ఇదేమి మాస్టర్‌ ప్లాన..?

ABN , First Publish Date - 2021-07-22T05:07:54+05:30 IST

ఎర్రగుంట్ల నగర పంచాయతీలో అమలు చేయాలనుకుంటున్న మాస్టర్‌ప్లానపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనుడాలో చేర్చాలనుకోవడాన్ని జీర్జించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేమి మాస్టర్‌ ప్లాన..?
అనుడా రూపొందించిన డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన

ఎర్రగుంట్ల డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లానపై ప్రజల ఆందోళన 

మాస్టర్‌ ప్లానతో ఇళ్లుండవు.. రోడ్లుమాత్రమే ఉంటాయి

వీధుల్లోకి ఎలా వెళ్లాలంటూ కౌన్సిలర్ల మనోవేదన

ఎర్రగుంట్ల, జూలై 21: ఎర్రగుంట్ల నగర పంచాయతీలో అమలు చేయాలనుకుంటున్న మాస్టర్‌ప్లానపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనుడాలో చేర్చాలనుకోవడాన్ని జీర్జించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై, ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నగరపంచాయతీలో ఎక్కడ చూసినా డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన విషయంపై చర్చించుకోవడం విశేషం. ఇలాంటి సందర్భంలో కౌన్సిలర్లు సైతం చాలా మంది మనోవేదనకు గురవుతున్నట్లు విశ్వనీయ సమాచారం. ఇప్పటికే పన్నుల పోటుతో ప్రజల ఆగ్రహానికి గురయ్యామని.. మళ్లీ ఈ విషయాన్ని కూడా కౌన్సిల్‌లో తీర్మానం చేస్తే ఇక అంతే సంగతులని వీరు చర్చించుకుంటున్నారు.


ఇదీ సంగతి

ఎర్రగుంట్ల నగర పంచాయతీకి అదనంగా వై.కోడూరు, హనుమనగుత్తి, సుంకేసుల గ్రామాల వరకు ఉన్న అన్ని పొలాలను కలుపుతూ సుమారు రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అన్నమయ్య అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటి (అనుడా)లో చేర్చేందుకు మాస్టర్‌ ప్లాన తయారు చేశారు. ఇందులో రైతులకు చెందిన సుమారు 800 ఎకరాల వ్యవసాయ భూములు కమర్షియల్‌ జోనగా, ఇండస్ర్టియల్‌ జోనగా మారుస్తున్నారు. దీంతో పాటు ఎర్రగుంట్లలోని కదిరివారిపల్లె రస్తా, దొండపాడు రస్తా వలసపల్లె రస్తా 60 అడుగుల వెడల్పు, ముద్దనూరు రస్తా 100 అడుగులు, ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి రైల్వేస్టేషన వెళ్లే రోడ్డు 100 అడుగులు, పీఎనఆర్‌ రోడ్డు, వీరభద్రుడు రోడ్డు 40 అడుగులు, రైల్వేట్రాక్‌కు సమాంతరంగా 60 అడుగుల రోడ్డు, ఎర్రగుడిపాడు రస్తా 60 అడుగులు, టీటీడీ కల్యాణ మంటపం రోడ్డు 60 అడుగులు, వెంకటరెడ్డి వీధి 60, మిగిలిన అన్నిరోడ్లు 40 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లానను తయారుచేసి ప్రకటన ఇచ్చారు. దీనిపై ప్రజల అభ్యంతరాలుంటే  జూలై 24వ తేదీ లోపు తెలిపాలని కటాఫ్‌ డేట్‌ పెట్టారు. ఇది తెలుసుకున్న రైతులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పట్టణంలోని రోడ్ల వెడల్పు గురించి చాలా మందికి తెలియలేదు. రెండు మూడు రోజులుగా ఈవిషయంపై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది. 40, 60, 100 అడుగుల రోడ్లు వేస్తే ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లు చాలావరకు కనుమరుగు అవుతాయి. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోంది. వీటిపై పలువురు ఎర్రగుంట్ల కమిషనర్‌కు అభ్యంతరాలను అందజేశారు. అభ్యంతరాలకు గడువు కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వ్యహారంపై ప్రజలతో మాట్లాడేందుకు అనుడా చైర్మన గురుమోహన గురువారం ఎర్రగుంట్లకు వస్తున్నట్టు సమాచారం.


ఎలాంటి నష్టపరిహారం ఇవ్వం

- పి.జగన్నాథ్‌, కమిషనర్‌, ఎర్రగుంట్ల

అనుడా మాస్టర్‌ ప్లాన అమలయితే వాటికోసం వేసే రోడ్లు, ఇతర సౌకర్యాలకు పోయే ఇళ్లు, స్థలాలకు నగరపంచాయతి నుంచి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వం. ఎందుకంటే అలాంటి ప్రొవిజన మున్సిపాల్టీల్లో లేదు. దీనికి ఎర్రగుంట్ల నగరపంచాయతీ కౌన్సిల్‌లో తీర్మానం ఆమోదించాల్సి ఉంటుంది. మాస్టర్‌ప్లాన అమలైతే నగర పంచాయతీలోని భూములు, స్థలాలు, ఇళ్ల విలువ భారీగా పెరుగుతాయి. వీటిపై ప్రజలు వారి అభ్యంతరాలను 24వ తేదీలోపు తెలపవచ్చు. ఇప్పటికే అభ్యంతరాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి.

Updated Date - 2021-07-22T05:07:54+05:30 IST