కోతుల నియంత్రణేది ?

ABN , First Publish Date - 2021-12-04T06:57:20+05:30 IST

రోజురోజుకూ పెరిగిపోతున్న వానరాల సంతతి సాధారణ జనజీవనంపై తీవ్రప్రభావం చూ పుతోంది.

కోతుల నియంత్రణేది ?
కోతుల దాడిలో గాయపడి కాళ్లు విరిగిన సయ్యద్‌(ఫైల్‌)

హద్దులు లేకుండా పెరుగుతున్న  వానర సంతతి

ఏడాది నుంచి కేవలం 389 ఆపరేషన్‌లు 

మందకొడిగా సంతాన నిరోధక చర్యలు 

కోతులను పట్టుకునేందుకు సహకరించని పంచాయతీలు, మున్సిపాలిటీలు 

పునరావాస, సంరక్షణ కేంద్రం పనితీరుపై ప్రభావం 

కోతుల ఆగడాలను తట్టుకోలేకపోతున్న జనం 

నిర్మల్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి)  : రోజురోజుకూ పెరిగిపోతున్న వానరాల సంతతి సాధారణ జనజీవనంపై తీవ్రప్రభావం చూ పుతోంది. గత కొంతకాలం నుంచి అడవులను వదిలేసి ఆవాస ప్రాంతా ల్లోకి కోతులు చొచ్చుకు వస్తున్న కారణంగా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణ ప్రజల జనజీవనంపైనే కాకుండా పంటపొలాలపై కూడా కోతుల ఆగడాలు తీవ్రనష్టాలకు గురిచేస్తోంది. రోజురోజుకూ కోతుల సంతతి ఇష్టారాజ్యంగా పెరిగిపోతుండడంతో వాటిని అరికట్టడం కష్టతరమవుతోంది. పల్లెలతో పాటు పట్టణాల్లోని గల్లీలను సైతం కోతులు చుట్టుముట్టి భీభత్సం సృష్టిస్తున్నాయి. కోతులదాడుల్లో పంట చేనులన్నీ నష్టాల పాలవుతుండగా, జనంసైతం గాయాలపాలవుతున్నారు. అయితే కోతుల సంతానాన్ని నిరోధించేందుకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాకేంద్రంలోని కోతుల పునరావాస సంరక్షణ కేంద్రాన్ని రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇక్కడి కోతుల పునరావాస కేంద్రం దేశంలోనే రెండోది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అయితే ఇక్కడి కోతుల పునరావాస కేంద్రంలో ప్రత్యేకవైద్యుడిని, సిబ్బందిని సైతం నియమించారు. అయినప్పటికీ ఆశించిన మేర కోతుల సంతాన నిరోధక ఆపరేషన్‌లు జరగకపోవడం చర్చకు తావిస్తోంది. ఈ పునరావాస కేంద్రంలో కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్‌లతో పాటు కొద్దిరోజుల పాటు పునరావాసం కల్పించి అనంతరం వాటిని అడవుల్లో వదిలిపెట్టాల్సి ఉంటుంది. జిల్లాకేంద్రంలోని గండిరామన్న సమీపంలో గల హరితవనం ఆవరణలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. గత సంవత్సరం అక్టోబరులో ఈ కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించగా ఇప్పటి వరకు ఇందులో జిల్లాకు సంబందించిన కేవలం 389 కోతులకు మాత్రమే సంతాన నిరోధక ఆపరేషన్‌లను జరిపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, తదితర జిల్లాల నుంచి మాత్రం మరో 350కి పైగా కోతులను ఇక్కడికి తీసుకువచ్చి సంతాన నిరోధక ఆపరేషన్‌లు నిర్వహించారు. ఇక్కడి పునరావాస కేంద్రంలో కేవలం కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్‌లు మాత్రమే చేస్తుండగా కోతులను పట్టి ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత మాత్రం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకే అప్పజెప్పారు. కాగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు తమ పరిధిలో కోతులు భీభత్సకాండ సృష్టిస్తున్నప్పటికీ స్పందించకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు తమ ప్రాంతాల్లో సంచరిస్తు ఆగడాలు సృష్టిస్తున్న కోతులను పట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతుండడం పట్ల ఆయా గ్రా మాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతులను పట్టుకునేందుకు ప్రత్యేకసిబ్బంది అవసరం ఉంటుందని అలాగే ప్రత్యేకవాహనంతో పాటు ఖర్చు కూడా అధికమవుతున్న కారణంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు ముందుకు రావడం లేదంటున్నారు. అయితే దేశంలోనే రెండోదిగా రాష్ట్రంలో  ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కోతుల పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవడంలో స్థానిక పాలకులు విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదికాలం నుంచి కేవలం 389 కోతులకు మాత్రమే సంతాన నిరోధక ఆపరేషన్‌లు చేశారంటే ఈ విషయం లో ఎంతటినిర్లక్ష్యం కొనసాగుతుందోనన్న అంశం తేటతెల్లమవుతోంది. 

