ఎలాంటి సాహిత్యం కాంతా సమ్మతం?

ABN , First Publish Date - 2021-08-16T09:17:39+05:30 IST

కావ్యానికి ఉండవలసిన లక్షణాలు చెప్పితే అది లక్షణ గ్రంథం. కావ్యాన్ని విశ్లేషించి చెప్పితే విమర్శ. కావ్యం ఎలా ఉంటే ప్రయోజనం ఉంటుందో చెప్పటం సాహిత్య విమర్శప్రమాణం అవుతుంది...

ఎలాంటి సాహిత్యం కాంతా సమ్మతం?

కావ్యానికి ఉండవలసిన లక్షణాలు చెప్పితే అది లక్షణ గ్రంథం. కావ్యాన్ని విశ్లేషించి చెప్పితే విమర్శ. కావ్యం ఎలా ఉంటే ప్రయోజనం ఉంటుందో చెప్పటం సాహిత్య విమర్శప్రమాణం అవుతుంది. మమ్మటుడు కీర్తి, అర్థం, వ్యవహారజ్ఞానం, అలౌకికానందం, కాంతాసమ్మిత ఉపదేశం కావ్యప్రయోజనాలుగా ఉండాలన్నాడు. ఇక్కడ పితృస్వామ్య ప్రయోజనానికి ప్రాధాన్యతను ఇచ్చాడు. మరి సాహిత్య ప్రయోజనాల విషయాలలో స్త్రీల ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా?


కావ్యరచన ఎలా ఉంటే ఎటువంటి కావ్యప్రయోజనాన్ని పొందవచ్చు అని ఆలోచించే క్రమంలో, మొల్ల చెప్పిన మాటలు స్ఫురించాయి: ‘తేనె సోకనోరుతీయన యగు రీతితోడనర్థమెల్లఁదోచకుండ గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము మూగచెవిటివారి ముచ్చటగును కందువమాటలు సామెతలందముగాఁగూర్చి చెప్పనది తెలుగునకుంబొందై రుచియైు వీనులవిందైమఱి కానిపించు విబుధులమదికిన్‌’ అంటుందామె. గూఢశబ్దాలతో కూడిన రచనగాకుండా విన్నవెంటనే అర్థమయి ఆహ్లాదాన్ని కలిగించగలగాలి అని స్పష్టంచేసింది. పాఠకుల గ్రహింపును దృష్టిలోపెట్టుకొని చెప్పిన ప్రధాన కావ్యప్రమాణం యిది. ఇది అందరికి ఆమోదయోగ్యమైన కావ్యప్రయోజనం.


ఆధునిక యుగంలో మారుతున్న సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా సాహిత్యం ఎలా ఉంటే దాని ప్రయోజనం నెరవేరుతుందో చర్చి స్తూ ఇరవయ్యో శతాబ్దం తొలి నాళ్ళలో తెలుగు రచయిత్రులు కొన్ని సాహిత్య ప్రమాణాలను ప్రతిపాదించారు. 


వర్ణనలలో వాస్తవికత ఉండాలనే భావంతో ఎల్లేపెద్ది వెంకమ్మ ‘కవులేల భార్యలను వర్ణించరు’ అనే శీర్షికన రాస్తూ (ఏప్రిల్‌ 1928, విద్యానంద పత్రిక) కవులు తమ కళ్ళకు రోజూ కనిపించే తమ భార్యలను, వారి మేధావితనాన్ని వర్ణించకుండా, మనోసృష్టిలో ఊహించుకొన్న దేవతాస్త్రీలను, ఊహాసుందరులను వర్ణిస్తారెందుకని ప్రశ్నించింది. 


ఈ సందర్భంలో విద్యానాథుడి వంటి అలంకార శాస్త్రజ్ఞులు కూడా వాస్తవికతను పూర్తిగా అంగీకరించలేకపోయారని అతడు రాసిన ‘ప్రతాపరుద్రీయం’లో అర్థమవుతుంది. అతడు రాణి రుద్రమదేవి మనుమడైన రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఉండికూడా, రుద్రమదేవి పరాక్రమం తెలిసికూడా, నాయికాభేదాలను పేర్కొనేటప్పుడు ‘ధీరోదాత్త’ అనో ‘వీరనాయిక’ అనో నాయికా భేదాన్ని చెప్పలేకపోయాడని అనిపిస్తుంది.


