ఈ పాలన పేరేమిటి?

ABN , First Publish Date - 2022-08-20T06:15:43+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పండుగ జరుపుకున్నాము కానీ, భారతీయులందరిలో ఒకే ఉద్వేగం, ఒకే సానుకూల ఉత్సాహం ఉన్నదని చెప్పలేము.

ఈ పాలన పేరేమిటి?

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పండుగ జరుపుకున్నాము కానీ, భారతీయులందరిలో ఒకే ఉద్వేగం, ఒకే సానుకూల ఉత్సాహం ఉన్నదని చెప్పలేము. దేశజనాభాలో 1947 కంటె ముందు జన్మించిన వారు స్వల్పసంఖ్యలో మాత్రమే జీవించి ఉన్నారు. అత్యధికులకు జాతీయోద్యమ కాలం నాటి వాతావరణం, తొలినాటి ప్రభుత్వాల పనితీరు, ఆ నాటి సమాజంలోని భావాలు, వాటి మధ్య ఘర్షణలు, ఆ నాటి ఆకాంక్షలు ఇవేవీ పరిచయం లేవు. పుస్తకాలలో చదువుకుంటే తప్ప, పెద్దలు తమ పిల్లలకు చెబితే తప్ప అలనాటి స్ఫూర్తి తెలిసే అవకాశం తక్కువ. మన సినిమాలు, ప్రధాన మీడియాలో ప్రచారమయ్యే విషయాలు చూస్తే, పాకిస్థాన్‌తో పోరాడి మనం స్వతంత్రం తెచ్చుకున్నామన్న అభిప్రాయం కలుగుతుంది. 1960, 70 దశకాలలో యువకులుగా, నడివయస్కులుగా ఉన్నవారి విషయం వేరు. ఆశాభంగాల, ఆవేశాల తరం అది. ప్రజాస్వామ్యాన్ని, హక్కులను, న్యాయాన్ని ప్రభుత్వాన్ని, వ్యవస్థను నిలదీసి సాధించుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, అంతే కాదు, ఎన్నో విజయాలు కూడా. అత్యవసర పరిస్థితిలో ప్రతిపక్షం అన్నది మొత్తంగా నిర్బంధానికి గురి అయితే, అదును దొరకగానే, జాతి యావత్తు ఆధిపత్యాన్ని గద్దెదించి చూపించింది. పెత్తనం, నియంతృత్వం, ఆధిపత్యం, దౌర్జన్యం చెలాయించిన వారిలో కూడా కొన్ని విలువలు ఉండేవని ఇప్పుడు చెప్పుకోవలసి వస్తోంది. గత ఎనిమిదేళ్లుగా దేశంలో వస్తున్న మార్పులను ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి.


విలువలు, ఆదర్శాలు, సామరస్య సహజీవనం వంటి వాటిపై పట్టింపు ఉన్నవారికి దేశం ప్రమాదకర దిశగా పయనిస్తున్నదని అనిపిస్తున్నది. కానీ, అనేకులు, ఈ ప్రమాదాన్నే ఇష్టపడుతున్నారు. నియంత విశాల వక్షస్థలాన్ని చూసి మురిసిపోతున్నారు. మత మైనారిటీలకు గురిపెట్టి జరుగుతున్న భౌతిక, మానసిక హింసాకాండలకు అధిక సంఖ్యాకులు కేరింతలు కొట్టే వాతావరణం ఏర్పడుతున్నది. భావనలుగా మాత్రమే పరిగణించగల చారిత్రక అన్యాయాలను సరిదిద్దేపేరిట, ద్వేషభావాన్ని వ్యాపింపజేస్తూ దానినే దేశభక్తిగా చెలామణి చేస్తున్నారు. సకల ప్రజాస్వామిక వ్యవస్థలనూ నామమాత్రం చేస్తున్నారు. ఇదంతా మంచికేనని, భారత్ అగ్రరాజ్యం అవుతుందని, ఆధునికత ప్రజాస్వామ్యం పేరుతో చెలామణి అవుతున్న బానిస భావాలు పోయి మనుస్మృతే రాజ్యాంగంగా విలసిల్లే రాజ్యం వస్తుందని సంతోషిస్తున్నారు. విప్లవవాదులపై, విమర్శకులపై మాత్రమే కాదు, ప్రత్యర్థిగా నిలిచే ఏ రాజకీయ పక్షం మీద అయినా క్రూర అస్త్రాలను, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడానికి ఏ మాత్రం సంకోచం లేదు. దారుణ అత్యాచారాల విషయంలో మౌనం వహించడానికి మొహమాటం లేదు, ఫిరాయింపులతో ప్రభుత్వాలను మార్చడానికి వెనుకాడడం లేదు. అయినా సమాజంలో ఆమోదం పొందుతున్నారు. ప్రజల సమ్మతి ద్వారా నియంతృత్వాన్ని చెలాయించే ఈ ధోరణిని కొందరు ఫాసిజమని, కొందరు ఫాసిస్టు పోకడ అని, కాదు కేవలం ఆధిపత్యవాదమేనని నిర్వచిస్తుంటారు. దేశంలో ఇప్పుడు నడుస్తున్న పాలన స్వభావం గురించి ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్‌తో ఒక ఇంటర్వ్యూ ప్రచురించింది. మానవశాస్త్రాల ఆచార్యుడు శుభోరంజన్ దాస్ గుప్తా ఈ ఆసక్తికరమైన ఇంటర్వ్యూను నిర్వహించారు.


