ఇంగ్లీషులో అడిగితే హిందీలో జవాబు ఏమిటి?

ABN , First Publish Date - 2021-08-24T08:28:50+05:30 IST

కేంద్రప్రభుత్వాన్ని ఎవరైనా ఏదైనా ఇంగ్లీషులో అడిగితే అదే భాషలో జవాబు చెప్పాలి తప్ప హిందీలో చెప్పడం సరైంది కాదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ గురువారం...

ఇంగ్లీషులో అడిగితే హిందీలో జవాబు ఏమిటి?

కేంద్రప్రభుత్వాన్ని ఎవరైనా ఏదైనా ఇంగ్లీషులో అడిగితే అదే భాషలో జవాబు చెప్పాలి తప్ప హిందీలో చెప్పడం సరైంది కాదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ గురువారం నాడు (19 ఆగస్టు 2021) కేంద్రాన్ని ఆదేశించింది. సీఆర్పీఎఫ్ పారామెడికల్ రిక్రూట్మెంట్ కేంద్రాలను తమిళనాడు, పుదుచ్చేరిలలో ఏర్పాటు చేయాలని మధురై పార్లమెంట్ సభ్యులు ఎస్. వెంకిటేషన్ (సిపిఐ–ఎం) కేంద్రప్రభుత్వానికి ఇంగ్లీషులో లేఖ రాస్తే కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ హిందీలో జవాబిచ్చింది. దీనిపై వెంకిటేషన్ ఏడాది క్రితమే హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఇప్పుడు తీర్పు వచ్చింది. అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్, 1963ని అమలు చేయాలని, ఇంగ్లీషులో అడిగితే ఇంగ్లీషులోనే జవాబు చెప్పాలని జస్టిస్ ఎం. కిరుబకరన్, జస్టిస్ దురైస్వామి ధర్మాసనం తీర్పు చెప్పారు. భాషల విషయంలో బీజేపీ ఆధిపత్య దాడికి ఇది చెంపపెట్టు. రాజ్యాంగం 343 అధికరణంలో కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా హిందీ ఉంటుందని చెబుతూ, పదిహేనేళ్ల వరకు అధికారిక కార్యకలాపాలకు ఇంగ్లీషే కొనసాగుతుందని కూడా చెప్పారు. పదిహేనేళ్ల తర్వాత అవసరమనుకుంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఇంగ్లీషునే కొనసాగించవచ్చని కూడా పేర్కొన్నది. అందుకు అనుగుణంగానే 1963 పార్లమెంట్ చట్టం సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధికారిక వ్యవహారాలు ఇంగ్లీషులో నిర్వహించాలి. కానీ మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి అన్ని సందర్భాల్లో హిందీ భాషనే వినియోగిస్తోంది. ఈ ఆధిపత్య దాడిని ఎదుర్కోవడంలో తమిళనాడు రాష్ట్రం రాజీలేని పోరాటం చేస్తోంది. వారి ఆత్మ గౌరవ స్ఫూర్తికి హ్యాట్సాఫ్

నాగటి నారాయణ

Updated Date - 2021-08-24T08:28:50+05:30 IST