బీఎస్‌పీ భవితవ్యమేమిటి?

ABN , First Publish Date - 2022-05-21T05:36:09+05:30 IST

దళితుల రాజకీయాభ్యుదయానికి అనేక రాజకీయ పక్షాలు ప్రభవించాయి. కాన్షీరామ్ (1934–2006) నెలకొల్పిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) వాటిలో ఒకటి.

బీఎస్‌పీ భవితవ్యమేమిటి?

దళితుల రాజకీయాభ్యుదయానికి అనేక రాజకీయ పక్షాలు ప్రభవించాయి. కాన్షీరామ్ (1934–2006) నెలకొల్పిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) వాటిలో ఒకటి. దళిత పార్టీల పారంపర్య జాబితాలో భారతీయ రిపబ్లికన్ పార్టీ (ఆర్‌పిఐ)కి వారసురాలు బీఎస్‌పీ. డాక్టర్ అంబేడ్కర్ 1956 సెప్టెంబర్‌లో ఆర్‌పిఐ సంస్థాపనా సంకల్పాన్ని ప్రకటించారు. అది కార్యదూరం దాల్చక ముందే ఆయన కీర్తిశేషుడు అయ్యారు. ఆయన అనుయాయులు 1957లో ఆర్‌పిఐని ప్రారంభించారు. ద్వితీయ లోక్‌సభ (1957–62)లో ఈ పార్టీ తొమ్మిది సీట్లను గెలుచుకున్నది. 1967 సార్వత్రక ఎన్నికలలో ప్రముఖ నాయకుడు బి.పి.మౌర్యతో సహా 12 మంది సభ్యులను లోక్‌సభకు పంపింది. అయితే పార్లమెంటులోనూ, వెలుపలా తన బలాన్ని ఆర్‌పిఐ నిలుపుకోలేక పోయింది. నాయకులు చీలిపోయారు. వారి నేతృత్వంలోని బృందాలు ప్రత్యేక పార్టీలుగా ఏర్పడ్డాయి. దళిత సంఘటిత శక్తి బలహీనపడింది.


కాన్షీరామ్ 1984లో బీఎస్‌పీని ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి అనే రెండు సంస్థలను బహుజన్ సమాజ్ పార్టీగా ఆయన మార్చివేశారు. ‘దేశ జనాభాలో 85 శాతంగా ఉన్న మీరు కేవలం 15శాతంగా ఉన్న వారిపై ఎందుకు ఆధారపడతారు?’ అని ఘోషిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీలలో ఒక కొత్తరాజకీయ చైతన్యాన్ని కాన్షీరామ్ రగుల్కొల్పారు. ఒక ప్రభావశీల సమైక్య రాజకీయ శక్తిగా అధికార కైవసానికి ముందడుగు వేయాలని ఆయా వర్గాల వారిని ఆయన పురిగొల్పారు.



మండల్ కమిషన్ సిఫారసులను అమలుపరిచేందుకు 1990లో అప్పటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వోద్యోగాలలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను సుసాధ్యం చేసిన ఈ నిర్ణయం వెనుకబడిన వర్గాల వారిలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో అపూర్వ రాజకీయ చైతన్యానికి విశేషంగా దోహదం చేసింది. బహుజనులు రాజకీయంగా సంఘటితమయ్యారు. కాన్షీరామ్ యూపీలో విస్తృతంగా పర్యటించారు. బీఎస్‌పీని బలోపేతం చేశారు.


1993 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో మూలాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)తో కాన్షీ చేతులు కలిపారు. భావోద్వేగపూరిత రామ్ మందిర్–బాబ్రీ మసీద్ అంశం ఆధారంగా హిందువులు–ముస్లింల మధ్య విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకు కల్యాణ్‌సింగ్ నాయకత్వంలో బీజేపీ ముమ్మరంగా ప్రయత్నిస్తున్న సందర్భమది. బీజేపీ రాజకీయ విస్తరణ బహుజనులకు ఒక సవాల్‌గా పరిణమించింది. అయితే ఎస్‌పీ, బీఎస్‌పీల మధ్య ఎన్నికల పొత్తు యూపీలో బీజేపీ పురోగతిని విజయవంతంగా అడ్డుకున్నది.


