Abn logo
Aug 15 2020 @ 01:07AM

పాఠశాల విద్యకు ప్రాధాన్యమేదీ?

ఉన్నత విద్యా సంస్థల విషయంలో స్పష్టమైన వైఖరిని చూపిన కొత్త విద్యా విధానం పాఠశాల విద్య విషయానికి వచ్చే సరికి తడబడింది. పాఠశాల విద్యను మోదీ ప్రభుత్వం ఒక ప్రజోపయోగ వస్తువు (పబ్లిక్ గుడ్)గా భావిస్తున్నట్టు కన్పించడం లేదు. నిజానికి, పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా తన పరిధిలోకి తీసుకోవడమనేది తన సామర్థ్యానికి మించిన పని అని ప్రభుత్వం అంగీకరించింది.


నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించిన కొత్త విద్యా విధానంలో చాలా మేలుతర, ముఖ్యమైన నిర్ణయాలు ఉన్నాయి. విధాన పత్రం మున్నుడిలోని ఈ ప్రకటనను చూడండి: ‘భారత్ నిరంతరాయంగా సమున్నత శిఖరాల నధిరోహించేందుకు నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ సమకూర్చడం చాలా ప్రధానం. అలాగే ఆర్థికాభివృద్ధి పరంగా అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా వెలుగొందేందుకు; సామాజిక న్యాయం, సమానత్వాన్ని సుసాధ్యం చేసేందుకు, వైజ్ఞానిక ప్రగతికి దోహదం చేసేందుకు; జాతీయ సమైక్యతను పటిష్ఠం చేసేందుకు, మన చిరంతన సంప్రదాయాలను సంరక్షించుకునేందుకు ప్రతి పౌరునికీ ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే మేలు మార్గం’. ఈ నిర్ణయాలను ఎవరైనా ఎలా తప్పుపట్టగలరు? అయితే వ్యక్తమైన భావాల వెనుక ఉన్న వాస్తవ సంకల్పాలనూ మనం అర్థం చేసుకోవాలి. భాష, పాఠశాల విద్యకు సంబంధించి కొత్త విద్యా విధానం వైఖరి ఎలా ఉన్నదో నిశితంగా చూద్దాం. 


పాఠశాల విద్యకు సంబంధించి ఒక ముఖ్యమైన -చాలా చికాకు కలిగించే- సమస్య బోధనా భాష. కొత్త విద్యా విధానం ఇలా పేర్కొంది: ‘కనీసం 5వ తరగతి వరకు మాతృభాష/ ఇంటి భాష/ స్థానిక భాష/ ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా ఉండితీరాలి. వీలైతే ఈ పద్ధతిని 8వ తరగతి వరకు, ఆ తరువాత కూడా కొనసాగించవచ్చు. ఆ తరువాత ఇంటి భాష/ స్థానిక భాషను సాధ్యమైన ప్రతి చోటా ఒక భాషగా బోధించడాన్ని కొనసాగించాలి’. తల్లిదండ్రులు కోరుకున్నట్టయితే బాలలకు ఇంటి భాష/ మాతృభాషను బోధనా మాధ్యమంగా అనుసరించాలన్న ప్రతిపాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండాలని కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అయినప్పటికీ బోధనా మాధ్యమం విషయమై సంపూర్ణ విధాన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సంకోచిస్తున్నది. ఇందుకు కారణాలు స్పష్టమే.


ఇంటి భాషను బోధనా మాధ్యమంగా చేయాలన్న విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నది విదితమే. ఇందుకు కారణాలు: (1) ప్రజలలో గట్టిగా ఉన్న అభిప్రాయాలకు అది పూర్తి విరుద్ధంగా ఉన్నది; (2) లాభాలే లక్ష్యంగా నిర్వహించే ప్రైవేట్ పాఠశాలలను నిషేధించనంతవరకు ఇంటి భాషను బోధనా మాధ్యమంగా అమలుపరచడం సాధ్యం కాదు; (3) 5వ తరగతి లేదా 8వ తరగతి అనంతరం ఇంటి భాష/ స్థానిక భాషను బోధనా మాధ్యమంగా పాటిస్తే నాణ్యమైన విద్యను సమకూర్చాలన్న లక్ష్యం నెరవేరుతుందా? ఈ విషయమై ప్రభుత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతోంది. పాఠశాల విద్యలో ఆంగ్ల భాష ప్రాధాన్యాన్ని పునరుద్ధరించడమనే అంశాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రత్యర్థి సిపిఎంపై ఒక ఆయుధంగా విజయవంతంగా ప్రయోగించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ను మళ్లీ ప్రవేశ పెడుతున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సగర్వంగా ప్రకటించారు. ఇది ఆయన అమలుపరిచిన ఒక అతి ముఖ్య విద్యా సంస్కరణ. 


