మా ఊరికి దారేది ?

ABN , First Publish Date - 2022-08-17T05:25:21+05:30 IST

ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతూ అంతరిక్షానికి చేరుకునేందుకు ఉవ్విల్లూరుతున్న సమయంలో ఇప్పటికి కనీసరోడ్డుమార్గం లేక జిల్లాలో అనేక పల్లెలు తల్లడిల్లుతున్నాయి.

మా ఊరికి దారేది ?
బురదమయంగా మారిన పెంబి మండలంలోని యాపల్‌గూడ రోడ్డు

జిల్లాలో మారుమూల పల్లెకు మార్గం కరువు 

రోడ్లు, వంతెనలు లేక రాకపోకలకు తిప్పలు 

ఆధునికత విస్తరిస్తున్నా అందని రహదారి సౌకర్యం 

కిలోమీటర్ల పొడవునా కాలి నడకే శరణ్యం 

అటకెక్కుతున్న అభివృద్ది పథకాలు 

ప్రతిపాదనలకే పరిమితమవుతున్న నిధుల వ్యవహారం 

నిర్మల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచమంతా ఆధునికత వైపు పరుగులు పెడుతూ అంతరిక్షానికి చేరుకునేందుకు ఉవ్విల్లూరుతున్న సమయంలో ఇప్పటికి కనీసరోడ్డుమార్గం లేక జిల్లాలో అనేక పల్లెలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వం రోడ్ల నిర్మాణాల కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు జారీచేస్తున్న ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితమైపోతున్నాయన్న విమర్శలున్నాయి. రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధిపథంలో పయనిస్తున్నట్లు చెప్పుకుంటున్న జిల్లాలో అనేక మారుమూల పల్లెలకు ఇప్పటికి కనీసస్థాయిలో రోడ్డుసౌకర్యం లేకపోవడం ప్రాఽధాన్యతను సంతరించుకుంటోంది. తమకు రోడ్డు మార్గాలు కా వాలని మారుమూల గ్రామాల పల్లెల ప్రజలు ఇప్పటికీ అనేక సార్లు ఆం దోళనలు చేసినప్పటికీ వారి ఆందోళనలన్నీ అరణ్యరోదనగానే మారుతున్నాయి. ప్రభుత్వ విఽధానలోపం ఓ వైపు అటవీశాఖ ద్వారా ఏర్పడుతున్న నిబంధనల ప్రతిబంధకాలు మరోవైపు రోడ్ల నిర్మాణానికి శాపంగా మారుతోంది. దీనికి తోడు పాలకుల చిత్తశుద్ధి కూడా పల్లెవాసులకు రహదారి మార్గాన్ని చేరువచేయలేకపోతోంది. రోడ్లతో పాటు వంతెనల నిర్మాణాలు కూడా జరగని కారణంగా ఇప్పటికీ చాలా మారుమూల గ్రామాల పల్లెల ప్రజలు వాగులు, వంకలు దాటాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాల కారణంగా వాగులు ఉప్పొంగితే తమ గ్రామాలకు చేరుకోలేక రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని పెంబి, దస్తూరాబాద్‌, ఖానాపూర్‌, కడెం, సారంగాపూర్‌, మామడ, కుభీర్‌ తదితర మండలాల్లోని అనేక మారుమూల పల్లెలు రోడ్డుసౌకర్యం కోసం ఏళ్ల నుంచి తల్లడిల్లుతున్నాయి. జిల్లాలో మొత్తం 73 ట్రైబల్‌ హాబిటేషన్‌లు ఉండగా ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్లతో అధికారులు రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించారు. అయితే గత రెండేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. గిరిజన సంక్షేమశాఖకు సైతం ఈ రోడ్ల నిర్మాణం కోసం ఆశించిన మేరకు నిధులు మంజూరు కావడం లేదు. దీంతో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దశాబ్దాల నుంచి రోడ్డు సౌకర్యానికి నోచుకోక చాలా గ్రామాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నప్పటికీ పాలకులు మాత్రం రహదారుల సమస్యను కనీసస్థాయిలో కూడా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

దయనీయంగా మారు‘మూలాలు’