1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాన్షీరామ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. దళితులను ఒక నిర్ణయాత్మక రాజకీయ శక్తిగా సమీకరించేందుకు ఆయన శతథా ప్రయత్నించారు. 1985లో కారంచేడులో దళితుల ఊచకోత, 1991లో చుండూరులో దళితుల హత్యాకాండ, దళితులను తిరుగులేని విధంగా పోరాట పథంలోకి నడిపించడంలో దళిత మహాసభ మొదలైన సంస్థలు నిర్వహించిన అవిస్మరణీయ పాత్ర మొదలైనవి కాన్షీరామ్ రాజకీయ కృషికి అవసరమైన సైద్ధాంతిక, సంస్థాగత భూమికను సమకూర్చాయి. 1994 అక్టోబర్‌లో కాన్షీరామ్ బహిరంగ సభ నొకదాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఆ సభ సంపూర్ణంగా సఫలమయింది. మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఎక్కడెక్కడ నుంచో ఆ సభకు హాజరయ్యారు. ఆ లక్షలాది ప్రజలు బీఎస్‌పీ మద్దతుదారులే అనుకుంటే మీరు పొరపడినట్టే. బహుజనులకు ఆశా జ్యోతిగా ఉన్న కాన్షీరామ్ ఏమి చెబుతాడో ప్రత్యక్షంగా వినాలన్న విశేష ఆసక్తితో ఉన్న వివిధ దళిత సంఘాల వారే ఆ సభికులలో అత్యధికంగా ఉన్నారు. ఆ బహిరంగ సభ బందోబస్త్‌ను ఈ వ్యాస రచయిత స్వయంగా పర్యవేక్షించారు. కాన్షీరామ్ పట్ల అశేష ప్రజల శ్రద్ధాసక్తులకు నేనొక ప్రత్యక్ష సాక్షిని. కాన్షీ సభలకు అప్పటి వరకు కేవలం 15 నుంచి 20 వేల మంది ప్రజలు మాత్రమే రావడం పరిపాటిగా ఉండేది. అలాంటిది ఒక్కసారిగా మూడులక్షల మందికి పైగా కాన్షీ సభకు రావడం అన్ని రాజకీయ పక్షాలను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్‌టి రామారావును విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలో బీఎస్‌పీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి ఆయన సంసిద్ధమయ్యారు.


టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చంద్రబాబునాయుడు శాసనసభ్యుడు ఎన్.యతిరాజారావును పార్టీ దూతగా కాన్షీరామ్ వద్దకు పంపారు. బీఎస్‌పీతో ఎన్నికల పొత్తుకు టీడీపీ సంసిద్ధంగా ఉందని, 25 సీట్లను ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని యతిరాజారావు ద్వారా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై టీడీపీ నాయకులతో సంప్రదింపులకు కాన్షీని చంద్రబాబు ఆహ్వానించారు.


కాన్షీరామ్ వ్యవహార శైలి విలక్షణమైనది కదా. తెలుగుదేశం నాయకులు ఎవ్వరితోనూ ఆయన ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. పైగా వారికి తెలియజేయకుండానే టీడీపీ అధినేత ఎన్‌టి రామారావు వద్దకు స్వయంగా వెళ్లారు. బీఎస్‌పీకి 60 సీట్లు ఇవ్వాలని కాన్షీ డిమాండ్ చేశారు. పొత్తును నివారించేందుకే కాన్షీ ఈ డిమాండ్ చేశారు మరి. ఇందుకు రామారావు ససేమిరా అన్నారు. మరో పది సీట్లు మాత్రమే అదనంగా ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. బీఎస్‌పీకి పటిష్ఠ సంస్థాగత దన్ను, గ్రామీణ ప్రాంతాలలో కార్యకర్తల బలం లేనందున అరవై సీట్లు ఇవ్వడం కుదరదని రామారావు స్పష్టం చేశారు.


