రైతు శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఏది?

ABN , First Publish Date - 2022-05-17T06:28:46+05:30 IST

రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్నాయి. కనుకనే కావచ్చు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతం గురించీ, వ్యవసాయ రంగం గురించీ చాలా కాలం తరువాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, రాజకీయ పార్టీల మధ్య...

రైతు శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఏది?

రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వస్తున్నాయి. కనుకనే కావచ్చు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతం గురించీ, వ్యవసాయ రంగం గురించీ చాలా కాలం తరువాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీలు రాష్ట్ర రైతులకు అనేక హామీలు గుప్పిస్తుంటే,, ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కూడా జాతీయ వ్యవసాయ విధానం గురించి చర్చలు చేస్తోంది. వీటన్నిటి మధ్యలో నిజమైన రైతులు ప్రకృతి వైపరీత్యాలకు, ఆర్థిక నష్టాలకు బలవుతూ, అప్పుల ఊబిలో కూరుకుపోతూ, బలవన్మరణాలవైపు నడుస్తూనే ఉన్నారు.


నేటి రాజకీయ పార్టీలు, నాయకులు అవకాశవాదంతో వ్యవసాయ రంగాన్ని గందర గోళంలోకి నెట్టారు కానీ, భారత రాజ్యాంగ నిర్మాతలు వ్యవసాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యతలు స్పష్టంగానే నిర్దేశించారు. స్థానిక వైవిధ్య పూరిత వాతావరణ పరిస్థితులు, వనరులు, ప్రజల ఆహార అలవాట్లు, ఉత్పత్తి ఖర్చులలో వ్యత్యాసాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. అంటే ఏ పార్టీ అయినా, ఒకవేళ జాతీయ వ్యవసాయ విధానం గురించి అధ్యయనం చేసినా, చర్చించినా, నివేదికలు రూపొందించినా, అవి, రాష్ట్ర స్థాయి సమగ్ర వ్యవసాయ విధానాల రూపకల్పనకు ఒక ఫ్రేమ్ వర్క్‌గా ఉపయోగపడతాయి కానీ, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే, రైతుల భాగస్వామ్యంతో రాష్ట్ర సమగ్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. కానీ విచిత్రంగా, జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు వచ్చి, రాష్ట్రంలో అలవి కానీ హామీలు ఇచ్చి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమేమో, జాతీయ వ్యవసాయ విధాన రూపకల్పన గురించి చర్చిస్తోంది. ఈ వైరుధ్యాన్ని పరిశీలిస్తే, అందరికీ వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలనే యావ తప్ప, రాష్ట్ర వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరించాలనే దృష్టి లేదని స్పష్టమవుతుంది.


రాష్ట్ర వ్యవసాయ రంగం మూడు దశలలో సమస్యలను ఎదుర్కొంటోంది. పంటల ఉత్పత్తికి ముందు దశలో, పంటల ఉత్పత్తి దశలో, పంట కోతల అనంతర దశలో. ఈ మూడు దశలలోనూ సమస్యలను పరిష్కరించడానికి నిర్దిష్ట చర్యలు అవసరమవుతాయి. కొన్ని చట్టాల, జీవోల అమలు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు అవసరం. ఇప్పటి వరకూ ప్రభుత్వాలు చేస్తున్నది, ఏదో ఒక దశకు సంబంధించి, అరకొర చర్యలు చేపట్టడం, లేదా కొద్దిపాటి నిధులు కేటాయించడమే. అందుకే వ్యవసాయ రంగంలో ఎప్పుడూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావడం లేదు. సంక్షోభం తీరడం లేదు.


