న్యూఢిల్లీ : ట్విటర్ నూతన సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను ఉద్దేశించి బిలియనీర్ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ ఓ మెమెను పోస్ట్ చేశారు. పరాగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, మస్క్ విమర్శించినట్లు కొందరు భావిస్తున్నారు. అంతకుముందు మస్క్ ఇచ్చిన ట్వీట్‌లో భారతీయ ప్రతిభావంతుల వల్ల అమెరికా గొప్పగా లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు.
ట్విటర్ సీఈఓ పదవి నుంచి జాక్ డోర్సీ సోమవారం వైదొలగారు. ఆయన వారసునిగా పరాగ్ అగర్వాల్ ట్విటర్ సీఈఓ పదవిని చేపట్టారు. అంతకుముందు పరాగ్ ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. పరాగ్‌ను సీఈఓగా నియమిస్తున్నట్లు ట్విటర్ నుంచి ప్రకటన రాగానే ఎలన్ మస్క్ భారతీయ ప్రతిభావంతులను ప్రశంసించారు. భారతీయ ప్రతిభ వల్ల అమెరికా లబ్ధి పొందుతోందన్నారు.
ఎలన్ మస్క్ తాజాగా ఓ మెమెను పోస్ట్ చేశారు. సోవియెట్ సోషలిస్ట్ రష్యా నియంత జోసఫ్ స్టాలిన్, ఆయన సహచరుడు నికొలాయ యెఝెవ్‌ల ఫొటోను దీని కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఫొటోలోని స్టాలిన్ తలకు బదులుగా పరాగ్ తలను ఫొటోషాప్ చేసి పెట్టారు. అదేవిధంగా నికొలాయ్ తల స్థానంలో జాక్ డోర్సీ తలను పెట్టారు.
సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌పై వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి గతంలో పరాగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఈ విధంగా స్టాలిన్ శరీరానికి పరాగ్ తలను పెట్టి ఎలన్ మస్క్ విమర్శించారని కొందరు అంటున్నారు. అయితే ఈ మెమెకు ఎటువంటి వ్యాఖ్యను మస్క్ జోడించలేదు.
స్టాలిన్ సహచరుడు నికొలాయ్ ఆయన ఆదేశాల మేరకు హత్యకు గురయ్యారు. ట్విటర్ సీఈఓగా సోమవారం బాధ్యతలు చేపట్టిన పరాగ్ సెన్సార్‌షిప్‌ను కఠినతరం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.