టీడీపీతో పొత్తును తప్పించుకునేందుకు కాన్షీరామ్ ఎందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారు? యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థుల ప్రచార వ్యయాలకుగాను అవసరమైన నిధులను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పటికే హామీ ఇచ్చింది. ఇరు పార్టీల మధ్య ఈ విషయమై అప్పటికే ఒక అవగాహన ఉన్నది. దాని ప్రకారమే 1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్‌పీ తరపున బలమైన అభ్యర్థులను నిలబెట్ట లేదు! బలహీన అభ్యర్థులను మాత్రమే నిలబెట్టారు. తిరుపతి నుంచి లోక్‌సభకు ఎంపికైన కాంగ్రెస్ నేత చింతామోహన్ బీఎస్‌పి అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర వహించారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్‌పీని పటిష్ఠం చేసేందుకు అదొక అసాధారణ అవకాశం. అయితే కాన్షీరామ్ ఆ అవకాశాన్ని వ్యర్థం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి సూత్ర బద్ధ ప్రతిపాదనకు బీఎస్‌పి అంగీకరించి ఉంటే రాష్ట్ర రాజకీయాలలో అదొక మేలి మలుపు అయివుండేది. కానీ అలా జరగలేదు. అయితే కాన్షీరామ్ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం అన్ని రాజకీయ పక్షాలను దిగ్భ్రాంతి పరిచింది. టీడీపీతో పొత్తుకు అంగీకరించి ఉంటే బీఎస్‌పీకి కనీసం 20 నియోజకవర్గాలలో విజయం సాధించి ఉండేదనడంలో సందేహం లేదు. అయితే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ ప్రభావంతో బీఎస్‌పీ తన భవిష్యత్తును తానే స్వయంగా దెబ్బతీసుకున్నది. 


2008లో సినీనటుడు చిరంజీవి రాజకీయాలలోకి ప్రవేశించేందుకు సర్వసన్నద్దమయ్యారు. ఈ కొత్త పరిణామపు పర్యవసానాలను తెలుసుకునేందుకై బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్ ఉభయ గోదారి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. చిరంజీవి సామాజిక వర్గమైన కాపులు ఆ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాపులు బీఎస్‌పీలో చేరితే అధికారానికి వచ్చే అవకాశాలు విశేషంగా ఉన్నాయని సూర్యప్రకాష్ తన పర్యటనలలో పదే పదే విశదం చేశారు. సొంత పార్టీని నెలకొల్పినా టీడీపీ, కాంగ్రెస్‌లతో పోటీ పడలేరని స్పష్టం చేశారు. సూర్యప్రకాష్ వాదనలు కాపులను ప్రభావితం చేశాయి. ఆయన్ని చర్చలకు చిరంజీవి ఆహ్వానించారు. బీఎస్‌పీలో చేరడం వల్ల మీకు విజయావకాశాలు పెరుగుతాయని చిరంజీవికి సూర్యప్రకాష్ చెప్పారు. బీఎస్‌పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి హైదరాబాద్ వచ్చినప్పుడు చిరంజీవి ఆమెను విందుకు ఆహ్వానించారు. సూర్యప్రకాష్ ద్వారా పంపిన ఆ ఆహ్వానాన్ని ఆమె అంగీకరించలేదు. పైగా ఒక బహిరంగసభలో సినిమానటులు రాజకీయాలకు అర్హులుకారని, సినీ రంగానికే పరిమితమవడం మంచిదనే అభిజాత్య మాటలు మాట్లాడారు. ఇది సహేతుకమైన వైఖరేనా? ఆమె ఎంతకూ యూపీకే ప్రాధాన్యమిచ్చారు. ఇతర రాష్ట్రాలలో బీఎస్‌పీ విస్తరణపై మాయావతి పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ పటిష్ఠతకు దోహదం చేసే ఆచరణాత్మక అంశాలను ఆమె పరిగణనలోకి తీసుకోలేదు. యూపీయేతర రాష్ట్రాలలో పార్టీకి భద్ర భవిష్యత్తును సమకూర్చే విషయంలో భావజాలం, కార్యసాధకత మధ్య ఆమె డోలాయమాన వైఖరితో వ్యవహరించారు.


