అభయమేది?

ABN , First Publish Date - 2022-04-24T04:39:04+05:30 IST

అభయహస్తంలో పొదుపు చేసుకున్న డబ్బులను త్వరలో సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడిచిపోయినా ఇంత వరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.

అభయమేది?


  • అభయహస్తం నిధులు వాపస్‌ ఎప్పుడో!
  • డబ్బుల కోసం లబ్ధిదారుల ఎదురు చూపులు

అభయహస్తంలో పొదుపు చేసుకున్న డబ్బులను త్వరలో  సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడిచిపోయినా ఇంత వరకు ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు.  పొదుపు చేసుకున్న డబ్బుల కోసం స్వయం సహాయక సంఘాల మహిళలు గత ఐదారేళ్లుగా ఎదురు చూస్తున్నారు.

వికారాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : స్వయం సహాయక సంఘాల మహిళలు అభయహస్తం పథకంలో ప్రీమియం వాయిదా కింద చెల్లించిన డబ్బులను తిరిగి వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా ఇంత వరకు ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదు. స్వయం సహాయక సంఘాల మహిళలు అభయహస్తం పథకంలో పొదుపు చేసుకున్న డబ్బులను తిరిగి వారికే చెల్లించాలని గత నెలలో ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  అభయహస్తం పథకంలో 2016, ఏప్రిల్‌ నెల వరకు సభ్యులను నమోదు చేసుకున్న తరువాత కొత్త సభ్యులను చేర్చుకోలేదు. పాత సభ్యుల నుంచి తీసుకోవాల్సిన నెలవారీ ప్రీమియం వాయిదా డబ్బులు కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు చెల్లించే పింఛన్‌ మొత్తాన్ని భారీగా పెంచి చెల్లిస్తోంది. ప్రభుత్వం వృద్ధ్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పేరిట నెలనెలా పింఛన్‌ చెల్లిస్తోంది. ఆసరా పథకం అమల్లోకి వచ్చిన తరువాత అభయహస్తం పథకంపై మహిళల్లో ఆసక్తి తగ్గిందంటూ ప్రభుత్వం పక్కన పెట్టిన విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వృద్ధ్దాప్యంలో ఇబ్బందులు పడకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 13 ఏళ్ల కింద అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభయహస్తం పథకానికి రూపకల్పన చేశారు. 60 ఏళ్లు నిండిన స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు ప్రతినెలా  పింఛన్‌ చెల్లించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అభయహస్తం పథకంలో చేరిన ప్రతి మహిళకు బీమా సదుపాయం కల్పించారు. పొదుపు మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థికంగా భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీతో కలిసి అభయహస్తం పేరిట బీమా పథకాన్ని ప్రారంభించింది. 

తప్పని ఎదురు చూపులు

అభయహస్తం పథకంలో చేరిన మహిళలు చెల్లించిన బీమా ప్రీమియం డబ్బులను ప్రభుత్వ వాటాతో కలిపి వడ్డీతో తిరిగి చెల్లించనున్నట్లు ప్రభుత్వం గతనెలలో ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలోని 50 వేల మంది వరకు పొదుపు మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇటీవల వీరి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. తమకు రావాల్సిన అభయహస్తం డబ్బులు తమ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయోనని సభ్యులు ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో 51,297 మంది సభ్యులు

జిల్లాకు చెందిన 51,297 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు అభయహస్తంలో నమోదు చేసుకున్నారు. బంట్వారం మండలంలో 972, బషీరాబాద్‌లో 3,170, బొంరా్‌సపేట్‌లో 3,181, ధారూరులో 1,091, దోమలో 4,487, దౌల్తాబాద్‌లో 2,208, కొడంగల్‌లో 1,969, కోట్‌పల్లిలో 1,323, కులకచర్లలో 3,188, మర్పల్లిలో 3,945, మోమిన్‌పేట్‌లో 2,335, నవాబ్‌పేట్‌లో 2,416, పరిగిలో 4,030, పెద్దేముల్‌లో 3,029, పూడూరులో 3,840, తాండూరులో 3,180, వికారాబాద్‌లో 1,944, యాలాల్‌లో 890, తాండూరు మునిసిపాలిటీలో 1100, వికారాబాద్‌ మునిసిపాలిటీలో 1,944 మంది మహిళలు అభయహస్తంలో సభ్యులుగా నమోదయ్యారు. ఈ పథకంలో చేరిన మహిళా సభ్యులు రోజుకు ఒక రూపాయి వంతున ఏడాదికి రూ.365 ప్రభుత్వానికి చెల్లిస్తే .. ప్రభుత్వం అంతే మొత్తంలో ఆ సభ్యురాలి పేరిట తనవంతు వాటా కింద రూ.365 జమచేసేది.  స్వయం సహాయ సంఘాల్లో 60 ఏళ్లు దాటిన మహిళలకు బీమా సంస్థ ద్వారా రూ.500 వంతున నెలనెలా  పింఛన్‌ అందే విధంగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా సంఘాల్లో 60 ఏళ్లు నిండిన వారు ఒకేసారి పదేళ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తే అభయహస్తం కింద    లబ్ధి పొందే అవకాశం కల్పించింది. 60 ఏళ్ల తరువాత నెలనెలా రూ.500 వంతున పింఛన్‌ పొందడంతో పాటు బీమా సదుపాయం కూడా కల్పించడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు అభయహస్తం పథకంలో అధిక సంఖ్యలో నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో చేరిన మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.70వేలు, సహజ మరణానికి రూ.30వేలు, పూర్తి వైకల్యం కలిగితే రూ.75వేలు బీమాసంస్థ ద్వారా చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులను ఆదుకునేలా చర్యలు తీసుకున్నారు. మరణించిన సభ్యుల పిల్లలకు 9 నుంచి 12వ తరగతి వరకు నెలకు రూ.1200 వంతున ఉపకార వేతనాలు మంజూరు చేసేలా నిబంధనలు రూపొందించారు. 

Updated Date - 2022-04-24T04:39:04+05:30 IST