జిల్లాలోని అనేక మారుమూల పల్లెల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. రహదారుల సౌకర్యం లేని ఈ మారుమూల గ్రామాలు కిలో మీటర్ల కొద్ది కాలినడకపోతే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. పెంబి మండలంలోని యాపల్‌ గూడ, రాంనగర్‌, నాయక్‌గూడ, దొంధరి, వస్‌పల్లి, చాకిరేవు, గుమ్మెన ఎంగ్లాపూర్‌, రాయదారి, పోచంపల్లి, అంకెన, కర్ణం లొద్ది, కొర్‌కంటి, రాగిదుబ్బ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఆ గ్రామాలు ఇబ్బందుల పాలవుతున్నాయి. అలాగే ఖానాపూర్‌ మండలంలోని ఆదివాసులు ఎక్కువగా నివసించే జిల్లెడుకుంట గ్రామం, దస్తూరాబాద్‌ మండలంలోని అకొండపేట్‌ గ్రామపంచాయతీ పరిధిలో గల గోం డుగూడెం గ్రామాలకు రోడ్డుసౌకర్యం లేని కారణంగా ఆ గ్రామాల ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. సారంగాపూర్‌ మండలంలోని పెండల్‌ధరి, మామడ మండలంలోని వాస్తాపూర్‌, రాంపూర్‌, పోచమ్మ గూడ, రచ్చకోట, మల్కాపూర్‌, పులిమడుగు, పోచమ్మ గూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. అలాగే కడెం మండలంలోని గంగాపూర్‌, దత్తోజీపేట, మైసంపేట, ఇస్లాంపూర్‌, అల్లంపెల్లి, అద్దాల తిమ్మాపూర్‌, కొర్ర తాండ, రాణిగూడ, బాబా నాయక్‌ తాండ, గుర్రం మదిరే, మిద్దచింత, బాబా నాయక్‌ తాండతో పాటు తదితర మారుమూల గ్రామాలకు ఇప్పటి వరకు కూడా రోడ్డు సౌకర్యం సమకూర్చలేదు. అలాగే కుభీర్‌ మండలంలోని డోడర్న పరిధిలో గల గిరిజన తాండలు రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదు. రాంనాయక్‌ తాండ, దౌజీ నాయక్‌, కిసాన్‌నాయక్‌, సాయి నగర్‌తాండల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక అవస్థల పాలవుతున్నారు. ఈ గ్రామాలన్నీ మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న కారణంగా ఇరువైపులా రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. 

నేతల హామీలు బుట్టదాఖలు

కాగా మారుమూల పల్లెలన్నింటికి రోడ్డుసౌకర్యం కల్పిస్తామంటూ రాజకీయ నాయకులు చేస్తున్న హామీలన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు ఆ పార్టీల తరపున పోటీచేస్తున్న అభ్యర్థులు సైతం తాము గెలవగానే రోడ్లను నిర్మిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తుండడం సహజమయ్యింది. అయితే ఎన్నికల్లో గెలుపొందిన వారు ఆ తరువాత రోడ్ల నిర్మాణహామీని విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కనీసం ప్రతిపక్షాలు సైతం ఈ రోడ్లపై గళమెత్తకుండా వ్యవహరిస్తుండడం హామీలపై ఆ పార్టీలకున్న చిత్తశుద్ధిని వెల్లడిస్తోందంటున్నారు. ప్రతిపక్షపార్టీలు అధికారపక్షంపై ఒత్తిడి తేవడం, వరుసగా ఆందోళలనలు చేపట్టడం లాంటి చర్యలు చేపడితే హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులు రోడ్ల విషయమై కనీస స్థాయిలో స్పందించే అవకాశం ఉంటుందన్నారు. 

వంతెనల నిర్మాణాలపై పట్టించుకోని వైనం

చాలా గ్రామాలకు రోడ్లసౌకర్యంతో పాటు వంతెనసౌకర్యం లేని కారణంగా వర్షాలు కురిస్తే జనం వాగులు, వంకలు దాటి తమ గ్రామాలకు చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఇక్కడి అనేక మారుమూల గ్రామాలకు వంతెనలు లేకపోవడంతో వర్షకాలంలో వాగులు, వంకలు ఉప్పొంగినప్పుడు ప్రజలు వారి గ్రామాలకు చేరుకోలేని పరిస్థితులు న్నాయి. మరికొంతమంది ఎలాగైనా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రాణాలతో చెలాగాటమాడుతూ వాగులు దాటుతూ ప్రాణ ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలా పలు సంఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకున్నాయి. మరికొంతమంది నాటు పడవలు, తెప్పల సహకారంతో వాగులు దాటాల్సిన పరిస్తితులు ఏర్పడుతున్నాయి. ఇలా సహసోపేతంగా వాగులు, వంకలు దాటుకుంటూ తమ గ్రామాలకు చేరుకునే పరిస్థితులున్నప్పటికి అధికారులు వంతెనల నిర్మాణంపై దృష్టి సారించకపోవడం గమనార్హం. చాలా గ్రామాల ప్రజలు వంతెనలు నిర్మించాలని , రోడ్డు సౌకర్యం కల్పించాలని ఏళ్ల నుంచి కోరుతున్నప్పటికీ ఆ గ్రామాల ప్రజల గోడును పట్టించుకు.నే వారు కరువయ్యారంటున్నారు. ఇకనైనా పాలకులు మారుమూల పల్లెలకు రోడ్లు, వంతెనలు నిర్మించి ఆదు కోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-08-17T05:25:21+05:30 IST