మన నదులపై కేంద్ర పెత్తనం ఏమిటి?

ABN , First Publish Date - 2021-10-14T08:32:47+05:30 IST

ఈరోజు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి కడవలు చేతులలో పట్టుకుని గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జిఆర్‌ఎంబి), కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కెఆర్ఎంబి) ముందు నిలబడి ‘మాకు కాసిన్ని నీళ్ళివ్వండి’ అని అడుక్కునే దృశ్యం...

మన నదులపై కేంద్ర పెత్తనం ఏమిటి?

ఈరోజు నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీటి కడవలు చేతులలో పట్టుకుని గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జిఆర్‌ఎంబి), కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కెఆర్ఎంబి) ముందు నిలబడి ‘మాకు కాసిన్ని నీళ్ళివ్వండి’ అని అడుక్కునే దృశ్యం మనం చూడబోతున్నాం. ఒకరు ‘మా తండ్రిగారి అధికారానికి వారసత్వం మాదే’ అని నిలిచి అధికారం చేజిక్కినదాకా ఆరాటపడినవారు కాగా, మరొకరు ‘మా ప్రాంతం మీద అధికారం మాదే’ అని చెలరేగిన ఉద్యమంలోంచి అధికారం చేజిక్కించుకున్నవారు. ఇద్దరూ వరుసకట్టి నిలిచి తమ అధికారాలను తేలికగా కేంద్రానికి వదిలేసి నీటికోసం బిచ్చపు పాత్రలతో నిలబడబోతున్నారు. కేంద్రం మిథ్య అని విశ్వాసం ప్రకటించుకున్న తెలుగు ప్రజల ముఖ్యమంత్రులు తాము, తమ రాష్ట్రాలు, తమ ప్రజలు మిథ్య అని, కేంద్రమే సత్యమని బాహాటంగా తలలు వంచుకుని నిలిచే దృశ్యం చూడబోతున్నాం. ఏ గోదావరి, కృష్ణా నదులు తెలుగు ప్రజల వికాసానికి, చైతన్యానికి దోహదమైనాయో ఆ నదులను, వాటి మీద తెలుగు ప్రజల చెమ్మతో నిర్మించిన ప్రాజెక్టులను, వాటి నుంచి తవ్విన కాలువలను కేంద్రానికి వదిలి అడుక్కోవటానికి నిలిచిన దృశ్యమది. తెలంగాణకు ప్రభుత్వం ఉండటం మాత్రమే తెలంగాణ జలసాధన మార్గమని గుర్తించటం వల్లే తెలంగాణ ఉద్యమ పతాక వాక్యంలో నీళ్ళు ప్రధాన పదం అయింది. నిధులు ఎక్కడివక్కడ వ్యయం చేయాలన్నా, ఉద్యోగాలు ఎక్కడివారికక్కడ దక్కాలన్నా రాష్ట్రం ఏర్పడటం, అధికారాలుండటం చాలా కీలకమైన విషయాలైపోయాయి. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం ఈ అగ్నిలో బలపడింది. 1995 సెప్టెంబర్ 20న అప్పటి ముఖ్యమంత్రికి బహిరంగ లేఖరాసి కృష్ణా జలాల్లో మా వాటా మాకు ఇవ్వకపోతే మేం మలిదశ తెలంగాణ పోరాటం చేస్తామని హెచ్చరించవలసి వచ్చింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ‘తెలంగాణ ఏర్పడటం నీటి సమస్య పరిష్కారానికి అవసరం’ అని ఆచార్య మాడభూషి శ్రీధర్ ప్రత్యక్షంగా వివరించినట్టుగానే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నదుల నీటి వాటా సాధన మార్గం అవిభాజ్యమైనవని’ పాలమూరు అధ్యయన వేదిక ఒక బహిరంగ లేఖ ద్వారా వివరించవలసి వచ్చింది. రాష్ట్రం ఏర్పడి ఏడున్నర ఏండ్లు గడిచిపోయినా, ఒక ఓటు రెండు రాష్ట్రాలని నమ్మబలికిన భాజపా కేంద్రంలో అధికారం చేపట్టినా తెలంగాణ నీటి వాటా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఎన్నెన్నో పనులు చేసింది కానీ తెలంగాణకు నీరివ్వటానికి కనీస పట్టుదల చూపలేకపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస న్యాయాన్ని అవగాహనను సాధించటంలో ఘోరంగా విఫలమైపోయాయి. రాష్ట్రం ఏర్పడితే నీళ్ళు వస్తాయనుకుంటే నదులనే తన్నుకుపోయే పరిస్థితులు దాపురించాయి. 


