ఇవేం పుష్కరాలు?

ABN , First Publish Date - 2020-11-21T06:33:46+05:30 IST

తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యాయి.

ఇవేం పుష్కరాలు?
మంత్రాలయం సంత మార్కెట్‌ దగ్గర పనులు చేస్తున్న కూలీలు

  1. ఇంకా సాగుతున్న ఘాట్ల నిర్మాణం
  2. పని చేయని పుణ్యస్నానం షవర్లు
  3. నదీ తీరంలో పందుల సంచారం
  4. ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తి


కర్నూలు/రూరల్‌/అగ్రికల్చర్‌/ఆంధ్రజ్యోతి, నవంబరు 20: తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యాయి. రాష్ట్రంలో జిల్లాకు మాత్రమే పరిమితమైన పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. సకాలంలో పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం గొప్పలు చెప్పింది. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం రూ153 కోట్లు విడుదల చేసింది. కానీ పుష్కరాల ప్రారంభోత్సవం రోజు కూడా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 పుష్కర ఘాట్లలో సగానికి పైగా పనులు పూర్తి కాలేదు. సీఎం పూజ కార్యక్రమాలు నిర్వహించిన సంకల్‌ బాగ్‌ వీఐపీ ఘాట్‌లోనే షవర్లు సరిగా పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘాట్లలో ఒక వైపు పురుషులకు, మరోవైపు మహిళలకు షవర్లు ఏర్పాటు చేశారు. ఇవి సరిగా పనిచేయక పోవడంతో చాలా మంది క్యాన్లు, జగ్గులలో నింపుకుని స్నానాలు చేశారు. మునగాలపాడు పుష్కర ఘాట్‌కు వెళ్లే దారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో, అవి ఎక్కడ ఉన్నాయో తెలిపే సూచిక బోర్డులు కూడా కనిపించలేదు. ఇలా ఎక్కడికక్కడ అధికారుల నిర్లక్ష్యం బయటప డుతోంది. పుణ్యస్నానాలు లేవన్నారు, కనీసం జల్లు స్నానాలకైనా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 


ఘాట్ల నిర్మాణం అధ్వానం

గొందిపర్ల, పంచలింగాల ఘాట్లలో నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. గొందిపర్లలో పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్‌ బెడ్‌ను గురువారం రాత్రి హడావుడిగా నిర్మించారు. పూర్తిగా క్యూరింగ్‌ కాలేదు. దీంతో శుక్రవారం ఉదయం పెచ్చులు ఊడి కంకర తేలింది. చుట్టుపక్కల ఎటుచూసినా మోకాళ్ళ లోతు బురద ఉండడంతో భక్తులు నడవలేక ఇబ్బంది పడ్డారు. చాలామంది భక్తులు పుష్కర స్నానం ఆచరించడానికి ఆసక్తి చూపలేదు. భక్తుల కోసం ఏర్పాటు చేయాల్సిన మినరల్‌ వాటర్‌ సరఫరా అస్తవ్యస్తంగా సాగింది. లూజు వాటర్‌, వాటర్‌ ప్యాకెట్లు, మినరల్‌ వాటర్‌ బాటిల్‌ వంటి మూడు రకాల తాగునీటిని భక్తులకుఅందించాలి. కాంట్రాక్టర్ల నిర్వహణ లోపంతో కేవలం లూజు వాటర్‌ పంపిణీకే పరిమితమ య్యారు. గొందిపర్ల, పంచలింగాల, సుంకేసుల పుష్కర ఘాట్ల వద్ద మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. 


ఘాట్ల వద్ద పందులు

పవిత్రంగా నిర్వహించాల్సిన పుష్కరాలు అభాసుపా లవుతున్నాయి. ఘాట్లలో పందులు విహరిస్తున్నాయి. నగరేశ్వర ఘాట్‌లో పందులు సంచరిస్తున్నాయి. కర్నూలు రోడ్ల మీద, నదీ తీరాల్లో పందులు తిరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. కానీ పందుల నియంత్రణ పెద్దగా పట్టించుకోలేదు. పందులు తిరిగే ప్రాంతంలోనే పుష్కర స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

తుంగభద్ర పుష్కరాల మహోత్సవం ఆర్భాటంగా, ఉత్సాహంగా మొదలవుతుందని ఆశించిన కర్నూలు నగర ప్రజలలు నిరాశ చెందారు. నగరంలోని పుష్కరాల ఘాట్ల వద్ద శుక్రవారం అలాంటి వాతావరణం ఏ మాత్రం కనిపించలేదు. సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసిన నాగ సాయిబాబా పుష్కరఘాట్‌, సాయిబాబా పుష్కర ఘాట్ల వద్ద భక్తులు నామమాత్రంగా కనిపించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఘాట్లు వెలవెలబోయాయి. పరిసర కాలనీల చిన్నారులు మాత్రమే అక్కడ కనిపించారు. 

