ఇదేం గ‘లీజు’

ABN , First Publish Date - 2021-08-11T06:49:59+05:30 IST

కాకినాడ నగరం నడిబొడ్డున దేవాలయం వీధిలో..

ఇదేం గ‘లీజు’

కాకినాడలో రూ.7.50 కోట్ల దేవదాయశాఖ భూమిపై అధికార పార్టీ నేత కన్ను

లీజు ముసుగులో ఎలాగైనా భూమి స్వాధీనం చేసుకునేందుకు ఎత్తుగడ

నగరం నడిబొడ్డున ఉండడంతో అందులో వ్యాపారం చేసేందుకు ప్లాన్‌

వెయ్యి చదరపు గజాల భూమి 11 ఏళ్ల లీజుకు ఇవ్వడానికి ఇప్పటికే టెండర్లు

తీరా వేలంపాటకు ఎవరూ రాకుండా అడుగడుగునా బెదిరింపులు

చేసేదిలేక లీజు కేటాయింపు వాయిదా వేసిన దేవదాయశాఖ

ఎవరూ రాలేదనే సాకుతో ఇప్పుడు ఆ భూమి కొట్టేసేందుకు చకచకా పావులు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): అది కాకినాడలో దేవదాయశాఖకు చెందిన వెయ్యి చదరపు గజాల భూమి. మార్కెట్‌ విలువ రూ.7.50 కోట్ల పైనే. నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని 11ఏళ్లకు లీజుపై ఎవరికైనా కట్టబెట్టాలని అధికారులు టెండర్లు పిలిచారు. వేలంపాటదారుల మధ్య పోటీ పెరిగి ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశించారు. కానీ కోట్ల విలువైన ఈ భూమిపై కన్నేసిన స్థానిక వైసీపీ కీలకనేత అనుచరుడు ఆ లీజు తానే కారుచౌకగా దక్కించుకుని వ్యాపారం చేసేందుకు పథకం పన్నాడు. ముందు ఏదోలా లీజుకు దక్కించుకుని ఆ తర్వాత ఏకంగా వశం చేసుకునేందుకు వ్యూహం రచించాడు. అందుకోసం దేవదాయశాఖ నిర్వహించిన వేలంపాటకు వచ్చిన లీజుదారులను తన అధికార బలంతో బెదిరించాడు. పాటలో ఎవరూ పాల్గొనకుండా అడ్డుకుని వేలం వాయిదా పడేలా చేశాడు. అయితే వేలానికి ఎవరూ రావడం లేదనే సాకుతో ఇప్పుడు అధికారబలం ఉపయోగించి భూమి కొట్టేసేందుకు చక్రం తిప్పుతున్నాడు.


కాకినాడ నగరం నడిబొడ్డున దేవాలయం వీధిలో సర్వే నెంబరు 77/72లో వెయ్యి చదరపు గజాల స్థలం ఉంది. భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన ఈ భూమి దేవదాయశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ రూ.7.50 కోట్లపైనే. కొన్నేళ్ల కిందట ఓ సామిల్లుకు వేలం ద్వారా ఈ భూమిని లీజుకు కేటాయించారు. కానీ సామిల్లు నిర్వాహకులు లీజు డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడంతో కోర్టు ద్వారా అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి కొత్తగా వేలంపాట నిర్వహించడానికి గతనెల 16న దేవదాయ శాఖ టెండర్లు పిలిచింది. 11 ఏళ్ల లీజు ప్రాతిపదికపై బహిరంగ వేలం నిర్వహించడానికి లీజుదారులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీచేసింది. లీజు దక్కించుకున్న పాటదారుడు పాడిన మొత్తంపై ఏటా పది శాతం పెంచుతూ అంగీకారం తెలపాలని షరతు విధించింది. ఈనెల 10న పాట ఖరారైన తర్వాత నెలనెల అద్దె చెల్లించాలని, అందులో తాత్కాలిక షెడ్లు మాత్రమే నిర్మించడానికి అనుమతి ఉందని పేర్కొంది.


