రాజ్యసభ సభ్యురాలిగా లతా మంగేష్కర్ ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2022-02-06T21:30:50+05:30 IST

లతా మంగేష్కర్ 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యురాలిగా

రాజ్యసభ సభ్యురాలిగా లతా మంగేష్కర్ ఏం చేశారంటే...

న్యూఢిల్లీ : ‘భారత రత్న’ లతా మంగేష్కర్ 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. ఆమె బీజేపీ మద్దతుతో ఈ పదవికి ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలంలో కేవలం 12 సార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. కేవలం ఒక అన్‌స్టార్డ్ ప్రశ్న మాత్రమే అడిగారు. రైళ్ళు పట్టాలు తప్పడం గురించి ఆమె ప్రశ్నించారు. పార్లమెంటేరియన్‌గా ఆమెకు లభించే భత్యాలు, చెక్కులను ఆమె స్వీకరించలేదని సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానం వచ్చింది. ఆమెకు చేసిన చెల్లింపులన్నీ పే అకౌంట్స్ కార్యాలయానికి తిరిగి వచ్చినట్లు వెల్లడైంది. 


12 రోజులు ఆమె సభకు హాజరైనప్పటికీ, కొద్ది సేపు మాత్రమే సభలో ఉండేవారు. రైళ్లు పట్టాలు తప్పడం గురించి అడిగిన ప్రశ్నలో, వివిధ సెక్షన్లలో రైళ్లు పట్టాలు తప్పుతున్న సంఘటనలు పెరుగుతుండటం నిజమేనా? 2000 సంవత్సరం ప్రారంభం నుంచి అలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి? పర్యవసానంగా రైల్వేలకు ఎంత నష్టం జరిగింది? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ఆమె అడిగారు. 


లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యురాలిగా తన పదవీ కాలం సంతోషంగానే గడిచిందన్నారు. పార్లమెంటు సభ్యురాలినయ్యేందుకు తాను తిరస్కరించానని, ‘‘నన్ను వదిలేయండి’’ అని కోరానని చెప్పారు. ‘‘రాజకీయాల గురించి నాకు ఏం తెలుసు?’’ అన్నారు. బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీలంటే తనకు చాలా గౌరవం ఉందని, అయినప్పటికీ తాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేనని తెలిపారు. 


సినీ పరిశ్రమ గురించి పార్లమెంటులో ఎందుకు లేవనెత్తడం లేదని తనను చాలా మంది అడిగేవారని, అయితే తాను గాయనిని మాత్రమేనని, వక్తను కానని చాలాసార్లు చెప్పానని అన్నారు. సమస్యలను లేవనెత్తే స్థాయిలో తనకు సినీ పరిశ్రమతో అనుబంధం లేదని చెప్పారు. బాలీవుడ్ నటి రేఖ సినీ పరిశ్రమ సమస్యలను తన కన్నా బాగా లేవనెత్తగలరన్నారు. 


Updated Date - 2022-02-06T21:30:50+05:30 IST