చేనేతకు దిక్కేదీ?

ABN , First Publish Date - 2022-08-07T05:28:57+05:30 IST

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు ప్రకటిస్తున్నా, అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో క్షేత్రస్థాయిలో అవి కార్మికుల దరిచేరడం లేదు. ఈనెల 7న చేనేత దినోత్సవం సందర్భంగా కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రారంభించనుంది.

చేనేతకు దిక్కేదీ?

ప్రచారానికే  పరిమితమైన ప్రభుత్వ పథకాలు

బీమా పథకానికి నిబంధనల గుదిబండ

నేడు చేనేత దినోత్సవం 


భూదాన్‌పోచంపల్లి:  చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలు ప్రకటిస్తున్నా, అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో క్షేత్రస్థాయిలో అవి కార్మికుల దరిచేరడం లేదు. ఈనెల 7న చేనేత  దినోత్సవం సందర్భంగా కార్మికుల  కోసం రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రారంభించనుంది. అయితే నిబంధనల కారణంగా సగం మందికి కూడా ఇది వర్తించని పరిస్థితి నెలకొంది. చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..


కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా నూలుపై 10శాతం సబ్సి డీ అందజేస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నూ లు, ముడి సరుకులపై 40శాతం రాయితీ ఇస్తూ మొత్తంగా 50శాతం సబ్సిడీ కల్పిస్తున్నాయి. దీని కోసం బడ్జెట్‌లో రూ.100కోట్లు కేటాయించింది. అయితే ఈ పథకం నిబంధనలు కార్మికులకు శాపంగా మారాయి. కొనుగోలు చేసిన నూలుపై సబ్సిడీ డబ్బు ఖాతాలో జమ కావాలంటే రెండు నెలలసమయం పడుతోంది. దీంతో చేనేత కార్మికులు నూ లు ధరలకు భయపడి మగ్గం నేసేందుకే జంకుతున్నారు.


త్రిఫ్ట్‌ స్కీం నేటికీ బాలారిష్టాల్లోనే

చేనేతశాఖ మంత్రి కేటీఆర్‌ ఐదేళ్ల క్రితం భూదాన్‌పోచంపల్లి వేదికగా త్రిఫ్ట్‌ స్కీ (పొదుపు పథకం) లాంఛనంగా ప్రారంభించారు. దీనికి బడ్జెట్‌లో రూ.60కోట్లు కేటాయించారు. కార్మికుడు 8శాతం జమచేస్తే ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుంది. యాదాద్రి జిల్లాలో 9వేల మంది కార్మికులను త్రిఫ్ట్‌ స్కీంలో చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 4,050మందిని మాత్రమే త్రిఫ్ట్‌ పథకంలో చేర్పించారు కొన్ని అపోహలతో కార్మికులు ఈ పథకంలో చేరకపోగా, వారికి భరోసా కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.


బీమాకు నిబంధనల గుదిబండ

నేతన్న బీమా పథకం నిబంధనల కారణంగా వృత్తిదారులు సగం మందికి కూడా ఈ పథకం వర్తించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాలో 34,001 మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నా, నిబంధనల కారణంగా 15వేల మందికే పరి మితం అవుతోంది. నేతన్నకు చేయూత పథకం లబ్ధిదారుల కు మాత్రమే బీమా పథకం అమలు చేయనున్నారు.  తగినంత బడ్జెట్‌ లేదని ఇద్దరు అనుబంధ కార్మికులకు బదులు ఒక్కరికే అవకాశమిస్తున్నారు. దీంతో సగం మందికి మాత్రమే బీమా అమలు కానుంది. 59 ఏళ్లకు పైబడి ఉన్న 40శాతం మందికి ఈ పథకం వర్తించదు. వ యోపరిమితి తొలగించాలని, కార్మికులు ఎవరు చనిపోయినా రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని, ఇద్దరు అనుబంధ కార్మికులకు బీమావర్తింప చేయాలని నేతన్నలు డిమాండ్‌ చేస్తున్నారు.


