గెజిట్‌ అమలు ఏమైంది?

ABN , First Publish Date - 2022-01-28T08:44:33+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి జారీ చేసిన గెజిట్‌ అమలుపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను నిలదీసింది.

గెజిట్‌ అమలు ఏమైంది?

  • ఆర్నెల్లుగా ఏం చేస్తున్నారు?
  • ప్రాజెక్టుల స్వాధీనం ఎక్కడిదాకా వచ్చింది?
  • కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను నిలదీసిన కేంద్ర జలశక్తి శాఖ
  • తెలుగు రాష్ట్రాలు సహకరించట్లేదు
  • ఉన్నతాధికారులకు తెలిపిన చైర్మన్లు


హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి జారీ చేసిన గెజిట్‌ అమలుపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను నిలదీసింది. గెజిట్‌ జారీ చేసి ఆర్నెల్లు పూర్తవుతున్నాయని.. ఇప్పటి వరకు ఏం చేశారని బోర్డుల చైర్మన్లు మహేంద్ర ప్రతా్‌పసింగ్‌ (కృష్ణా), చంద్రశేఖర్‌ అయ్యర్‌ (గోదావరి)ను ప్రశ్నించింది. గురువారం కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులు గెజిట్‌ అమలుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రాజెక్టుల స్వాధీనం ఎక్కడి దాకా వచ్చిందని ఆరా తీయగా.. తెలుగు రాష్ట్రాలు సహకరించడం లేదని చైర్మన్లు తెలిపారు. కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టుల అప్పగింతకు జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రాజెక్టులతో పాటే తమ ప్రాజెక్టులనూ తీసుకోవాలని మెలిక పెట్టిందని మహేంద్ర ప్రతా్‌పసింగ్‌ గుర్తుచేశారు. ఇక బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ఆపరేషన్‌ ప్రొటోకాల్‌, కర్వ్‌రూల్‌ ఉంటేనే ప్రాజెక్టులను అప్పగిస్తామని తెలంగాణ తేల్చిచెప్పిందని నివేదించారు. ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ముసాయిదాను సిద్ధం చేయగా తెలంగాణ తిరస్కరించిందని తెలిపారు. ప్రధానంగా కృష్ణాలో జల విద్యుత్కేంద్రాలతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఆ కేంద్రాలు అప్పగించాలని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని సింగ్‌ వివరించారు. 


ఇక గోదావరిలో షెడ్యూల్‌-2లో ఉన్న ప్రాజెక్టుల్లో పెద్దవాగు ఒక్కటే అప్పగించడానికి తెలంగాణ ముందుకొచ్చిందని.. ఇంకా అప్పగింత జీవో జారీ కాలేదని చంద్రశేఖర్‌ అయ్యర్‌ చెప్పారు. తెలంగాణలో మరో 3, ఆంధ్రప్రదేశ్‌లో 5 ప్రాజెక్టుల అప్పగింతపై ఇటీవలే సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించామని తెలిపారు. తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ తీసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని ఏపీ చెప్పిందని, ఇక రాష్ట్రంలో ప్రాజెక్టులు అప్పగించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని తెలంగాణ స్పష్టం చేసిందని వివరించారు. షెడ్యూల్‌-2లోని ప్రాజెక్టులను షెడ్యూల్‌-3లోకి మార్చాలని, అనుమతి లేని జాబితాలో ఉన్న ప్రాజెక్టులను జాబితా నుంచి తొలగించాలని చేసిన విజ్ఞప్తి పరిశీలనతో పాటు డీపీఆర్‌లకు క్లియరెన్స్‌ వంటి సమస్యల అనంతరమే ప్రాజెక్టుల అప్పగింతపై చర్చిద్దామని తెలంగాణ గుర్తు చేసినట్లు అయ్యర్‌ తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ అధికారులు స్పందిస్తూ.. త్వరలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడంతో గెజిట్‌ అమలుపై సభ్యులు అడిగే ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలని చైర్మన్లను ఆదేశించారు.


నేడు ఆర్డీఎ్‌సకు కృష్ణా బోర్డు 

కృష్ణా బోర్డు ఉప కమిటీ శుక్రవారం రాజోలిబండ మళ్లింపు పథకాన్ని పరిశీలించనుంది. గెజిట్‌ అమలులో భాగంగా ఆర్డీఎ్‌సను బోర్డు స్వాధీనం చేసుకోవాలన్న తెలంగాణ విజ్ఞప్తికి అనుగుణంగా ఈ పర్యటన జరగనుంది. మరోవైపు బోర్డు ఉప కమిటీ సభ్యులు గురువారం జూరాల ప్రాజెక్టును సందర్శించారు. జూరాలతో పాటు టెలిమెట్రీ స్టేషన్‌ను అధికారుల బృందం పరిశీలించింది. శుక్రవారం ఆర్డీఎస్‌ కుడి, ఎడమ కాల్వలను బోర్డు పరిశీలించనుంది. 

Updated Date - 2022-01-28T08:44:33+05:30 IST