దిక్కుతోచని పరిస్థితుల్లో ఉపయోగపడే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? సాధారణ ఎఫ్ఐఆర్‌కి దీనికి ఉన్నతేడా ఏమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-14T13:20:14+05:30 IST

ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) గురించి మనందికీ తెలుసు.

దిక్కుతోచని పరిస్థితుల్లో ఉపయోగపడే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? సాధారణ ఎఫ్ఐఆర్‌కి దీనికి ఉన్నతేడా ఏమిటో తెలుసా?

ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) గురించి మనందికీ తెలుసు. కానీ జీరో ఎఫ్‌ఐఆర్ లాంటి విధానం ఒకటి ఉందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కొన్నిసార్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తారు. జరిగిన సంఘటన తమ ప్రాంతానికి చెందినది కాదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జీరో ఎఫ్ఐఆర్ అవసరమవుతుంది. ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్ గురించి తెలుసుకుందాం. జీరో ఎఫ్‌ఐఆర్ కూడా ఎఫ్‌ఐఆర్ లాంటిదే. ఈ రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే.. సంఘటన జరిగిన ప్రదేశంలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడాన్ని ఎఫ్‌ఐఆర్ అంటారు. అయితే ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసు నమోదు చేయడాన్ని జీరో ఎఫ్‌ఐఆర్ అని అంటారు. ఇలా నమోదైన కేసును ఆ తరువాత సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తారు. 


2012లో ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్ రేప్ తర్వాత దేశంలో అనేక న్యాయ సంస్కరణలు వచ్చాయి. ఇలాంటి కేసుల కోసం కఠిన చట్టాలు చేసేందుకు, పాత చట్టాలను సవరించేందుకు అప్పట్లో జస్టిస్ వర్మ కమిటీని ఏర్పాటు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ను ఈ కమిటీ సూచించింది. తీవ్రమైన నేరాలు జరిగినసందర్భంలో దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ ఫిర్యాదు చేయవచ్చని కమిటీ సూచించింది. ఇలాంటి సందర్భాల్లో స్టేషన్ పరిధికి సంబంధించిన అంశం అడ్డంకి కాదని పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ తర్వాత పోలీసులు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మహిళలపై జరిగే క్రూరమైన నేరాలకు వ్యతిరేకంగా జీరో ఎఫ్‌ఐఆర్ సమర్థవంతమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఏ సంఘటన జరిగినా జాప్యం జరగకుండా చూడటం ఈ జీరో ఎఫ్ఐఆర్ ఉద్దేశం. కేసు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రానప్పటికీ చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి చేయడం, కేసును త్వరగా తరలించి, దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడటం ఈ రకమైన ఎఫ్‌ఐఆర్ ముఖ్య లక్ష్యం. ఫిర్యాదు, కేసు గుర్తించదగినది అయినప్పుడు, పోలీసులు ఇటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే కాకుండా ప్రాథమిక విచారణ కూడా చేస్తారు. ప్రాథమిక ఆధారాలు ధ్వంసం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సివుంటుంది. అనంతరం ఈ ఎఫ్‌ఐఆర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌కు అప్పగించాల్సివుంటుంది. ఈ విధంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను జీరో ఎఫ్‌ఐఆర్ అని అంటారు. అత్యాచార సంబంధిత ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే బాధితురాలికి వైద్యం అందించాల్సి ఉంటుంది. జీరో ఎఫ్‌ఐఆర్ అందుకున్నాక పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సివుంటుంది. కేంద్ర హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2015లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జీరో ఎఫ్ఐఆర్ సర్క్యులర్ జారీ చేసింది. 

Updated Date - 2022-01-14T13:20:14+05:30 IST