ఈనేపథ్యంలో మంగళవారం కాకినాడ దేవాలయం వీధిలోని భీమేశ్వరస్వామి ఆలయం వెనుక పాట నిర్వహించారు. అనేకమంది పాటదారులు ఖాళీ చెక్‌లతో క్యూ కట్టారు. నగరం నడిబొడ్డున ఉన్న భూమి కావడంతో వ్యాపారం చేయడానికి అనువుగా ఉంటుందనే కారణమే ఇందుకు కారణం. అయితే ఈ భూమిపై ఎప్పటినుంచో కాకినాడ వైసీపీ కీలక నేత అనుచరుడు కన్నేశాడు. పైగా ఈయన వ్యాపారి కూడా కావడంతో ఆ భూమిని దక్కించుకుంటే లాభసాటిగా ఉంటుందని గతంలో ప్రణాళిక రచించాడు. ఒకసారి ఇందులో పాగావేస్తే ఆ తర్వాత అధికారం అడ్డంపెట్టుకుని వశం చేసుకోవచ్చని భావించాడు. ఇందుకు సదరు కీలకనేత కూడా సహకరించడానికి సిద్ధంగా ఉండడంతో బెదిరింపుల అస్త్రం బయటకు తీశారు. ఒకవేళ తాను వేలంలో పాల్గొన్నా లీజు దక్కే అవకాశం ఉండకపోవచ్చనే కారణంతో ఏకంగా మంగళవారం జరిగిన టెండర్‌ కం బహిరంగ వేలం జరగకుండా స్కెచ్‌ వేశాడు.


ఇందుకోసం ఆయనే నేరుగా వేలం ప్రదేశం వద్దకు వచ్చాడు. ఆయనతోపాటు ఇతర వైసీపీ నేతలు అక్కడ మోహరించారు. వీరంతా కలిసి పాటదారులు లోపలకు రాకుండా అడ్డుకున్నారు. వేలం జర గడం లేదని, ఒకవేళ లీజు దక్కించుకున్నా నష్టపోతారు.. అనేక ఇబ్బం దులు తలెత్తుతాయంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. తమ చేతిలో అధికారం ఉందని, ఎవరికి లీజు దక్కినా తిరిగి తమకే ఇవ్వా లంటూ బెదిరింపులకు దిగారు. దీంతో సదరు పాటదారులు బెంబేలెత్తిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు సైతం సదరు పాటదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీచేశారు. దీంతో చేసేదిలేక వారంతా వెళ్లిపోయారు. ఆ తర్వాత సదరు నేత ఒత్తిడి మేరకు వేలంపాటకు స్పందన లేదనే సాకుతో వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వ్యూహం ప్రకారమే వేలం వాయిదా పడడంతో సదరు నేత ఇప్పుడు పావులు కదపడం ప్రారంభించాడు. కీలక నేత సాయంతో అధికారులపై ఒత్తిడితెచ్చి మరోసారి వేలం జరగకుండా చేసి నామినేషన్‌ పద్ధతిపై తనకే ఆ భూమి కట్టబెట్టేలా చక్రం తిప్పుతున్నాడు. అది కూడా అతి తక్కువ లీజు మొత్తం తో భూమిని కొట్టేయాలని చూస్తున్నాడు.


ఒకవేళ అదీ జరగకపోతే ఆ భూమిలో తాను శివాలయం కడతానని, అనుమతి ఇవ్వాలంటూ అధికారులకు మరో ప్రతిపాదన పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ అదే జరిగితే శివాలయం నిర్మించి ఆ సాకుతో ప్రధాన రహదారిని ఆనుకున్న ఉన్న మిగిలిన భూమిలో శాశ్వతంగా పాగావేసి వ్యాపారం చేయాలనేది సదరు నేత అసలు వ్యూహంగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ భూమికి ముందు భాగంలో ఇప్పటికే భీమేశ్వరస్వామి ఆలయం ఉంది. అలాంటప్పుడు ఒక శివాలయం ఉండగా, మరో శివాలయం నిర్మించడమేంటో. అయితే ఏదోలా రూ.7.50 కోట్ల భూమిని కొట్టేయడానికి సదరు నేత ఇప్పుడు రకరకాల వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Updated Date - 2021-08-11T06:49:59+05:30 IST