విద్యారంగంలో త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలని కొత్త విద్యా విధానం నొక్కి చెప్పింది. తద్వారా భాషా సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని చెప్పక తప్పదు. త్రిభాషా సూత్రంలో భాగంగా ప్రథమ భాషను ఒక భాషగా బోధించడంతో పాటు, బోధనా మాధ్యమంగా అమలుపరుస్తారు; ద్వితీయ భాష పాఠశాల విద్య పూర్తయ్యేంతవరకు బోధిస్తారు. మూడో భాషా బోధనా లక్ష్యం ప్రయోజనాత్మక అక్షరాస్యతను సమకూర్చడమే. బాలలు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచిదే. అందునా మన దేశం బహు భాషలకు నెలవు. అయితే ఎన్ని భాషలు, ఏ భాషను, ఎక్కడ, ఎప్పుడు నేర్చుకోవాలనే విషయమై నిర్ణయాన్ని బాల బాలికలకు, వారి తల్లిదండ్రులకు వదిలివేయాలి. బాలలకు ఇటువంటి స్వేచ్ఛ ఉండాలనే విషయాన్ని కొత్త విద్యా విధానం అంగీకరిస్తున్నది. అయితే ఒక మెలిక పెట్టింది. అది సమస్యలను సృష్టిస్తుంది కనుక అందరికీ ఆమోదయోగ్యం కాబోదు. విధానపత్రం ఇలా చెప్పింది: బాలలు నేర్చుకునే మూడు భాషలు ఏవై ఉండాలనే నిర్ణయం రాష్ట్రాలు, ప్రాంతాలదే. విద్యార్థులూ ఈ నిర్ణయంలో కీలక భాగస్వాములన్న వాస్తవాన్ని ఎవరూ విస్మరించలేరు. బాలలు నేర్చుకోవాల్సిన మూడు భాషలలో రెండు విధిగా భారతీయ భాషలై వుండాలి’. ఇంతవరకు బాగానే వున్నది. ఆ తరువాత ఒక పూర్తి పేరాను సంస్కృత భాషకు కేటాయించారు. విధానపత్రం ఇలా పేర్కొంది: ‘పాఠశాల విద్య అన్ని స్థాయిలలోనూ త్రిభాషా సూత్రం అమలులో భాగంగా సంస్కృతాన్ని ఒక ఐచ్ఛిక అంశంగా బోధిస్తారు’. భాషపై ఈ విధానపరమైన నిర్దేశాల వెనుక ఉద్దేశం స్పష్టమే. అదేమీ అమాయకమైనది కాదు. పర్యవసానంగా తమిళనాడులోని అన్ని రాజకీయ పక్షాలు కొత్త విద్యా విధానాన్ని మెత్తంగా వ్యతిరేకించేందుకు ఏకమయ్యాయి. 