అక్రమ అరెస్టులు, సుదీర్ఘకాలం నిర్బంధం, బెయిల్ కోసం లేదా విచారణ కోసం దీర్ఘకాల నిరీక్షణ, అక్రమంగా నివాసస్థలాలనుంచి ఖాళీ చేయించడం.. భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నాలుగింటిని తప్పు పట్టారు కదా, ఇవన్నీ పూర్తిస్థాయి ఫాసిస్టు రాజ్యం లక్షణాలే కదా, మన దేశం ఆ దిశగా వెడుతున్నదా లేదా చేరుకున్నామా అన్న ప్రశ్నకు, ప్రభాత్ పట్నాయక్ చెప్పిన సమాధానం ఆసక్తికరమైనదే కాదు, ఆందోళనకరమైనది. పై నాలుగు అంశాలు ఫాసిజం లక్షణాలే కానీ, ఫాసిజం అంటే అది మాత్రమే కాదు. కార్పొరేట్లలో ఒక శ్రేణికి అధికారపార్టీకీ సాన్నిహిత్యం ఉండడం, ఒక నిస్సహాయ మైనారిటీపై ద్వేషాన్ని పెంచుతూ పోవడం, అణచివేతకు నిర్బంధానికి ప్రభుత్వ వ్యవస్థలనే కాక, అసాంఘిక శక్తులనూ ఉపయోగించడం.. ఈ మూడూ కూడా ఫాసిజం ఉనికికి గుర్తులే అని పట్నాయక్ అన్నారు. 1930లలో వచ్చిన ఫాసిజం వంటిది కాదిది, దీన్ని ‘నియో ఫాసిజం’ అనాలి, ఇది బాహాటపు ఫాసిజం కాదు, మారువేషంలోని ఫాసిజం అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఇదేదీ ప్రస్తుత అధికారపార్టీతోనే మొదలయింది కాదు, మూడు దశాబ్దాల కింద నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించినప్పుడే నేటి స్థితికి బీజం పడింది. సంస్కరణల ఫలితాలు అడుగు దాకా అందుతాయి అని చెప్పిన మాటలన్నీ బూటకమని తేలిపోయాక, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఫాసిజం దారి పట్టింది. జర్మనీలో వచ్చిన ఫాసిజం జనాలను చంపింది, ప్రపంచ యుద్ధాన్ని తెచ్చింది, యుద్ధంలో ఓటమి చెంది తానూ నాశనమైంది. భారత్‌లో వస్తున్న ఫాసిజం అటువంటిది కాదు, దీనివల్ల బయటి ప్రపంచంతో యుద్ధమేమీ రాదు, కాబట్టి, దీర్ఘకాలం మనుగడలో ఉంటుంది’’ అని చెప్పారు.


ఇప్పుడున్న రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్నీ ముసుగుగా ఉపయోగించుకుంటూనే తన ఎజెండాను అమలుచేస్తుంది, అప్పుడప్పుడు ముసుగులు తీసేసి నిర్దాక్షిణ్యపు ముఖాన్నీ బయటపెడుతుంది. అధికారపార్టీ సభ్యులే గాంధీ హంతకులను కీర్తించడం, దళితుల రిజర్వేషన్లను అపహరించే విధంగా ప్రయివేటీకరణ చేయడం, అత్యాచారాలు పెరిగిపోవడం ఇవన్నీ నిర్దాక్షిణ్యత లక్షణాలే అంటారు ప్రభాత్ పట్నాయక్. ఇది నియోఫాసిజం మాత్రమే కాదు, అమర్త్య సేన్ అన్నట్టు మతతత్వ ఫాసిజం కూడా అని పట్నాయక్ వ్యాఖ్యానించారు. బిల్కిస్ బానో కేసులో హత్యాచార హంతకులను విడుదల చేయడంలో ఈ బేఖాతరు నిర్దాక్షిణ్యతే ఉన్నదా? రాజకీయకక్షపై ఇన్ని విమర్శలు వస్తున్నా, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ఇంటిపై సిబిఐ దాడులు జరుగుతున్న అఘాయిత్యపు ధోరణిని అట్లాగే అర్థం చేసుకోవాలా? లేదా, ఇదంతా ధర్మరాజ్యానికి రహదారి అని సమాధానపడాలా?

Updated Date - 2022-08-20T06:15:43+05:30 IST