బీఎస్‌పీపై మాయావతి సంపూర్ణ నియంత్రణ సాధించిన తరువాత ఆ పార్టీ భావజాలకేంద్రిత పార్టీ నుంచి వ్యక్తి అంటే అధినేత్రి కేంద్రిత పార్టీగా మారిపోయింది. కాన్షీరామ్ తో కలిసి బీఎస్‌పీని సంస్థాపించిన ఆర్‌కె చౌధరి (పాసి సామాజిక వర్గీయుడు), అజంఖాన్ లాంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. మూలాయం సింగ్ యాదవ్‌తో ఏర్పడ్డ విభేదాలు, వివాదాల కారణంగా బీజేపీకి ఆమె సన్నిహితమయ్యారు. ఒక రాజకీయ పార్టీ నిర్వహణలో భావజాలానికి మాత్రమే డాక్టర్ అంబేడ్కర్ ప్రాధాన్యమిచ్చారు. అయితే మాయావతి అందుకు విరుద్ధంగా వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహించేందుకు వెనుకాడడంలేదు. తొలుత తన సోదరుడు ఆనంద్ కుమార్‌ను ఆమె ప్రోత్సహించారు. ఆదాయపు పన్ను శాఖ దాడులతో ఆయన అసలు రాజకీయ రంగం నుంచే నిష్క్రమించారు. ఇప్పుడు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తన వారసుడుగా ప్రోత్సహించేందుకు మాయావతి సంసిద్ధమయ్యారు. ఇటువంటి కుటుంబ రాజకీయాలే గతంలో ఆర్‌పీఐని సర్వనాశనం చేశాయి. నాయకుల అహాలు, భావజాలం మధ్య ఘర్షణలో ఆర్‌పీఐ ముక్కలు చెక్కలుఅయింది. భావజాలం ప్రాతిపదికన కాన్షీరామ్ నెలకొల్పిన బీఎస్‌పీ కూడా ఆర్‌పీఐ మాదిరిగానే చరిత్రలో కలిసిపోయే ప్రమాదముంది. ఇప్పటికే వారసత్వ రాజకీయాల వల్ల బీఎస్‌పీ భావజాల పునాదులు బాగా బలహీనపడ్డాయి.


జాతీయ నాయకురాలుగా గౌరవ మన్ననలు అందుకుంటున్న మాయావతి ఎంతకూ యూపీ రాజకీయాలపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణ భారతావనిలో బీఎస్‌పీని పటిష్ఠం చేసే బాధ్యతను ఆమె ఉపేక్షిస్తున్నారు. ఈ కారణంగా బీఎస్‌పీ మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో ఆ పార్టీ ఎదుగుదలకు మిక్కుటంగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భావజాలపరమైన ప్రాతిపదికలు పటిష్ఠంగా ఉన్నాయి. అయినప్పటికీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు మాయావతి శ్రద్ధ చూపడం లేదు. ఆమె పనితీరులో పారదర్శకతలేదు. దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పాటు, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి ఆర్థిక మద్దతు ఎంతైనా అవసరం. మాయావతి నియంతృత్వ వ్యవహార శైలి వల్ల బీఎస్‌పీ భావజాలం బలహీనపడింది. మాయావతి వ్యక్తి పూజను ప్రోత్సహిస్తున్నారు.


డాక్టర్ ఆలూరి సుందర్‌కుమార్ దాస్ 

విశ్రాంత ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్

Updated Date - 2022-05-21T05:36:09+05:30 IST