1936లో కస్తూరి రామలక్ష్మి ‘సాహిత్యం - దాని మహత్వము’ అనే శీర్షికన రాస్తూ (జులై 1936, గృహలక్ష్మి పత్రిక) సాహిత్యానికి అర్థం జ్ఞానమనీ, భావప్రకటనకు భాష కావాలి కాబట్టి భాషావికాసం సాహిత్యం వల్లనే జరుగుతుందని చెప్పింది. అంతేకాక, ‘‘జాతి యొక్క శక్త్యాశక్తుల సజీవనిర్జీవత్వాలు, సభ్యతాసభ్యత్వాలు ఆయా భాషల యొక్క సాహిత్యమునందు నిర్ణయింపబడుచున్నవి. సాహిత్యంలేని భాష, ఆ భాషకు చెందిన జాతి అభ్యుదయ జాతియని చెప్పబడదు’’ అంటుందామె. అంతేకాక, ‘‘జాతి యొక్క క్షమతాబింబం చూడవలెనంటె సాహిత్యదర్పణమున చూడగలము’’ అనీ, ‘‘సాహిత్య రసాస్వాదనం లేని మస్తిష్కము క్రియారహితమై నిష్ప్రయోజనమై తుదకు నిర్జీవమగును’’ అనీ చెప్పింది. ఆదర్శవంతమైన జీవన జ్ఞానాన్ని, భాషాజ్ఞానాన్ని కలిగించటం సాహిత్య ప్రయోజనంగా భావించింది. అంతేకాదు, ఈమె ఇతర దేశాలలోని సాహిత్య లక్షణాలను పేర్కొంటూ ‘‘వారి సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలందు గొప్ప గొప్ప మార్పులకై మహానలమైనటువంటి అలజడులను సాహిత్యం ద్వారా కలగజేసి అచ్చటచ్చట దురాచారాలను త్రుంచివైచి తమ జాతిని రక్షించుకోగలిగారు, ఆత్మస్వాతంత్య్ర బీజాలను కూడా నాటారు’’ అని చెప్పింది. ‘‘సాహిత్యం ఉంటే యుద్ధ సామగ్రుల అవసరం ఉండదని’’ ఆమె అంటుంది. 


కస్తూరి రామలక్ష్మి మార్పుకు గురి అవుతున్న సామాజిక చలనసూత్రాలను అర్థంచేసుకొని, ఆయా సమస్యల పట్ల విప్లవాత్మకచైతన్యాన్ని అందించటమే సాహిత్యప్రయోజనం అని అభ్యుదయసాహిత్య ప్రమాణాలను ప్రతిపాదన చేసిందని అర్థమవుతుంది. అప్పటికింకా ఆంధ్రలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడలేదు.


ఆధునిక యుగంలో సాహిత్య ప్రమాణాలను వ్యాసాలలోనేకాక వివిధసాహిత్య ప్రక్రియలలో కూడా చెప్పారు. 1938లో పులిపాక బాలాత్రిపురసుందరి రాసిన ‘పిల్లికి చరలాటం - ఎలుకకు ప్రాణ సంకటం’ అనే కథలోని (మార్చి 1938, గృహలక్ష్మి) సంభాషణలలో భాగంగా స్త్రీలను ఆటబొమ్మలుగా భావించి పత్రికలలో వేసే వారి చిత్తరువుల విషయంలో, కథానైపుణ్యం, కథాకౌశలం, వాక్చాతుర్యం, చిత్ర రచనాదులను సద్వినియోగం చెయ్యకపోతే పత్రికాధిపులను, ముద్రాలయాలను నిషేధించాలని చెప్పింది. 