పంటల ఉత్పత్తి ముందు దశలో గ్రామీణ ప్రజలకు కావలసింది భూమి, నీటి వనరులు, అడవులు, ఉమ్మడి భూములు లాంటి స్థానిక సహజ వనరులపై చట్టబద్ధ హక్కులు. ఇవన్నీ నిజానికి ఉత్పత్తి వనరులుగా ఉండి, స్థానిక ప్రజలకు జీవనోపాధి కల్పించాల్సినవి. కానీ ఇవన్నీ ఇప్పుడు మార్కెట్ సరుకుగా మారిపోయాయి. డబ్బున్నవాళ్ల చేతుల్లోకి పరాధీనమవుతున్నాయి. కొన్ని జిల్లాల సాగు భూముల్లో సగం ఇప్పటికే వ్యవసాయేతరుల చేతుల్లోకి ఒక ఆస్తిగా వెళ్లిపోయింది. తెలంగాణలో ఈ ప్రక్రియ చాలా వేగంగా నడుస్తున్నది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ళు దాటిపోయినా, భూ గరిష్ఠ పరిమితి చట్టం వచ్చి 50 ఏళ్లు గడిచిపోయినా, భూ సంస్కరణలు అమలై, గ్రామీణ పేదలకు సాగు భూమి దక్కలేదు. అడవులపై హక్కు ఆదివాసీలదే అని ఎన్ని చట్టాలు వచ్చినా, పోడు రైతులకు ఇంకా పట్టాలు దక్కలేదు. వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే స్థానిక ప్రజలకు మాత్రమే సాగుభూమి, అడవులపై హక్కులు కల్పించే విధానాలు అమలు చేయడానికి ప్రభుత్వాలు వెంటనే పూనుకోవాలి. కొత్త చట్టాలు చేయాలి.


రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య 15 లక్షలు దాటింది. కౌలు రైతుల గుర్తింపు చట్టం వచ్చి 11 ఏళ్లు గడిచినా, రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. కౌలు రైతుల వ్యవసాయానికి ఎటువంటి సహాయమూ అందడం లేదు. కౌలు ధరలపై నియంత్రణ విధించే 1956 కౌలు చట్టం కూడా అమలులో లేకపోవడం వల్ల కౌలు రైతులకు అదనపు ఖర్చు అవుతున్నది. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదలకు, ఆదాయానికి పొంతన కుదరక అందుకే కౌలు రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. కౌలు రైతులను గుర్తించి రైతు బంధుతో సహా అన్ని రకాల సహాయం అందించే వరకూ ఈ ఆత్మహత్యలు ఆగవు కూడా.


వ్యవసాయానికి అత్యంత కీలకమైనది పెట్టుబడి. అది సంస్థాగతంగా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి లేదా వడ్డీ లేకుండా అందితే, రైతులకు సులువుగా ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ హామీలు సరిగా అమలు కాక, మొత్తం పంట రుణాల వ్యవస్థే ధ్వంసమైపోయింది. ప్రతి సీజన్‌లోనూ బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య తగ్గిపోతున్నది. పైగా బ్యాంకులు చూపించే రుణ పంపిణీ లెక్కలలో వడ్డీ కట్టించుకుని బ్యాంకులు రెన్యూవల్ చేసే పంట రుణాల లెక్కలే ఎక్కువ. ఒకే విడతలో రుణ మాఫీ చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పైగా కేవలం భూమి యాజమాన్యం ప్రాతిపదికన కాకుండా, వాస్తవ సాగు దారులకు మాత్రమే పంట రుణాలు అందిస్తే, రైతుల పెట్టుబడి సమస్య తీరుతుంది. వారిపై ప్రైవేట్ వడ్డీల భారం తగ్గుతుంది.


రాష్ట్రంలో సాగు నీటి వినియోగం ఖర్చుతో కూడినది. కాబట్టి ఎక్కువ సాగు నీరు అవసరమయ్యే వరి, పత్తి, ఆయిల్ పామ్ లాంటి పంటలను ప్రోత్సహించకుండా, రాష్ట్రానికి అవసరమైన పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పశువుల మేత లాంటి పంటలను పండించడానికి సాగు భూములను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది. అప్పుడే అన్ని పంటలకు స్థానికంగా మార్కెట్ దొరుకుతుంది. ఎగుమతుల గురించి ఎదురు చూడాల్సిన అవసరం, దిగుమతుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండవు. ఎగుమతి, దిగుమతి విధానాల రూపకల్పన కేంద్రం చేతుల్లో ఉండి, కేవలం రాజకీయ ప్రేరేపితంతో అవి తయారవుతున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం మరింత జాగ్రత్తగా పంటల ప్రణాళిక చేసుకోవాలి.


