‘ఉపాధి’కి గూడు ఏది?

ABN , First Publish Date - 2021-10-04T04:33:25+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో గ్రామాల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఇతరత్రా భవనాలు, సిమెంట్‌ రోడ్లు ఇలా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఉపాధి క్షేత్రస్థాయి ఫీల్డ్‌ అసిస్టెంట్లు(ఎఫ్‌ఏలు) కూర్చొనేందుకు, రికార్డులు భద్రపరిచేందుకు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రశ్నించారు

‘ఉపాధి’కి గూడు ఏది?
ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్‌)

- కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల మండిపాటు

- గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక గది ఏర్పాటుకు చర్యలు

- ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

(ఇచ్ఛాపురం రూరల్‌)

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో గ్రామాల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఇతరత్రా భవనాలు, సిమెంట్‌ రోడ్లు ఇలా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఉపాధి క్షేత్రస్థాయి ఫీల్డ్‌ అసిస్టెంట్లు(ఎఫ్‌ఏలు) కూర్చొనేందుకు, రికార్డులు భద్రపరిచేందుకు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. ఉపాధి పథకం పనుల నిర్వహణ, కూలీల హాజరు ఇతరత్రా వాటిలో గ్రామస్థాయిలో ఎఫ్‌ఏలు కీలకపాత్ర వహిస్తారు. పనుల రికార్డులు ఎఫ్‌ఏల ఇళ్లలో లేదా మండల కేంద్రాల్లో ఉంటుండగా, అవసరమైన సమయంలో వాటిని అందుబాటులో ఉంచడం లేదని ఉన్నతాధికారులు మండిపడ్డారు. దీంతో వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో ఒక గదిని కేటాయిస్తూ రాత్రికిరాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు సచివాలయం నుంచే విధులను కొనసాగించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సచివాలయాల్లో వారికి ప్రత్యేక గదిని కేటాయించాలని, అలాంటివి లేని చోట్ల నిర్మించాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్‌ ఉత్తర్వురులు జారీ చేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీలను ఆదేశించారు. అక్కడే ఉపాధి పనులకు సంబంధించిన అన్ని రికార్డులు భద్రపర్చాల్సి ఉంటుంది. ఉపాధి పథకం పనుల నిర్వహణ, కూలీల హాజరు ఇతరత్రా రికార్డులు అక్కడే ఉంచనున్నారు. సచివాలయాల ఏర్పాటు తర్వాత కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్లు మండల అధికారుల పర్యవేక్షణలోనే పనిచేస్త్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉండే ఎఫ్‌ఏలను ఇక నుంచి పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ఎంపీడీవో బి.వెంకటరమణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు అందాయని తెలిపారు.  అన్ని సచివాలయాల్లో ఉపాధిహామీ పథకానికి సంబంధించి ప్రత్యేక గది ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.  

Updated Date - 2021-10-04T04:33:25+05:30 IST