Abn logo
Jun 11 2021 @ 00:26AM

కావాల్సింది సాంస్కృతిక పునరుజ్జీవనం

‘1974 జూన్ 5: బిహార్ ఉద్యమ చరిత్ర ఒక మేలు మలుపు తిరిగిన రోజు. ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ‘సంపూర్ణ క్రాంతి అబ్ నారా హై, భావి ఇతిహాస్ హమారా హై’ అన్న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ నినాదం బ్యాలెట్ విప్లవానికి దారితీసింది. వర్తమాన భారతదేశానికి ఆ ‘సంపూర్ణ విప్లవ’ భావజాలం ఏమైనా ఉపయుక్తత కలిగి ఉందా?’


పై మాటలు స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ మొన్న జూన్ 5న ‘సంపూర్ణ క్రాంతి దివస్’ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రాసిన ఒక వ్యాసం లోనివి. ‘సంపూర్ణ విప్లవం అనేది రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలో కూడా సంభవించే విప్లవం’ – ఇది ఆ వ్యాసం సారాంశం. ఇదే మా ఈ వ్యాసానికి భూమిక!


గత ఏడెనిమిదేళ్ళుగా దేశంలో రాజకీయ ప్రేరేపిత సాంస్కృతిక ఆధిపత్యం, ఏకశిలాసదృశ భావావరణం కమ్ముకున్నది. సంస్కృతి రూపంలో మతం జీవితాలను శాసిస్తున్నది. ఆహార, ఆహార్య, ఆచార, వ్యవహారాల దుర్భిణి నిరంతరమూ మనను గమనిస్తున్నది. మన బతుకును నిర్దేశిస్తున్నది. మెజారిటీ ప్రజలు మతానికి-సంస్కృతికి-రాజకీయానికి సారూప్యవిబేధాలు చూడలేకపోతున్నారు. కాబట్టే, అస్తవ్యస్త పాలనతో, అబద్ధాలతో, గారడీ మాటలతో, దాపరికాలతో చేసే ప్రభువుల పాలన చెల్లుతున్నది. 


ప్రశ్నించే తత్త్వపు అత్యుత్తమ లక్షణం – ప్రశ్నను కూడా ప్రశ్నించడం. స్వార్థపూరితులైన మతప్రవక్తలను, బాబాలను, పీఠాధిపతులను మనం నిలదీయగలిగేది ఇట్లాగే సాధ్యం. అయితే సవ్యమైన ప్రశ్న వేయకుండా అపసవ్య ప్రశ్నలతో పైచేయి సాధించడం సాంస్కృతికపీఠాల పాఠాలలో ముఖ్యమైనది. ‘మానవ జన్మకు ఫలం ఏది?’, ‘మంచివాళ్ళకే ఎందుకు దేవుడు సమస్యలు సృష్టిస్తాడు’ లాంటి ప్రశ్నల ఉద్దేశం ప్రజలను మతాలపై ఆధారపడేటట్టు చేయడమే. వీటిని సమాధానం వెతకకూడని ప్రశ్నలుగా చిత్రించి, ఆ సృష్టికర్త లీలావిలాసాలుగా ఏమార్చి, మరింతగా దేవునిపై గురి కుదిరేటట్టు చేసే ఎజెండాతో వేసే ఇలాంటి ఉచ్చులో పడకుండా ఉండాలంటే శాస్త్రీయ దృక్పథం అత్యవసరం.


ఎన్నెన్నో ఆవిష్కరణలకూ, పటిష్ఠ పౌరసమాజాలకూ, పారదర్శక పాలనకూ, ప్రజా సంక్షేమ రాజకీయ విధానాలకూ ఆలవాలమైన నేటి యూరప్ దేశాల్లో –మరీ ముఖ్యంగా స్కాండివేనియన్ దేశాల్లో–మానవ వికాసం ఈ దశకు చేరడానికి యుగాలే పట్టింది. 


భారతీయ సంస్కృతి పెద్దలను గౌరవించడం, అణకువతో ఉండడం లాంటి విలువల ద్వారా ప్రశ్నించే గొంతులను ముద్దాయిలుగా చేసింది. కాబట్టే మనలో ఎక్కువ శాతం అనుచరులుగా ఉండడానికే ఇష్టపడతాం – మత పెద్దలకుగానీ, రాజకీయ నాయకులకుగానీ! 