సరే, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోండి: ఒక తమిళ విద్యార్థికి ఏ ఇతర భాష భారతీయ భాష అవుతుంది? ప్రభుత్వ మద్దతు, ప్రోత్సాహం ఉన్న కారణంగా అది హిందీ లేదా సంస్కృతమే అవుతుందనేది స్పష్టం. దీన్నిబట్టి మళ్ళీ తమపై ‘హిందీని రుద్దుతారని’ లేదా ‘సంస్కృతం పెత్తనం’ వహిస్తుందనే భయాలు తమిళులను ఆవహించాయి. తత్కారణంగానే తమిళనాడులో కొత్త విద్యా విధానం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అవును, భాషా సమస్యను తమిళ ప్రజలకు సంతృప్తికరంగా పరిష్కరించనంతవరకు తమిళనాడులో కొత్త విద్యా విధానం అంగీకార యోగ్యం కాబోదు. ఇది నిశ్చితమని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మీరు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. హిందీ ఇంటి భాషగా ఉన్న విద్యార్థికి రెండో భారతీయ భాష సంస్కృతమే అవుతుందనేది స్పష్టం. గుజరాతీ, మరాఠీ లేదా పంజాబీ బాలబాలికల ఇంటి భాష హిందీ భాషకు అత్యంత సన్నిహితంగా ఉంటుంది. వారికి ద్వితీయ, తృతీయ భాషలు హిందీ, సంస్కృతమే అవుతాయనడంలో సందేహం లేదు. వీరిలో ఎవరూ సంస్కృతంలో మూలాలు లేని భాష నొకదాన్ని నేర్చుకోవడానికి మొగ్గుచూపరు. అంతేకాదు, మూడు భాషలలో ఒకటిగా ఆంగ్లాన్ని నేర్చుకోవలసిన అవసరమూ వారికి వుండదు! ఇదేమి న్యాయం? వివక్ష స్పష్టంగా కన్పిస్తున్నది. 


ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి కొత్త విద్యా విధానం వైఖరి తేటతెల్లంగా ఉన్నది. రెండు రకాల ఉన్నత విద్యా సంస్థలు- ప్రభుత్వ, ప్రైవేట్ మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. అయితే పాఠశాల విద్య విషయానికి వచ్చేసరికి కొత్త విద్యా విధానం తడబడింది. ప్రభుత్వ, ప్రైవేట్, దాతృత్వ పాఠశాలల గురించి మాట్లాడింది. లాభాల ఆర్జన లక్ష్యంగా నిర్వహించే ప్రైవేట్ పాఠశాలల కొనసాగింపును అనుమతించడాన్ని కొత్త విద్యా విధానం సమ్మతించింది. విధాన పత్రాన్ని నిశితంగా పరిశీలిస్తే పాఠశాల విద్యను మోదీ ప్రభుత్వం ఒక ప్రజోపయోగ వస్తువు (పబ్లిక్ గుడ్ - సమాజం కోసం ప్రభుత్వం లేదా స్థానిక అధికార సంస్థలు ఏర్పాటుచేసిన వస్తువులు లేదా సేవలు. విద్య, ప్రజారోగ్యం ఇందుకు ఉదాహరణలు) గా భావిస్తున్నట్టు కన్పించడం లేదు. ప్రైవేట్ సంస్థలు లాభాల నార్జించేందుకు పాఠశాల విద్య ఒక సుక్షేత్రంగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు అర్థమవుతున్నది. నిజానికి, పాఠశాల విద్యారంగాన్ని పూర్తిగా తన పరిధిలోకి తీసుకోవడమనేది తన సామర్థ్యానికి మించిన పని అని ప్రభుత్వం అంగీకరించింది. 


లాభార్జనే ధ్యేయంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలను అనుమతించిన తరువాత భాష, పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయ ప్రమాణాలు ఇత్యాది ఆంశాలపై కొత్త విద్యా విధానం నిర్దేశించిన లక్ష్యాల పరిపూర్తికి ఒకే విధానాన్ని రూపొందించి, అమలుపరచడమనేది సాధ్యమవుతుందా? సమాధానం స్పష్టమే. అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని ఎలా అధిగమిస్తారు? ప్రైవేట్ పాఠశాలలు వాస్తవానికి వ్యాపార సంస్థలే. గరిష్ఠ స్థాయిలో లాభాలను ఆర్జించడానికే అవి ప్రాధాన్యమిస్తాయి మార్కెట్ కోరిన వాటినే- బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాష, ప్రైవేట్ ట్యూషన్లు, కోచింగ్, శనివారం, ఆదివారం క్లాసులు, భట్టీయం చదువులు మొదలైన వాటిని సమకూర్చడానికే అవి ప్రాధాన్యమిస్తాయి. పాఠశాల విద్య లక్ష్యాలను సాధించడంలో కొత్త విద్యా విధానం విఫలమయితే అందుకు ప్రైవేట్ పాఠశాలలే ప్రధాన కారణమవుతాయనడంలో సందేహం లేదు.(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)


Advertisement
Advertisement
Advertisement