ఇదేంది ‘సామీ’.. ఇలాగేనా చేసేది..!

ABN , First Publish Date - 2021-08-19T04:49:14+05:30 IST

‘మేమిచ్చే యంత్రం తీసుకుంటే..

ఇదేంది ‘సామీ’.. ఇలాగేనా చేసేది..!
స్వామీజీ, ఇద్దరు శిష్యులను ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న కానిస్టేబుల్‌

యంత్రం తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పుకొచ్చిన స్వామీజీ

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మబలికిన వైనం

పోలీసులకు అప్పగించిన ముషిడిపల్లి యువత

ముగ్గురి అరెస్టు


శృంగవరపుకోట: ‘మేమిచ్చే యంత్రం తీసుకుంటే.. ఏళ్ల తరబడి పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుంది.. ఉద్యోగం రాని వారు ప్రభుత్వ కొలువు చేపడతారు. ఈ యంత్రాల గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. అలాగే యంత్రాలు తెరిచి చూస్తే పేలిపోతాయి’ అంటూ ఓ స్వామీజీ అవతారి, ఆయన శిష్యులు గిరిజనులను నమ్మించారు. వారి నుంచి రూ.వేలల్లో వసూలు చేశారు. మొదటి రోజు వారి ఆటలు సాగినప్పటికీ రెండోరోజు గ్రామ యువత మోసాన్ని పసిగట్టి వారిని పోలీసులకు పట్టించారు. మండలంలోని ముషిడిపల్లిలో ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఎస్‌.దుర్గారావు, విశాఖపట్నం జిల్లా వాడపల్లికి చెందిన సతీష్‌, కె.దుర్గారావు అనే వ్యక్తులు మంగళవారం ఉదయం ముషిడిపల్లి వచ్చారు. తొలుత సతీష్‌, కె.దుర్గారావులు శిష్యులుగా గ్రామస్థులు కొందరికి పరిచయం చేసుకుని వివరాలు సేకరించారు. గ్రామంలో పిల్లలు లేక, ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వారి గురించి తెలుసుకుని ఇళ్లకు వెళ్లారు.


మీ సమస్యలన్నీ తమ గురూజీ తీరుస్తారని చెప్పి ఎస్‌.దుర్గారావు(స్వామీజీ అవతారి)ని రంగప్రవేశం చేయించారు. అనంతరం ఆరువేల రూపాయలు ఇస్తే యంత్రాలు, పూజ చేసిన సామగ్రి ఇస్తామని.. అది దాచుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్పి సుమారు 9 మంది నుంచి రూ.53వేలు వసూలు చేశారు. ఈ యంత్రాల విషయం ఎవ్వరికీ చెప్పకూడదని, తాను ఇచ్చిన వస్తువులు తెరిచి చూస్తే పేలిపోతాయని వారిని భయపెట్టారు. నిజమని నమ్మిన గిరిజనులు విషయాన్ని పిల్లలకు చెప్పలేదు. కానీ ఆనోటా..ఈనోటా పాకడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు మోసపోయినట్లు గుర్తించారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలని భావించారు. ముందురోజు డబ్బులు బాగా వసూలు చేసిన స్వామీజీ బృందం బుధవారం ఉదయం కూడా అవే మాటలతో నమ్మబలకడం ప్రారంభించారు.


యువకుడు ముత్యాల సన్యాసిరావును కలిశారు. అప్పటికే విషయం తెలుసుకున్న సన్యాసిరావు వారిని గ్రామ రామాలయానికి తీసుకువెళ్లి లోపల కూర్చోండని చెప్పి తలుపులకు తాళాలు వేసేశాడు. అనంతరం ఎస్‌.కోట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈలోపు అక్కడకు చేరుకున్న గ్రామ పురోహితుడు దొంతుకూరి సాయికుమార్‌శర్మ వారి వివరాలు అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పారు. అంతలో మోసపోయిన బాధితులు వచ్చి పోలీస్‌కానిస్టేబుళ్లకు వివరాలు చెప్పారు. వీరిని గ్రామానికి చెందిన ఆటోలో ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులపై చీటింగ్‌ కేసు నమోదు చేశామని, వారి నుంచి రూ.30వేలు స్వాధీనం చేసుకుని గిరిజనులకు అందజేశామని సీఐ సింహాద్రినాయుడు తెలిపారు. 



Updated Date - 2021-08-19T04:49:14+05:30 IST