ఎన్95, కేఎన్95 మాస్క్‌ల మధ్య తేడా ఏమిటి?

ABN , First Publish Date - 2021-04-18T22:44:20+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తలు

ఎన్95, కేఎన్95 మాస్క్‌ల మధ్య తేడా ఏమిటి?

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చునని ది లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఓ వ్యాసం పేర్కొంది. దీనిపై నిపుణులు స్పందిస్తూ నాలుగు గోడల మధ్య ఉండే గాలిలో ఈ వైరస్ నిలకడగా ఉంటూ, ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని నుంచి తప్పించుకోవాలంటే ఎన్95 లేదా కేఎన్95 మాస్క్‌లను ధరించాలని సలహా ఇస్తున్నారు. ఈ రెండు రకాల మాస్క్‌ల మధ్య సారూప్యతలు, తేడాలను తెలుసుకుందాం.


ఎన్95, కేఎన్95 పేర్లను చూసినపుడు దాదాపు సమానంగా కనిపిస్తాయి. అయితే వీటి పని తీరు కూడా ఒకే విధంగా ఉంటుందా? తేడాలేమైనా ఉంటాయా? శ్వాస సంబంధిత మాస్క్‌ల్లో అమెరికన్ ప్రమాణాలతో తయారయ్యేది ఎన్95 మాస్క్ కాగా, కేఎన్95 మాస్క్‌లను చైనీస్ ప్రమాణాలతో తయారు చేస్తారు. మాస్క్‌లను తయారు చేసే కంపెనీ 3ఎం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ రెండు మాస్క్‌లను సమానంగా పరిగణించవచ్చు. యూరోపు, ఆస్ట్రేలియా, కొరియా, జపాన్ ప్రమాణాలతో తయారయ్యే మాస్క్‌లు కూడా చాలా వరకు ఇదే విధంగా ఉంటాయి. 


ఎన్95, కేఎన్95 రెస్పిరేటర్ మాస్క్‌లు  గ్రహించే కణాల శాతం ఒకే విధంగా ఉంటుంది. అంటే 0.3 మైక్రాన్ పరిమాణంగల కణాల్లో గరిష్ఠంగా 95 శాతం వరకు అడ్డుకుని, నిలిపివేయగలవు. ఇంత కన్నా చిన్న పరిమాణంగల కణాలను ఈ మాస్క్‌లు నిరోధించలేవని అనుకునే అవకాశం ఉంది. అయితే, అదే నిజమైతే వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ఈ మాస్క్‌లు బాగా ఉపయోగపడతాయనుకోవడంలో అర్థం లేదు. విచిత్రమైన విషయం ఏమిటంటే, 0.3 మైక్రాన్ల కన్నా చిన్న పరిమాణంగల కణాలను గ్రహించడం చాలా సులువు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేశారు కూడా.


ఎన్95, కేఎన్95 మాస్క్‌లను నిమిషానికి 85 లీటర్ల వేగంతో ప్రయాణించే ఉప్పు నీటి ప్రవాహంలో పరీక్షించి చూశారు. వీటి మధ్య చాలా చిన్న చిన్న తేడాలు మాత్రమే కనిపించాయి. సగటు మాస్క్ యూజర్‌ వీటిని పట్టించుకోనక్కర్లేదు. 


కేఎన్95 మాస్క్‌గా ధ్రువీకరణ పొందాలంటే చైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వీటిని తయారు చేసే కంపెనీలు మానవులపై వీటిని పరీక్షించాలి. ఎనిమిది శాతం లేదా అంతకన్నా తక్కువ లీకేజ్‌ ఉన్నట్లు నిరూపించాలి. దీని కోసం ప్రత్యేకంగా ఓ పరీక్షను నిర్వహించాలి. అయితే ఎన్95 మాస్క్ తయారీకి కంపెనీలు ఇటువంటి ఫిట్నెస్ టెస్ట్‌లను నిర్వహించనక్కర్లేదు. 


ఎన్95తో సులువుగా శ్వాసించవచ్చు

శ్వాస తీసుకునేటపుడు ప్రెజర్ డ్రాప్ విషయంలో కాస్త కఠినమైన నిబంధనలను పాటిస్తూ ఎన్95 మాస్క్‌లను తయారు చేస్తారు. కేఎన్95 మాస్క్‌ల కన్నా కొంచెం ఎక్కువ శ్వాస తీసుకుని, వదలడానికి ఎన్95 మాస్క్‌లలో అవకాశం ఉంటుంది. మాస్క్ పెట్టుకుని శ్వాస తీసుకోవడం కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, అయితే ఆక్సిజన్ కొరతతో చనిపోయే అవకాశం మాత్రం ఉండదు. శ్వాసను విడిచేటపుడు ప్రెజర్ డ్రాప్ విషయంలో కూడా కాస్త కఠినమైన ప్రమాణాలతో ఎన్95 మాస్క్‌లను తయారు చేస్తారు. 


ఉతికితే సామర్థ్యం తగ్గుతుంది

ఎన్95 మాస్క్‌లను నీళ్ళలో ఉతికితే వాటి సామర్థ్యం తగ్గిపోతుందని కొందరు చెప్తున్నప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. వీటి తయారీలో ఫైబర్ షీట్లను ఉపయోగిస్తారు, ఈ షీట్లకు ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ ఇస్తారు. వీటిని ఉతకడం వల్ల ఈ స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పోతుంది, వీటి పని తీరు తగ్గుతుంది. తీవ్రంగా ఉతికితే ఫైబర్స్‌కు నష్టం జరుగుతుంది. ఫలితంగా  వీటి నుంచి కణాలు సులువుగా ప్రయాణం చేస్తాయి. 


Updated Date - 2021-04-18T22:44:20+05:30 IST