ఏడాదిలో కేవలం 389 మాత్రమే

జిల్లాకేంద్రంలో నిర్మించిన కోతుల పునరావాస సంరక్షణకేంద్రంలో ఇప్పటి వరకు 389 సంతాననిరోధక ఆపరేషన్‌లు మాత్రమే జరిగాయి. ఇందులో నుంచి 260 మగకోతులు, 129 ఆడకోతులు కావడం గమనార్హం. మొత్తం 729 కోతులకు ఆపరేషన్‌లు జరిగినప్పటికీ ఇందులో నుంచి జిల్లాకు చెందిన 389 కోతులు పోను, మిగతా కోతులన్నీ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్‌ నుంచి కోతుల సంతాన నిరోధక ఆపరేషన్‌ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే సంబంధిత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు స్పందించ తమ ప్రాంతాల్లోని కోతులను పట్టుకొని ఇక్కడి కేంద్రంలో అప్పజెప్పకపోతుండడం సమస్యగా మారింది. కోతులను పట్టుకొని పునరావాస కేంద్రానికి అప్పజెప్పాల్సిన బాధ్యతను ప్రభుత్వం స్థానికసంస్థలకు అప్పజెప్పింది. కోతులను పట్టుకోవడంలో అనుభవం ఉన్న వ్యక్తుల కోసం అయ్యే ఖర్చును అలాగే వాటిని పునరావాస కేంద్రానికి తరలించేందుకు అయ్యే వ్యయాన్ని కూడా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలే భరించాలన్న నిబంధన ఉంది. దీంతో నిధుల కొరతతో పాటు వానరాలను పట్టుకునే ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తులు అందుబాటులో లేకపోతున్న కారణంగా స్థానికసంస్థలు ఈ అంశానికి ప్రా ధాన్యతనివ్వడం లేదంటున్నారు. 

దేశంలోనే రెండోది

కాగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన కోతుల పునరావాస సంరక్షణ కేంద్రం దేశంలోనే రెండోది , రాష్ట్రంలోనే మొదటిది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 2020 అక్టోబరు నెలలో దాదాపు రూ. 2 కోట్లను వ్యయం చేసి ఇక్కడి గండిరామన్న హరితవనం ఆవరణలో నిర్మించారు. కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్‌లు చేసేందుకు ప్రత్యేకవైద్యుడు, సిబ్బందిని సైతం నియమించారు. వీరికి ప్రత్యేకశిక్షణను కూడా ఇచ్చారు. అయితే ప్రతీరోజూ వీరు వానరాలకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ చేసేందుకు సిద్దం గా ఉంటున్నప్పటికీ ఈ కేంద్రానికి ఆశించిన మేరకు కోతులను తరలించలేకపోతున్నారు. దీంతో భారీవ్యయంతో నిర్మించిన ఈ కేంద్రం పనితీరు పై కూడా ప్రభావం పడుతోందంటున్నారు. 

కోతుల భీభత్సానికి కట్టడి కరువు

కోతుల భీభత్సం హద్దులు దాటిపోతోంది. జన సంచారంతో కోతులు పోటీ పడుతూ తమ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా చేసుకుంటు న్నాయి. వీధుల్లో పిల్లలు, మహిళలు కోతుల కారణంగా స్వేచ్చగా తిరగలేని పరిస్థితి నెలకొంటోందంటున్నారు. చేతిలో కర్ర ఉంటే గాని గడప దాటలేని దయనీయస్థితి ఇక్కడి అన్ని కాలనీల్లో, గ్రామ పంచాయతీల్లో ప్రతినిత్యం కనిపిస్తుంటోంది. ఇప్పటికే చాలా మందిపై కోతులు దాడులు జరిపి గాయపర్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటు జనాలను తీవ్ర అవస్థల పాలు చేస్తున్న వానరాలు దీనికి పోటీగా పంట చేనులను సైతం నాశనం చేస్తున్నాయి. కోతులదాడుల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు, రాత్రి వేళల్లో కోతుల నుంచి పంటలను రక్షించేందుకు వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. ఇలా వానర మూకలు జనాన్ని తీవ్ర అతలాకుతలం చేస్తున్నప్పటికీ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఈ దిశగా సీరియస్‌గా దృష్టి సారించకపోతుండడం ప్రధానసమస్యగా మారిందంటున్నారు. 

Updated Date - 2021-12-04T06:57:20+05:30 IST