భక్తులు భారీగా వస్తారని జిల్లా అధికార యంత్రాంగం నాగసాయి బాబా ఆలయం వద్ద, షిరిడీ సాయిబాబా గుడి వద్ద ఏర్పాట్లు చేశారు. షవర్లు, మెడికల్‌ క్యాంపులు, మంచినీరు అందుబాటులో ఉంచారు. ఎవరూ రాకపోవడంతో అధికారులు, సిబ్బంది స్టాళ్లకే పరిమితమయ్యారు.

రాంభొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌ వద్ద స్థానికులు కొందరు పుష్కర దేవతకు పూజలు నిర్వహించారు. చాలా మంది షవర్ల కింద కాకుండా నదిలో నీటిని బాటిళ్లు, బిందెలలో నింపుకుని స్నానం చేశారు. నాగసాయిబాబా గుడిలో భక్తులకు అన్నదానం చేశారు.

సంకల్‌బాగ్‌ సమీపంలోనే ఉన్న జామా మసీదు, అమీన్‌ ఖాదర్‌ కాలనీ వద్ద సంపులను ఏర్పాటు చేశారు. కాలనీల్లోని మురుగునీటిని నదికి దూరంగా తరలించే ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని చోట్ల మురుగునీరు నదిలోనే కలుస్తోంది. సంకల్‌బాగ్‌ను ఆనుకునే ఉన్న జామామసీదు కాలనీ వద్ద మురుగునీరు మోరీ కింద నుంచి ప్రవహించి నదిలో కలుస్తోంది. 


ఘాట్ల వద్ద బురద

ఎమ్మిగనూరు: మంత్రాలయంలో ఇంకా పుష్కరాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వేడుకలు మొదలైనా పనులు పూర్తి కాలేదు. దుమ్ము ధూళి, బురద, రాళ్లు తేలిన రహదారుల్లో భక్తులు ఇబ్బందులు పడుతూ ఘాట్‌ వద్దకు చేరుకుంటున్నారు. ఘాట్‌ వద్ద షవర్‌ బాత్‌ సిద్ధం కాలేదు. దీంతో భక్తులు నదిలో స్నానాలు చేశారు. సంత వద్ద అప్రోచ్‌ రోడ్‌ పూర్తి చేసినా నదిలోకి వెళ్లే కల్వర్టు, నదిని ఆనుకుని నిర్మిస్తున్న కాల్వ అసంపూర్తిగా ఉన్నాయి. షవర్‌బాత్‌ల వద్ద బురద పేరుకుపోయింది. అప్పటికప్పుడు తొలగింపు చేపట్టారు. వినాయక ఘాట్‌ వద్ద సీసీ రోడ్లు, ఘాట్‌ పనులు, మరుగుదొడ్లకు పైపులైన్‌ పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వీఐపీ ఘాట్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి. దీంతో ఆ ఘాట్ల వైపు భక్తులు కన్నెత్తిచూడటం లేదు. కాచాపురం వద్ద ఘాట్‌ పూర్తయినా షవర్‌బాత్‌ పనులు పూర్తి కాలేదు. ఘాట్‌ వద్ద మైదానాన్ని శుభ్రం చేయలేదు. నందవరం మండలం గురుజాలలో రామలింగేశ్వర ఆలయం పక్కన ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు క్యూరింగ్‌ పూర్తి కాలేదు. నాగులదిన్నె సమీపంలో రహదారి ప్యాచ్‌ వర్కులు సాగుతున్నాయి. నాగులదిన్నె, గురుజాలకు వెళ్లే రహదారికి ఇరువైపులా గరుసు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఇవి పుష్కరాలు పూర్తి అయ్యేలోగా పూర్తి  కావడం అనుమానమే. 


అధికారుల నిర్లక్ష్యం..

అధికారుల నిర్లక్ష్యంతోనే పుష్కర ఘాట్ల పనులు ఆలస్యమయ్యాయి. కాంట్రాక్టర్లు తక్కువ సమయంలో పనులు చేపట్టడంతో నాణ్యత లోపించింది. గొందిపర్ల ఘాట్‌ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో విద్యుత్‌ అధికారులు సహకరించడం లేదు. భక్తులకు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. 15 రోజుల నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఘాట్ల వద్ద పది అడుగుల లోతు సిమెంట్‌ బెడ్‌ వేయాల్సి ఉండగా పైపైనే పనులు చేసి మమ అనిపిస్తున్నారు. - మద్దిలేటి, గొందిపర్ల.

Updated Date - 2020-11-21T06:33:46+05:30 IST