చేకూరని లబ్ధి

ప్రభుత్వ పథకాలకు జియోట్యాగింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటోంది. అయితే చేనేతలో కుటుంబంలోని సభ్యులందరూ భాగస్వాములైతేనే వృత్తి సాగుతోంది. జియోట్యాగింగ్‌ను ప్రామాణికంగా తీసుకోకుండా వృత్తితో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ బీమా వర్తింపజేయాలని కార్మికులు కోరుతున్నారు. సహకార సంఘాల్లో కాకుండా కొన్ని కుటుంబాలు సొంతంగా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నాయి. వీరి విషయంలో సైతం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక 2003లో పోచంపల్లిలో నాలుగు ఎకరాల స్థలంలో నేతబజార్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. నిధులలేమితో ఇది పునాదులకే పరిమితమైంది. నేత బజార్‌ను ప్రారంభిస్తే సుమారు 5వేల మంది కార్మికులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే అవకాశం ఉంది.


సహకార సంఘాలకు ఎన్నికలు ఎన్నడో

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహ కార, పవర్‌లూమ్‌లు కలిపి 84సహకార సంఘాలున్నాయి. అందులో 25,900మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 44చేనేత సహకార సంఘాలు, 7పవర్‌లూమ్‌ సంఘాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 25చేనేత సహకార సంఘాలు, 5పవర్‌లూం సంఘాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో మొత్తం 3 చేనేత సహకార సంఘాలున్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తోంది. 2018లో ఎన్నికల నిర్వహణ కోసం సభ్యులం దరికీ పాస్‌బుక్‌లు ఇచ్చి వాటి ఆధారంగా ఓటర్ల జాబితాను తయారు చేశారు. ఆ తరువాత ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం ఇప్పటికీ వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2013 ఫిబ్రవరి 12న ప్రభుత్వం చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమించింది. వారి గడువు 2018 ఫిబ్రవరి 12 నాటికి ముగియగా, నాలుగేళ్లుగా ఎన్నికలు లేవు. పాలకవర్గాలు ఉంటేనే కార్మికులకు ప్రయోజనం.


కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : వెంకటేష్‌, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి 

చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పాలక వర్గాల గడువు పూర్త యి నాలుగేళ్లు దాటినా ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


దరఖాస్తు అవసరం లేదు : వెంకటేశం, చేనేత, జౌళీశాఖ ప్రాంతీయ ఉపసంచాలకుడు

నేతన్నకు బీమా పథకం ఈనెల 7నుంచి అమలు చే యా లని ప్రభుత్వం నిర్ణయించింది. 18-59 ఏళ్ల వయసు, జియో ట్యాగ్‌ ఉన్న మగ్గం,మరమగ్గం నేసే కార్మికులు, వారికి అను బంధంగా ఒక కార్మికుడు చొప్పున ఈ పథకం వర్తిస్తుంది. నేతన్నకు చేయూత పేరుతో అమలు చేస్తున్న త్రిఫ్ట్‌ స్కీంలో న మోదైన వారి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో మా వద్ద ఉన్నాయి. బీ మా పథకం కోసం మళ్లీ వారు కొత్తగా దరఖాస్తు చేసు ోవాల్సిన అవసరం లేదు. త్రిఫ్ట్‌ పథకంలో చేరినవారందరికీ బీమా పథకం ఉచితంగా ఎల్‌ఐసీ ద్వారా వర్తిస్తుంది.


ఉమ్మడి జిల్లాలో చేనేత సంఘాలు, సభ్యులు

జియోట్యాగింగ్‌ అయిన మగ్గాల సంఖ్య : 7,920

అనుబంధ కార్మికుల సంఖ్య : 15,935 మంది

ఒక్కో మగ్గంపై ముగ్గురు చొప్పున మొత్తం కార్మికులు : 23,260 మంది

సహకార రంగంలోని కార్మికులు : 13,500 మంది

సహకారేతర రంగంలోని కార్మికులు : 12,000 మంది

మొత్తం చేనేత కార్మికులు : 1,50,000 మంది

Updated Date - 2022-08-07T05:28:57+05:30 IST