నాణ్యమైన జీవన ప్రమాణాలు, ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన సమాజాలు నైతిక విలువలు కలిగిన పౌరులను తయారుచేస్తాయి. అన్ని వనరులు అందరికీ అందినపుడు మానవ వనరుల వికాసానికి అడ్డేమీ? ఎక్కడైతే అవధులు లేని ప్రజాస్వామిక కాంక్ష ఉంటుందో అక్కడే కొత్త ప్రశ్నలకు, ఆలోచనలకు, విప్లవాలకు, సైన్స్ సహా అన్ని రంగాల్లో ఆవిష్కరణలకు సారవంతమైన వాతావరణం ఉంటుంది. ‘సంస్కృతీ పరిరక్షణ’ పేరుతో నిలువ విలువలను ప్రశ్నించ వీలులేదనే సమాజంలో, అట్లా ప్రశ్నిస్తే శిక్షలు విధించే సమాజాల్లో అభివృద్ధి ఎక్కడ? వికాసం యెట్లా? 


నైతిక విలువలు లుప్తమయినపుడు, ముఖ్యంగా మతం మాత్రమే ప్రజల జీవన విధానం అయినపుడు, మరీ ముఖ్యంగా మెజారిటీ మతం పాలనారూపంలో ఉన్నపుడు ఆ సమాజాల వికాసం సాధ్యం కాదు. అచట పౌరుల అనైతికతే కొత్త నైతిక విలువగా మారుతుంది. తమకంటే భిన్నమైన సాంస్కృతిక జీవనంలో ఉన్న సమూహాలను శత్రువులుగా చూస్తారు. ధనసంబంధమైన అవినీతిని వీరు సహించనట్టు కనిపిస్తారు. కొన్నిసార్లు నిజంగానే సహించరు కూడా. వీరిలోని ఈ పార్శ్వం సామాన్య ప్రజలను ఆకట్టుకుంటుంది. కాబట్టే – మొత్తం సమాజమూ దేశమూ అంతర్జాతీయ స్థాయిలో ‘మతపరమైన, ఫాసిస్టు సమాజం’ గా నిందలు పడుతున్న సమయంలో కూడా ‘గత ప్రభుత్వాల అవినీతి’ అనే పదజాలానికి ఆమోదం ఉండడం మనం గమనించగలం. ఈ భావనకు వేర్లు మతంమత్తులో కూరుకుపోయిన సంస్కృతిలో ఉన్నాయి!


నేడు ప్రపంచం ఒక కుగ్రామం. సాంకేతిక విస్ఫోటనం కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు – విశ్వవ్యాప్త పోకడలను, సంస్కృతులను, అభివృద్ధి నమూనాలను, ఆధునిక జీవన విధానాలను, ప్రమాణాలను అందరికీ పరిచయం చేసింది. ఈ వెలుగులో మనను మనం మరింత లోతుగా తరచి చూసుకునే సందర్భం ఇది. సాంస్కృతిక సంస్కరణలు లేదా సాంస్కృతిక పునరుజ్జీవనలు జరగవలసిన తరుణం ఇది. స్థిరీకృతమైవున్న, అహేతుకమైన, మతంచేత, ఇతర భావోద్వేగాల చేత రుద్దబడిన అలవాట్లను వ్యక్తులుగా మనం మానుకుంటేనే ఈ పునరుజ్జీవం సాధ్యం. 


స్వాభావికంగా మతాలు కఠినతరమైన నిబంధనలతో ఉంటాయి. తత్కారణంగా మతావలంభకులు ఒక్క దైవం విషయంలోనే కాదు - ఎక్కడా చర్చకు ఆస్కారం ఇవ్వరు. దేవుడు ఒక్కడే అనే క్రైస్తవం, ఇస్లాం లాంటి ఏకధర్మవాద మతాలలో ఈ నియంత్రణ మరింత హెచ్చు. క్రైస్తవం ప్రజలపై అన్నిరకాల ఆధిపత్యాలను చలాయించింది. నమ్మనివారిని చెండాడింది. నమ్మినవారినీ చెరపట్టింది. దేవుని పేరుతో హత్యలూ, హింసా సహా అనేక దుష్కార్యాలకు ఒడిగట్టింది. కానీ కాలగతిలో ఎన్నో మార్పులకూ, సంస్కరణలకూ లోనయింది. యూరప్‌లో వచ్చిన ఈ సాంస్కృతిక వికాసమే ప్రజలలో తార్కిక భావనలకు, హేతుబద్ద ఆలోచనలకూ ప్రోది చేసింది. తత్ఫలితంగా సాహిత్యం, కళల ప్రాభవం పెరిగింది. ఆ చైతన్యం ప్రజలకు శాస్త్రీయ దృక్పథం అలవరచింది. ధార్మిక వివేచనకు వేదికగా మాత్రమే మతం పరిమితం చేయబడ్డది. మతం పూర్తిగా వ్యక్తిగతమై రాజ్యంలో దాని చొరబాటు ఆగింది. ఈ మార్పు ఇతర మతాలలో జరగలేదు. మరీ ముఖ్యంగా ఇస్లాంలో. హిందూమతంలో చర్చకు చోటు వున్నా క్రైస్తవంలోలాగ విప్లవాత్మక మార్పులు రావలసే ఉన్నది. 