1938లో కనుపర్తి వరలక్ష్మమ్మ తాను రాసిన ‘కథ ఎట్లా ఉండాలె’ అనే కథలో (ఏప్రిల్‌ 1938, గృహలక్ష్మి) భార్యాభర్తల సంభాషణలో భాగంగా కథలకు ఉండవలసిన లక్షణాలను, కథాసాహిత్యప్రయోజనాన్ని పేర్కొంది. ‘‘ప్రతి రచనలోను, నైతికమైన లేక వైజ్ఞానికమైన ఒక సత్య వస్తువుండాలనీ, అప్పుడే రచయిత శ్రమ సార్థకమవుతుంద’’నీ చెప్పింది. ‘‘నవీన రచయితలు తాత్కాలికోల్లాసం కోసం ప్రణయవ్యవహారాలే తప్ప వ్రాయలేకపోతే కథలు, కథల పాఠకులు భ్రష్టుపట్టగలుగుతారు’’ అంటుంది. ‘‘కథ, కావ్యం, గేయం, చిత్రం, శిల్పం గాని మానవ కల్యాణానికి ఉపయోగించగల యుత్కృష్టత దానియందంతర్గర్భితమై ఉండా’’లని చెప్పింది. 1938లో ఈమెయే రాసిన ‘స్త్రీలు-పత్రికారచన’ (సెప్టెంబరు 1938, గృహలక్ష్మి) అనే వ్యాసంలో పత్రికారంగం ఎలా ఉండాలో కూడా చెప్తూ వ్యక్తిదూషణలు, అసభ్యపు వర్ణనలు లేకుండా సులభమైన శైలిలో, మానవ కల్యాణ ధ్యేయంగా ఉండాలని చెప్పింది


1938 లోనే పసుపులేటి లలితా దేవి ‘స్త్రీలు పత్రికా సంపాదకులుగా ఉంటే’ (అక్టోబరు 1938, గృహలక్ష్మి) అనే వ్యాసంలో- దేశ క్షేమం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, స్త్రీలకు సులభంగా అర్థమయ్యే రీతిలో లౌకిక, నైతిక, ఆర్థిక, రాజకీయ విషయాలను బోధిస్తే, కాలానుగుణంగా దేశానుగుణంగా వస్తున్న మార్పులకు తగినట్లుగా స్త్రీల భావాలలో మార్పు వస్తుందని సూచించింది. స్త్రీలే ఈ వ్యాసాలను రాసి పత్రికలద్వారా తెలియచేయాలని భావించింది.


1938లో ఆచంట సత్యవతమ్మ ‘అభ్యుదయానికి అవసరమైన రచనావిధానం’ అనే శీర్షికన రాస్తూ (అక్టోబరు 1938, గృహలక్ష్మి) రాజ్యం, రాష్ట్రం, స్వాతంత్ర్యేచ్ఛ, రాష్ర్టాదాయ వ్యయ విమర్శనాదికములు స్వకీయ, పరకీయంగా వ్యయమగుచున్న విషయాలు దేశచారిత్రక విషయాలు, స్త్రీల అభ్యుదయానికి అనుకూలించే విజ్ఞానాన్ని అందించే రచనలు ఉండాలని చెప్పింది. ఆర్థిక వ్యవస్థకు ప్రజల అభ్యుదయానికి ఉన్న సంబంధాన్ని ప్రతిపాదిస్తూ, ప్రత్యేకంగా స్త్రీల అభ్యుదయం సాహిత్య ప్రయోజనంగా ఉండాలని భావించింది.


1938లో మో. మాణిక్యాంబ రాసిన ‘స్త్రీల అభ్యుదయము-రచనలు’ అనే వ్యాసంలో స్త్రీల అభ్యుదయం కావాలంటే స్త్రీత్వంతో, భారతీయత్వంతో ఉద్రేకపూరితాలయిన రచనల అవసరం ఉందని తెలిపింది. బోనులో మగ్గిన భారతసింహాలను స్వరాజ్యసమరాగ్నిలో దూకించటానికి ఆంధ్ర స్త్రీగా వీర, శాంతి, సత్య,దయా, శౌచములను వెల్లడించే రచనలు రావాలంది. ఇది దేశ స్వాతంత్ర్యోద్యమ సమయంలో చెప్పిన సాహిత్యప్రమాణం. ‘‘స్త్రీలహృత్తంత్రులను మ్రోగించాలి. స్త్రీల అహాన్ని రేకెత్తించాలి. అట్టి భావరచనలే స్త్రీలఅభ్యుదయాన్ని ఉద్భవింపచేసేవనడంలో పొరపాటుండదు’’ అని రచయిత్రి నిష్కర్షగా అభిప్రాయాన్ని చెప్పింది. 