వ్యవసాయం బహిరంగంగా జరిగే ఉత్పత్తి ప్రక్రియ. ప్రకృతి వైపరీత్యాలు ప్రజల చేతుల్లో, ప్రభుత్వాల చేతుల్లో ఉండవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాలను తప్పకుండా అమలు చేయాలి. తీవ్ర నష్టాలు సంభవించినప్పుడు, వెంటనే నష్టాలను అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 2020 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాల అమలు ఆగిపోయింది. గత 8 ఏళ్లలో ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించింది కూడా కేవలం ఒకే ఒక్కసారి. 2020 పంట నష్టాలకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినా, ప్రభుత్వం అమలు చేయలేదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా పథకాల కోసం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలి.


తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటలకూ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. విత్తనాలు, రసాయనాల ధరలు, యంత్రాల కిరాయిలు, సాపేక్షికంగా కూలీ రేట్లు పెరిగిపోతున్నాయి. పంట కోత అనంతర దశలో ఈ ఖర్చులన్నిటినీ కేంద్రం పరిగణనలో పెట్టుకోకుండా, ప్రతి సంవత్సరం జాతీయ సగటు ఖర్చుల ఆధారంగా కనీస మద్దతు ధరలు ప్రకటిస్తున్నది. ఈ ధరలు తెలంగాణ రాష్ట్ర రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగా లేవు. అందుకే ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి కొన్ని పంటలను సేకరించడంతో పాటు, ఆయా పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బోనస్ చెల్లించాలి. రైతు సహకార సంఘాలను, ఎఫ్‌పి‌ఓలను బలోపేతం చేయడం ద్వారా, వాటికి చిన్న యంత్రాలతో కూడిన కస్టమ్ హైరింగ్ సెంటర్లు నెలకొల్పడానికి నిధులు అందచేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలనే ఆలోచనలు మానుకుని సన్న, చిన్నకారు రైతులకు ప్రత్యేక కూలీ సబ్సిడీ పథకాన్ని ప్రకటించాలి. స్థానికంగా ఎక్కడికక్కడ గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల సౌకర్యం కల్పించడం ద్వారా, రైతులు నేరుగా మార్కెట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే రైతులకు ఖర్చులు తగ్గి నికర మిగులు ఉంటుంది. గ్రామీణ కుటుంబాలకు పశుపోషణ, ఇతర జీవనోపాధులను బలోపేతం చేయడానికీ నిధులు కేటాయించాలి.  


రాజకీయ పార్టీలు ఎన్ని హామీలు అయినా ఇవ్వొచ్చు కానీ, గ్రామీణ ప్రజల సంక్షేమం పట్ల పాలకులకు నిజమైన రాజకీయ నిబద్ధత ఉండాలి. రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణమైన సమగ్ర వ్యవసాయ విధానం ఉండాలి. బడ్జెట్ కేటాయింపులకు ఉండే పరిమితులను దృష్టిలో ఉంచుకుని, అర్హులకు మాత్రమే సహాయం అందించే విధి విధానాలను తప్పనిసరిగా రూపొందించుకోవాలి. ఇవేవీ లేకుండా ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయ రంగ నిజమైన సమస్యలను పరిష్కరించలేదు. అలవి కాని హామీలు ఇచ్చి పార్టీలు ఎన్నికలలో లబ్ధి పొందొచ్చు కానీ, అవి అమలు కాకపోతే గ్రామీణ సంక్షోభం కొనసాగుతుంది.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2022-05-17T06:28:46+05:30 IST