ఈ నేల అనాదిగా ప్రశ్నను ఆహ్వానించింది. కోరికలు ఎందుకు కలుగుతాయి అన్న ప్రశ్న ఇక్కడిదే. దుఃఖానికి హేతువు కనుగొనడానికి సర్వం త్యజించి అర్థరాత్రి ఇల్లు ఒదిలేసిన రాజకుమారుడు ఇక్కడివాడే. ఆయన ప్రతిపాదించిన ధర్మం అనంతరకాలంలో ఈ దేశాన్నుంచి తరమబడడమూ ఇక్కడి వైచిత్రే! దీనికి కారణం ప్రశ్నను సహింపలేని, మార్పులను ఆమోదించలేని జాతిగా మనం రూపాంతరం చెందుతూ ఉండడం.


ప్రజలందరినీ ఒకే సాంస్కృతిక ఛత్రం కిందకు తెచ్చే ప్రయత్నాలు ఈ దేశానికి మంచి చేసేవి కావు. వర్తమానం భవిష్యత్‌కు దారి చూపాలి. అట్లా కాక, తరతరాల భిన్నత్వంలో ఏకత్వ భావనకు తూట్లు పొడవడం కచ్చితంగా ప్రజల సాంస్కృతిక వైవిధ్య జీవన కాంక్షకు వ్యతిరేకమే. ప్రజల పేర ఒక ‘మూక’ చేస్తున్న దుష్ప్రయత్నమే. ఇది వసుధైక కుటుంబ భావనకు వ్యతిరిక్తమైనది. ప్రజల్లో పరిపూర్ణ ఆశాభావాన్ని నెలకొల్పే ప్రగతిశీల భావజాలం వర్తమాన భారతదేశానికి అవసరం.


మరోసారి యోగేంద్ర యాదవ్ మాటల్ని తడుముదాం... ‘ఇటువంటి ఆశాభావాన్ని ఏ భావజాలం సమకూర్చగలుగుతుంది? ప్రస్తుతమున్న ఏ భావజాలం కూడా సమకూర్చలేదు. ఈ సత్యం అటు మితవాద భావజాలాలకు, ఇటు వామపక్ష భావజాలాలకూ వర్తిస్తుంది. కొత్త భావాలను, నూతన అంశాలను, నవ శక్తులను సమ్మిళితం చేసుకోవడంలో విఫలమయ్యాయి. కాలానికి ముందు నడిచిన దార్శనికుడు జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన సంపూర్ణ విప్లవం అనేది రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలో కూడా సంభవించే విప్లవం.’


సరిగ్గా... ఈ మార్పే జరగాలిపుడు. ఆగస్టు 15, జనవరి 26 లాంటి ‘ఈవెంట్’ లను దాటి అసలైన ప్రజాస్వామ్యవీచికలతో రెపరెపలాడే మువ్వన్నెల జెండా నిరంతరం ఎగరాలి. ఇక్కడి ‘సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ది సాయిల్’ స్వేచ్ఛగా మనుగడ సాగించాలి. 


వేలాది ఏళ్ళుగా ఈనేలపైని ధార్మిక చింతనలు ఎప్పటికపుడు సంస్కరించబడుతూనే వచ్చాయి. స్వచ్ఛ నదీ ప్రవాహంలా పారే నేలంతా సారవంతం చేస్తూనే ఉన్నవి. ఆదిశంకరుడు, రామానుజుడు తదాదిగా కబీర్, అన్నమయ్యల వరకూ, గోపన్న నుంచి అగ్నివేష్ వరకూ ధర్మాన్ని, న్యాయాన్ని, సామాజిక అంశాలనూ వివేచనతో చూసారు. మత విశ్వాసులుగా ఉంటూనే వారివారి పరిధుల్లో అన్యాయాలను ప్రశ్నించారు, ఎదిరించారు, సంస్కరించారు. ఆ వారసత్వాన్ని మనకు అందిస్తూ వచ్చారు. ఆ వెలుగులో మనమిపుడు హిందూత్వ నుంచి హిందూ మతాన్ని చెరవిడిపించాలి. మరింత సంస్కరించుకోవాలి. సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారి సుగమం చేసుకోవాలి.


రవీంద్రనాథ్ టాగోర్ స్వప్నించిన ‘అలాంటి దేశంలోకి తండ్రీ నన్ను నడిపించు’ అని మనం ఆశించడం సబబే కదా? సాంస్కృతిక పునరుజ్జీవన కాంక్ష సమ్మతమే కదా? శాస్త్రీయ దృక్పథం ఇరుసుగా ‘సంపూర్ణ విప్లవం’ సాధ్యమే కదా?

శ్రీశైల్ రెడ్డి పంజుగుల

డాక్టర్ సతీష్ చంద్ర (యూకే)

ప్రత్యేకంమరిన్ని...