1939లో గుమ్మడిదల దుర్గాబాయమ్మ ‘స్త్రీజాతి దృక్పథం’ అనే వ్యాసంలో (జూన్‌ 1939, గృహలక్ష్మి) ‘‘స్త్రీ జనసమస్యలపై అనేక గ్రంథాలు కనపడతాయి. కాని పురుషజాతి సమస్యపై వెతికిపట్టుకొందామన్నా పుస్తకం దొరకదనీ, వింతయేమిటంటే మహిళాసమస్యలపై గల గ్రంథాలన్ని నిజానికి పురుష జాతి సమస్యలకు సంబంధించినవే- అంటే స్త్రీజనాభివృద్ధికి పురుషులు ఏమి చెయ్యాలి అనే విషయాన్ని చర్చించేవే’’ అని చెప్పింది. 


1940లో ‘స్త్రీ వాఙ్మయము’ అనే శీర్షికన (జులై 1940, గృహలక్ష్మి) చేబ్రోలు సరస్వతి రాస్తూ జాతీయతకు. వాఙ్మయానికి అవినాభావసంబంధమెల్ల కాలముంటుంది కాబట్టి జాతిస్వేచ్ఛ, స్త్రీల స్వేచ్ఛను పెంపొందించటం సాహిత్య ప్రయోజనంగా భావించింది. మరింతగా స్త్రీల సాహిత్యం రావాల్సిన అవసరాన్ని చెప్పింది.


1940లో ‘సజీవమైన వాఙ్మయం కావాలి-కవిత్వమున్నది కాని నిర్మాణంలేదు’ అనే శీర్షికన రోహిణి రాస్తూ (అక్టోబరు 1940, గృహలక్ష్మి), ఆధునికరచన పూర్వపు దారిని పోయినదే తప్ప స్వతంత్ర రచన కానరావటం లేదనీ, శాశ్వతంగా నిలిచి కొత్తదనానికి మార్గదర్శకత్వం కాగలిగిన గ్రంథాలు నిర్మితం కావాలనీ, పరదాస్య ప్రకృతి అనే తమస్సులో ఉండక ఇది సజీవమైన వాఙ్మయం, ఇది స్త్రీలచే నిర్మాణమైందని చెప్పుకోగల రచన సృష్టింపబడాలని చెప్పింది.  


1940 లోనే వట్టికొండ విశాలాక్షి ‘సజీవమైన వాఙ్మయం కావాలి- అనే శ్రీమతి ‘రోహిణి’గారి సారస్వత హెచ్చరికకు కొత్తవెలుగులు’ అంటూ వ్రాసిన వ్యాసంలో (డిసెంబరు 1940, గృహలక్ష్మి)  మంచి సాహిత్యం సన్నగిల్లటానికి కారణం జాతిదౌర్బల్యం అనీ, సాహిత్యం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలని చెప్పింది. స్త్రీలకు సమాన హక్కులు ఉంటే స్త్రీల సాహిత్యం మరింతగా సృజింపబడుతుందని భావించింది. ప్రజాస్వామికతయే సాహిత్య ప్రయోజనం అని ప్రామాణీకరించింది.


1941లో భావరాజు రాజరత్నమ్మ రాసిన ‘చర్చ’ అనే నాటకంలో ఒక స్త్రీ, ఒక పురుషుని సంభాషణలో భాగంగా- స్త్రీల హృదయంలో ప్రేమ స్వభావం ఉన్నా కూడా దానిని బాధిస్తే అక్కడే ద్వేషం కూడా పుడుతుందనీ, అందుకే పితృస్వామ్యాన్ని వ్యతిరేకించే భావాలతో సాహిత్య రచనలు వస్తేనే సాహిత్యప్రయోజనం ఉంటుందని చెప్పింది. 