కృష్ణా, గోదావరి నదులమీద, వాటి ఆధారంగా వికసించిన జీవితం మీద, వాటి నీరందని ప్రజల ఆరాటపోరాటాల మీద, ఆ నదులపై నిర్మించిన ప్రాజెక్టులలో సర్వం కోల్పోయిన ప్రజల మీద కేంద్రానికి చిన్నపాటి కన్సర్న్‌ ఏనాడూ లేదు. అయితే ఇపుడు ఏకంగా ఆ నదుల మీద అధికారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇది అవాంఛనీయమైన, బాధ్యతారహితమైన, చట్టవ్యతిరేకమైన రాకడ. అధికార దాహంతో రాకడ. తెలంగాణ రాష్ట్ర పోరాటానికి సమాధానంగా భారత పార్లమెంటు ఆంధ్రప్రదేశ పునర్విభజన చట్టం చేసింది. ఆ చట్టంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ చట్టం 9వ భాగంలో 84 నుంచి 91 దాకా ఎనిమిది సెక్షన్లు ఉభయ తెలుగు రాష్ట్రల మధ్య నీటి పంపిణీ, నిర్వహణ ల సవివర ప్రస్తావన ఉంది.


2021 జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేయటానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెలరేగిన ఘర్షణ ప్రధాన కారణంగా మాట్లాడుతున్నారు కానీ, రాజ్యాంగ పరంగా, చట్టపరంగా కేంద్రానికి అంతటి అధికారాలు లేవు. అంతర్రాష్ట్ర నదుల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదం తీవ్రమైనపుడు ఆయా రాష్ట్రాల కోరిక మేరకు ట్రిబ్యునల్స్‌ ఏర్పరచటం మాత్రమే కేంద్రం చేయగలదు. రాష్ట్ర భూభాగాలమీద, వనరుల మీద సార్వభౌమాధికారం రాష్ట్రాలదే కానీ కేంద్రానిది కాదు. రాజ్యాంగం ఈ దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా మాత్రమే స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టం కూడా నదులను, ప్రాజెక్టులను కేంద్రం కైవసం చేసుకోవాలని చెప్పలేదు. పైగా ఇద్దరేసి అధికారులను విధాన నిర్ణయబృందంలో ఆయా రాష్ట్రాల నుంచి తీసుకోవాలని చెప్పింది. చట్టం చెప్పిన సానుకూలమైన పనులు చేయకుండా, చట్టంలో ఆటంకంగా ఉన్న అంశాలు సవరించకుండా కేంద్రం పెత్తనానికి ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులకు, ముఖ్యమంత్రులకు ఈ పెత్తనాన్ని ప్రశ్నించే తెలివిలేదనుకోలేము. ఇతరేతర కారణాలు వీరందరినీ స్వీయగౌరవానికి దూరం చేస్తున్నాయేమో?!


తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ రాజకీయ ప్రతినిధులు కానీ, తెలంగాణ ఉద్యమ సంస్థలుకానీ, తెలంగాణ మేధావులుకానీ తెలంగాణ ఏర్పడితే అంతా అయిపోతుంది అనే వైఖరితో పనిచేశారు. అటు ఆంధ్రవైపు రాష్ట్ర విభజనను అడుగడుగునా అడ్డగిస్తూ, మరోనోట తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ నీళ్ల విషయంలో చట్టంలో అనేక మెలికలు చొప్పించే పనిచేశారు. సెక్షన్ 89కి ఒక వివరణను కూడా చేర్పించి పాత ఒప్పందాలకు కట్టుబడాలని అందులో రాయించారు. ఆ మేరకు వారు సక్సెస్‌ కాగలిగారు. తెలంగాణ సమాజం రాష్ట్ర ఏర్పాటు తరువాత తన తావు వెతుక్కునే వెంపర్లాటలో పడింది. ఎవని బాధ వానికి వదిలేసింది. ఇది ఎంతదూరం పోయిందంటే తెలుగు ప్రజల జీవనప్రదాతలైన రెండు ప్రధాన నదులమీద అధికారాన్ని కేంద్రం స్థిరపరుచుకునే దాకా పోయింది. ఈ కేంద్ర ఉత్తర్వు అమలు మొదలైతే జలవనరుల మీద తెలుగు రాష్ట్రాల అధికారం మిథ్యగా మారిపోతుంది. అంతేకాక ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలను వదిలేసి రెండు తెలుగు రాష్ట్రాలనే ఇలా అవమానపరచటంలోని అర్థం ఏమిటో అడిగే పరిస్థితిలో తెలుగు ప్రజలు లేరనుకున్నారా? 


