ఆ ధైర్యం ఏది?

ABN , First Publish Date - 2021-12-14T05:53:44+05:30 IST

‘‘అధికార పార్టీకి చెందిన ఓ మేయర్‌గారి కారు రోడ్డు మీద వెళుతోంది. జంక్షన్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడింది. కానీ డ్రైవర్‌ దానిని ఖాతరు చేయకుండా ముందుకు దూసుకువెళ్లాడు....

ఆ ధైర్యం ఏది?

‘‘అధికార పార్టీకి చెందిన ఓ మేయర్‌గారి కారు రోడ్డు మీద వెళుతోంది. జంక్షన్‌ వద్ద రెడ్‌ సిగ్నల్‌ పడింది. కానీ డ్రైవర్‌ దానిని ఖాతరు చేయకుండా ముందుకు దూసుకువెళ్లాడు. ఓ ట్రాఫిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆ కారును ఆపి చలానా రాశారు. తర్వాత కారులో ఉన్న మేయర్‌ను చూసి ఎస్సై ఆయనకు సెల్యూట్‌ చేశారు. కానీ చలానా రాసేశాను కాబట్టి కట్టాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన మేయర్‌ ఓ ఐపీఎస్‌ అధికారికి ఫోన్‌ చేశారు. ‘సర్‌! మీ ఎస్సై నా కారుకు చలానా రాశారు. కట్టాల్సిందే అంటున్నారు’ అని ఫిర్యాదు చేశారు. ‘పర్లేదు సర్‌! మీరు వెళ్లిపోండి. మీరు కట్టలేకపోతే చలానా నేనే కట్టేస్తా’ అని ఆ ఐపీఎస్‌ అధికారి సమాధానం ఇచ్చారు. మర్యాదగానే చెప్పినా ఆ మాటల అసలు సారాంశమేమిటో మేయర్‌గారికి అర్థమైపోయింది. చేసేదేం లేక తానే చలానా కట్టేసి అక్కడి నుంచి బయటపడ్డారు’’ - దాదాపు 15-–20 ఏళ్ల కిందట ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త ఇది. అన్నేళ్ల క్రితం వచ్చిన ఆ వార్త ఇప్పటికీ ఎందుకు గుర్తుందంటే అలాంటి వార్తలు ఇటీవల రావడం లేదు కాబట్టి!! తమకు రాజ్యాంగపరమైన విధులు, అధికారాలు ఉన్నాయనేది విస్మరించి అధికార పార్టీ చెప్పింది చేయడమే తమ విధిగా, తమకు అధికారాలు ఉన్నది ఆ విధి నిర్వహణ కోసమేనన్నట్లుగా అధికార యంత్రాంగం ప్రవర్తించడం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఫలితంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయి సామాన్యులకు న్యాయం దక్కని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ చేదు వాస్తవాన్ని సరిదిద్దాలనే చైతన్యం కంటే దానిపై అవగాహన, ఆమోదమే నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తోంది.


మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలను అడ్డుకున్నారంటూ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ నేటి పరిస్థితుల పట్ల ఆవేదన మాత్రం కలిగిస్తున్నది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు జరుగుతుండగా ఆయనను పలకరించి ధైర్యం చెప్పేందుకు రాధాకృష్ణ అక్కడికి వెళ్లారు. అక్కడున్న కొందరు వ్యక్తులు సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగుతుండగా రాధాకృష్ణ వారికి నచ్చచెప్పి సోదాలు సాఫీగా సాగేందుకు సహకరించారు. ‘‘సర్‌! మీరుంటే అంతా సాఫీగా సాగుతోంది. మరికాసేపు ఉండండి’’ అంటూ రాధాకృష్ణను కోరిన సీఐడీ అధికారులు ఆయనకు చివర్లో ధన్యవాదాలు కూడా చెప్పారు. జరిగింది ఇదైతే జగన్‌ పార్టీ ఛానల్‌ ‘సాక్షి’ మాత్రం సీఐడీ సోదాలను ఆయన అడ్డుకున్నారంటూ అవాస్తవాలను ప్రచారం చేసింది. దీంతో జరిగిందేమిటో వివరిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాయి. సోదాలను నిజంగా అడ్డుకుని ఉంటే సీఐడీ అధికారులు అప్పటికప్పుడే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి, తగినంతమంది బలగాలను పిలిపించి ఉండేవారు. కానీ రాధాకృష్ణను అక్కడే ఉండాల్సిందిగా కోరి ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్పిన ఏపీ సీఐడీ అధికారులు ఆయన అడ్డుపడ్డారంటూ మర్నాడు రాత్రి తీరిగ్గా ఫిర్యాదు చేయడం చూస్తుంటే దీని వెనక కథేమిటో ఎవరికైనా అర్థమవుతుంది. సీఐడీ అధికారులు రాధాకృష్ణకు ధన్యవాదాలు తెలపడం ఏపీ పాలకులకు రుచించి ఉండకపోవచ్చని, వారి ఒత్తిడి వల్లే సీఐడీ ఈ తప్పుడు ఫిర్యాదు చేసిందని సులభంగానే ఊహించవచ్చు.


సోదాలు జరిగినప్పుడు అనేక పత్రికల, చానళ్ల విలేఖరులు అక్కడ ఉన్నారు. పదుల సంఖ్యలో వీడియో కెమెరాలు అక్కడ జరిగినవన్నీ రికార్డు చేస్తున్నాయి. సోదాలను రాధాకృష్ణ అడ్డుకున్నారా? అవి సాఫీగా జరిగేలా సహకరించారా? అక్కడ ఏం జరిగింది? అనేది అందరికీ కనిపిస్తూనే ఉంది. మాటలు కూడా రికార్డయ్యాయి. ఈ కేసు న్యాయ పరీక్షకు నిలబడేది కాదు. ఏదో విధంగా ఎంతోకొంత ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే కేసు పెట్టారనేది సుస్పష్టం. కానీ వాస్తవాలను విస్మరించి, పాలక పెద్దల ఆదేశాలకు తలొగ్గి, ఆత్మసాక్షికి విరుద్ధంగా వ్యవహరించే అధికారుల తీరే ఆవేదన కలిగిస్తున్నది. తాము రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుందని, అందుకు విరుద్ధంగా మీరిచ్చే ఆదేశాలను పాటించలేమని పాలకులకు చెప్పగలిగే ధైర్యం అధికారులకు ఉండాలని ఆశించడం ఈరోజుల్లో దురాశే. గతంలో కిందిస్థాయిలో కొంత అవినీతి ఉన్నా చాలామంది అఖిలభారత స్థాయి అధికారులు నిజాయితీగా, చట్టబద్ధంగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు వారిలో పలువురు పాలక పెద్దల కనుసన్నల్లో నడుస్తుండడంతో అవ్యవస్థ కింది నుంచి పైకి కాకుండా పై నుంచి కిందికి ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత అధికారులదే కాదు.. ప్రజలది కూడా! అధికార పార్టీ మేయర్‌కు చలానా రాసిన ఎస్సై, చలానా కట్టాల్సిందేనన్న ఐపీఎస్‌ మాత్రమే కాదు... ఐపీఎస్‌కు ఆ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం కూడా ఉన్నప్పుడే వ్యవస్థ నాలుగు కాళ్లపై నిలబడుతుంది. ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించడం అత్యవసరం.

Updated Date - 2021-12-14T05:53:44+05:30 IST