Abn logo
Aug 10 2021 @ 03:29AM

చమురు ఆదాయాన్ని ఏంచేస్తున్నారు?

అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర 2015లో 111 డాలర్లుగా ఉంది. కొవిడ్ మహమ్మారి ఫలితంగా ఈ ధర 2020లో 23 డాలర్లకు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో చమురు ధర మళ్ళీ పెరుగుతోంది. బ్యారెల్‌ చమురు ధర ప్రస్తుతం 76 డాలర్లుగా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించలేదు. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కి పైగా పెరిగిపోయింది. 


చమురు ధర పెరుగుదలతో అన్ని సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశ ఆర్థికాభివృద్ధిని ఇది ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. చమురు ధర అధికంగా ఉండడం వల్ల సమకూరే ప్రయోజనాలతో ఆ ప్రతికూల ప్రభావాలను అంచనావేయవలసి ఉంది. మనం వినియోగించుకుంటున్న చమురులో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ఇతర ఆందోళనకర పరిణామాల వల్ల చమురును దిగుమతి చేసుకోలేకపోతే మన ఆర్థిక కార్యకలాపాలు అస్తవ్యస్తమైపోతాయి. చమురు ధరను పెంచితే మన వినియోగం తగ్గుదలకు దారితీస్తుంది. చమురు దిగుమతులపై ఆధారపడడం తగ్గిపోయి మన ఆర్థిక సార్వభౌమత్వం పటిష్ఠమవుతోంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే చమురు వినియోగంతో కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతాయి. భూతాపం మరింతగా తీవ్రమవుతుంది. ప్రాకృతిక విపత్తులు మరింత తరచుగా సంభవిస్తాయి. చమురు ధరను పెంచితే వినియోగం తగ్గి కార్బన్ ఉద్గారాలూ తగ్గుతాయి. ఈ పెరుగుదల దేశ ఆర్థిక సార్వభౌమత్వంపై చూపించే సానుకూల ప్రభావంతో పోల్చినప్పుడు అది ఆర్థికాభివృద్ధిపై చూపించే ప్రతికూల ప్రభావం తక్కువేనని నేను విశ్వసిస్తున్నాను. 


చమురుపై విధించిన ఎక్సైజ్ సుంకంతో లభిస్తున్న ఆదాయాన్ని ఉపయోగిస్తున్న తీరుతెన్నులలోనే సమస్య అంతా ఉంది. పెరిగిన ఆదాయాన్ని మూల ధన వ్యయాలకు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవాలు ఈ వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు రూ.1,15,000 కోట్ల మేరకు పెరిగిన మాట నిజమే. అయితే మూలధన ఆస్తుల విక్రయం వల్ల ప్రభుత్వానికి రూ.1,42,000 కోట్ల ఆదాయం సమకూరింది. దీన్ని బట్టి చమురు ఆదాయాన్ని మూల ధన వ్యయాలకు ఉపయోగించడం లేదని స్పష్టమవుతోంది. చమురు రాబడిని సంక్షేమ వ్యయాలకు వినియోగిస్తున్నామనేది ప్రభుత్వం చేస్తున్న రెండో వాదన. ఇది కూడా సందేహాస్పదమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యయాలలో 34 శాతం కోత విధించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన వ్యయాన్ని గత ఏడాది రూ.75,000కోట్ల నుంచి రూ.65, 000 కోట్లకు తగ్గించారు. గ్రామీణ విద్యుద్దీకరణ వ్యయాలను రూ.4500 నుంచి రూ.3500 కోట్లకు తగ్గించారు. 


అసలు నిజమేమిటంటే చమురుపై భారీగా ఎక్సైజ్‌సుంకం విధింపుతో లభిస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వ ఉపయోగాన్ని అధికం చేసేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వవ్యయాలను ‘మూలధన’, ‘రెవెన్యూ’ వ్యయాలుగా వర్గీకరిస్తారు. ఒక పెట్టుబడి ఆస్తిని లేదా స్థిరాస్తిని కొనుగోలు చేసేందుకు వెచ్చించిన మొత్తం, ఆ ఆస్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చేసే వ్యయం మూలధన వ్యయం. ఇలాంటి ఆస్తులపై చేసిన ఖర్చు ప్రయోజనం అనేక సంవత్సరాల పాటు ఉంటుంది. ఏ ఖర్చు ప్రయోజనమైతే సంబంధిత సంవత్సరానికే పరిమితమవుతుందో దానిని రాబడి ఖర్చు అంటారు. ఇది పునరావృతమయ్యే స్వభావం గల వ్యయం. హైవేల నిర్మాణం మొదలైనవి మూలధన వ్యయాల కిందకు వస్తాయి. ప్రభుత్వోద్యోగులకు చెల్లించే వేతన భత్యాలు రెవెన్యూ వ్యయాల కిందకు వస్తాయి. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ వ్యయాలు రూ.30,000 కోట్ల మేరకు పెరిగాయి. గత నెల 1న ప్రభుత్వోద్యోగుల డిఏ (అధిక ధరల భత్యం)ను 17 నుంచి 28 శాతానికి పెంచారు. చమురు ఉత్పత్తుల విక్రయాల నుంచి లభిస్తున్న ఆదాయాన్ని ఉద్యోగుల వేతన భత్యాల పెంపుదల తదితర ప్రభుత్వ వ్యయాలను పెంచేందుకే ఉపయోగిస్తున్నారనేది స్పష్టం. 


ప్రస్తుతం మన ఆర్థికవ్యవస్థ పరిస్థితి సవ్యంగా లేదు. సగటు మనిషి కొనుగోలు సామర్థ్యం చాలా తక్కువగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. గత మూడు సంవత్సరాలుగా వస్తుసేవల పన్ను నెలసరి వసూళ్లు రూ.1,00,000 కోట్లకు అటూ ఇటూగా ఉండడమే అందుకు నిదర్శనం. ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు ఈ కింద సూచించిన చర్యలను ప్రభుత్వం తప్పకుండా తీసుకోవాలి. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేస్తున్న మదుపులలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి, మురికివాడలలో విద్యుత్‌సదుపాయాల కల్పనకు, చిన్న పట్టణాలలో ఉచిత వై-ఫై సదుపాయం సమకూర్చేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఈ మెరుగైన సౌకర్యాల వల్ల సగటు పౌరులు తమ ఆదాయాలను పెంపొందించుకోగలుగుతారు. మార్కెట్ నుంచి వివిధ సరుకులను విరివిగా కొనుగోలు చేయగలుగుతారు. ఈ కొనుగోళ్ళతో డిమాండ్ అనివార్యంగా పెరుగుతుంది. చమురు ఉత్పత్తుల విక్రయాల నుంచి లభించిన ఆదాయాన్ని ప్రభుత్వోద్యోగుల బ్యాంకుఖాతాలకు కాకుండా సామాన్యమానవుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలి. ఆ రాబడిని ఇలా పేదల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు వినియోగిస్తే చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని మరింతగా పెంచినా సమర్థనీయమే అవుతుంది. సగటు పౌరుల కోసం సంపూర్ణంగా ఖర్చు పెడుతున్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.150కి పెంచడం సైతం న్యాయోచితమే అవుతుంది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...