నదుల నిర్వహణలో తలెత్తే వైరుధ్యాల పరిష్కారానికి బోర్డులను ఏర్పరచటం అనేది మొదటి నుంచి ఉంది. కృష్ణా నదీజలాల పునఃపంపిణీ ఉద్యమం కూడా నీటిని రాష్ట్రాల మధ్య న్యాయంగా పంచి నీటి నిర్వహణ కోసం బోర్డులు ఏర్పరచాలని సూచించింది. తుంగభద్ర, కావేరి బోర్డులు పనిచేస్తున్నాయి. కావేరి బోర్డును ఇటీవల కేంద్ర ప్రభుత్వమే ఏర్పరచింది. ఆ బోర్డులో నాలుగు రాష్ట్రాలకి నిర్వహణ భాగస్వామ్యం ఉంది. తుంగభద్రకు మొదటి నుంచీ రెండు రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండగా ఇపుడు తెలంగాణ దానిలో చేరింది. ఈ బోర్డులకు లేని విధి నిషేధాలను కేంద్రం గోదావరి, కృష్ణా బోర్డులలో చేర్చింది. నిజానికి గోదావరిలో నీటి లభ్యత సమస్యకాదు. ఏ ఘర్షణ లేకున్నా గోదావరిని కూడా వివాదంలోకి తెచ్చి చేతిలోకి తీసుకుంటున్నారు. ఈ విషయంలో కూడా తెలుగు ముఖ్యమంత్రులు విజ్ఞత చూపటం లేదు. పైగా ఒక రాష్ట్రం మీదికి మరొక రాష్ట్రం వాళ్ళు కేంద్రాన్ని ఉసిగొల్పుతున్నారు. ఇంకోవైపు అధికారం పైనుంచి సంక్రమించిందనే తప్పుడు చైతన్యంతో ఈ ముఖ్యమంత్రులు అధికారం ప్రజల నుంచి సంక్రమిస్తుందని కానీ, తెలుగు ప్రజల, తెలంగాణ ప్రజల గౌరవానికి భంగకరంగా నడుచుకుంటున్నామని కానీ ఆలోచించకపోవటం వల్ల మా నదుల మీద మేం నిర్మించుకున్న ప్రాజెక్టుల మీద మీ పెత్తనం చెల్లదు అని ప్రకటించలేకపోతున్నారు. సూటిగా ప్రశ్నించలేకపోతున్నారు. కేంద్ర గెజెట్‌ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని పోరాడలేకపోతున్నారు. 


దక్షిణ తెలంగాణ ఎగువ ప్రాంతాన్ని అంటే వందశాతం కృష్ణా పరీవాహక ప్రాంతంలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల నల్లగొండ ఎగువ ప్రాంతాల నీటి ఎద్దడిని, అందువల్ల తలెత్తిన సామాజిక, రాజకీయార్థిక వెనుకబాటుతనాన్ని పరిశీలిస్తే ఈ గెజిట్‌తో తలెత్తే ప్రమాదం తెలుస్తుంది. దేశం అమృతోత్సవాలు జరుపుకుంటుండగా మహబూబ్‌నగర్‌ ప్రజలకు వలసలే ఉత్సవమైనాయి. కృష్ణానదికి నీళ్ళిచ్చే మాకు నీరెందుకు లేదు అని అడగటానికి ఇన్నాళ్ళు ఇక్కడ ప్రభుత్వం లేదు. ప్రభుత్వం వచ్చి ఏడేండ్లు దాటినా ఈ బీడు భూములకి నీటివాటా రాలేదు. ఇప్పటిదాకా నేతలు ఉమ్మడిరాష్ట్రం మనకోసం పనిచేయదు అనేవారు. ఇపుడేమంటారు? కేంద్రం మనవైపు చూడదు అంటారు. నీరు పంచమని అడిగితే ఏకంగా ఆక్రమించటం ఏవిధమైన పంపిణీన్యాయమో, ప్రపంచంలో ఎక్కడా లేని ఈ అనుభవాన్ని కేంద్రం ఎందుకు తెలుగు ప్రజలమీద భారంగా మోపిందో ఆలోచించాలి. ఎగువ రాష్ట్రాలు దాటి రెండు గొప్పనదులు తెలుగురాష్ట్రాలలోకి వస్తాయి. ఆ నదులతో మన జీవితాలు అనుబంధాలు పెనవేసుకుని ఉన్నాయి. అవి తెలుగు ప్రజల వికాసానికి సోపానాలు. న్యాయంగా పంచుకోవటంలో ఆ నదుల అనుభవంతో పొందిన విజ్ఞతను ప్రదర్శిస్తే కేంద్రాన్ని నిలువరించటం మన నదుల్ని మనకోసం కాపాడుకోవటం, మనమే అధికారం నిర్వహించుకోవటం సమస్యేకాదు.సూటిగా చెప్పేదేమంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ గెజెట్‌ ప్రమాదకరం. కేంద్రం విజ్ఞతతో దీన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే ఇదిక్కడ అమలు జరుగబోదని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పగలగాలి. గత మూడు నెలలుగా పాలమూరు అధ్యయన వేదిక ఈ విషయాన్ని వెబినార్లతో, రెండు టేబుల్‌ సమావేశాలు, ప్రాతినిధ్యాలతో విస్తృతంగా చర్చిస్తోంది. రాష్ట్రం ఏర్పరచుకున్న ప్రయోజనాన్ని దెబ్బతీసే ప్రమాదాలపై ప్రజల్ని హెచ్చరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌  నోటిఫికేషన్‌ ప్రతులను నేడు దహనం చేయాలని  ప్రతిపక్ష పార్టీలు ప్రజాసంఘాలు పిలుపు నిచ్చాయి. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు. ఇక ప్రజలే పూనుకోవాలి. స్వీయగౌరవం కాపాడుకోవాలి. 

ఎం. రాఘవాచారి

కన్వీనర్‌, పాలమూరు అధ్యయన వేదిక

Updated Date - 2021-10-14T08:32:47+05:30 IST