1943 వట్టికొండ విశాలాక్షి రాసిన ‘అభ్యుదయ గీతాలు’ అనే కవితా సంపుటిలో ‘నవకవీ’ అనే గీతంలో ‘‘వీరవనితల చరిత వేయి రీతుల పాడి స్త్రీజాతి మేల్కొల్పి తీర్చుకో నీ ఋణం’’ అని ఆధునిక కవిని సంబోధిస్తూ తెలిపింది. అంతేకాదు, ‘‘కనుమోయి నీ చుట్టు కలత చెందే ప్రజల ఆహారమేలేక అలమటించే ప్రజల’’ గురించి రాసి సారస్వతాన్ని సత్పథము త్రొక్కింపచేయమన్నది. బాధితస్త్రీలను, తిండిలేని పేదప్రజలను గురించిన సాహిత్యం రావాలనీ, అదే అభ్యుదయ కవిత్వమని చెప్పింది.


1946లో వట్టికొండ విశాలాక్షి రాసిన ‘శపథం’ (మార్చి 1946, తెలుగుతల్లి పత్రిక) అనే కవితలో ‘హృదయనేత్రముకగుపడేదీ, హృదయసీమలకెగబడేదీ, కష్టనిష్టుర లోకవృత్తము కావ్యవస్తువుగా’ చేసుకొని జగత్తునకు అభ్యుదయమొనర్చమని చెప్పింది. అంతేకాదు, తాను ‘‘కష్టములు ఎన్నైనా రానీ, నిష్టురములెన్నైనా రానీ, ఇష్టపడి స్త్రీజాతికొరకే కష్టపడగలన’’ని కవితా శపథం చేసింది. 


స్త్రీల సాహిత్య విమర్శ ప్రమాణాలలో 1936 నుండి మార్క్సిజమ్‌, సోషలిజమ్‌ ప్రభావం కనపడుతుంది. 1943లో ఆంధ్రాభ్యుదయరచయితల సంఘం ఏర్పడిన తరువాత అభ్యుదయ కవిత్వం ప్రాధాన్యత పెరిగింది.


ఆధునిక కాలంలో మారుతున్న సామాజిక చలన సూత్రాలకు అనుగుణంగా స్వేచ్ఛా స్వాతంత్య్ర భావాలు, ప్రజాస్వామిక ఆలోచనలు పెరిగి సమసమాజ హితం కోరుకుంటూ సమాజసంస్కరణ, అభ్యుదయ భావాలు పెరిగాయి. ఆ క్రమంలోనే కావ్యతత్త్వానుశీలన దశకు చేరిన విమర్శ సంస్కృతీసంస్కరణ దిశగా సాగటం, మానవ సంబంధాలలోని ఆర్థిక అసమానత్వాలు స్పష్టమై మార్క్సిజం దిశగా సాగి సాహిత్య ప్రమాణాలను సూత్రీకరించటం జరుగుతోంది.


1960ల నుంచి అంతర్జాతీయ ప్రభావంతో మార్క్సిజమ్‌ దృక్పథంతో సాహిత్యసూత్రాలు అభివృద్ధి చెందాయి. వాటి మౌలికత విస్తరించి అర్థవాద (ఆర్థిక), అస్తిత్వవాద, స్త్రీవాద, దళితవాద, బహుజనవాద పక్షంగా సాహిత్యం ఉండాలన్న దృక్పథం బలపడింది. స్త్రీవాద సాహిత్యమూ నూతన పోకడలు పోయి, సాహిత్య ఆకాశంలో సగంగా వ్యాప్తి చెందింది. ప్రపంచీకరణ సందర్భంలో మారుతున్న ఆర్థిక-రాజకీయ, సామాజిక-సాంస్కృతిక పరిస్థితులలో కుల, వర్గ, ప్రాంతీయముల వంటి అసమానతలను వ్యక్తం చేస్తూ సాహిత్య సృజన విస్తరించింది. 

జె. కనకదుర్గ

94911 40299

Updated Date - 2021-08-16T09:17:39+05:30 IST