎంగా మూడోసారి ఎన్నిక అయ్యాక మోదీతో ఆమె భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా ఈ భేటీ అనంతరం ఆమె మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మరిన్ని కొవిడ్ టీకాలు అవసమని ప్రధానికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇక ఈ మధ్య సంచలనంగా మారిన పెగాసస్ అంశంపై ప్రధాని అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే బాగుండేదని మమత అభిప్రాయపడ్డారు.


‘‘ప్రధానితో ఇది మర్యాదపూర్వక సమావేశం మాత్రమే. అయితే మీటింగ్ సమయంలో మా రాష్ట్రానికి మరిన్ని కోవిడ్ టీకాలు, మందులు కావాలన్ని అంశాన్ని లేవనెత్తాను. అలాగే రాష్ట్ర పేరు మార్పు అంశాన్ని కూడా లేవనెత్తాను. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘పెగాసస్ మీద ప్రధానమంత్రి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేయాలి’’ అని ఆమె అన్నారు.


పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల వేళ మోదీ-దీదీ మధ్య మాటల యుద్ధం సాగింది. విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ, టీఎంసీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా రాజకీయ హింస నెలకొంది. తమ పార్టీవారిని అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై రగడ కొనసాగుతుండగానే పెగాసస్ ఉదంతం తెరపైకొచ్చింది. దీంతో తృణమూల్ సర్కారు దీనిపై విచారణకు కూడా ఆదేశించింది. ఈ తరుణంలో దీదీ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మమత బుధవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోనున్నారు.

Updated Date - 2021-07-27T23:09:19+05:30 IST