యుద్ధ చట్టంలోని యుద్ధ నియమాలు, నిబంధనలు గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-03-03T15:51:04+05:30 IST

రష్యా- ఉక్రెయిన్ మధ్య వారం రోజులుగా..

యుద్ధ చట్టంలోని యుద్ధ నియమాలు, నిబంధనలు గురించి మీకు తెలుసా?

రష్యా- ఉక్రెయిన్ మధ్య వారం రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా ఆగకుండా ఉక్రెయిన్‌పై దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ కూడా రష్యాకు తగిన సమాధానం ఇస్తోందనే సమాచారం వినిపిస్తోంది. ఈ యుద్ధ నేపధ్యంలో ఇరు దేశాలు చాలా నష్టపోయాయి. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ.. అంతర్జాతీయ స్థాయిలో చర్చల ద్వారా రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలోనూ రష్యా నిరంతరం దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు ఉక్రెయిన్‌లో పెను విధ్వంసాన్ని సృష్టించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రష్యాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా దాడులను తీవ్రవాదంతో పోల్చారు. దీనిని ‘‘యుద్ధ నేరం’’గా పేర్కొన్నారు. రష్యాను ఎప్పటికీ క్షమించబోమని, ఎవరూ దీనిని మరచిపోలేరని అన్నారు. 


యుద్ధంలో సామాన్యులను కూడా హతమారుస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఈ నేపధ్యంలో యుద్ధం చేసేందుకు నియమాలు ఏమైనా ఉంటాయా? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జెనీవాలో ఒక సమావేశం జరిగింది. దీనిలో యుద్ధానికి సంబంధించిన నియమాలు రూపొందించారు. 1939 నుండి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో 5 కోట్లకు పైగా ప్రజలు మరణించారు. ఈ యుద్ధంలో తొలిసారిగా అణు బాంబును కూడా ఉపయోగించారు. ఈ విధ్వంసం ఎంతగా ఉందంటే.. ప్రపంచంలోని అనేక దేశాల అధినేతలు 1949లో స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో సమావేశమయ్యారు. దీనినే జెనీవా కన్వెన్షన్ అని అంటారు. ఆ సమయంలోనే యుద్ధ నియమాలను రూపొందించారు. ఈ నియమాలలో యుద్ధం ఎలా జరగాలి? యుద్ధంలో ఎవరు దాడి చేయవచ్చు? ఎవరు చేయకూడదు? యుద్ధంలో ఆయుధాలు ఎలా ఉపయోగించాలి? వేటిని లక్ష్యంగా చేసుకోవాలి... ఇలా అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 


ఈ యుద్ధ నియమాలను ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా లేదా లా ఆఫ్ వార్ అని పిలుస్తారు. దీనిలో 161 నియమాలు రూపొంచారు. వీటిని 196 దేశాలు గుర్తించాయి. ఈ దేశాలన్నీ యుద్ధ సమయంలో ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. యుద్ధ సమయంలో లా ఆఫ్ వార్ ఎప్పుడు అమలు చేయాలో కూడా అందులో పేర్కొన్నారు. లా ఆఫ్ వార్‌లోని నిబంధనల ప్రకారం, ఒక దేశంలో పోరాటం జరుగుతుంటే ఈ నిబంధనలు వర్తించవు. రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఈ సందర్భంలో ఆయుధాలను ఉపయోగిస్తున్నప్పుడు ఈ నియమాలు వర్తిస్తాయి. యుద్ధ సమయంలో పౌరులను లక్ష్యంగా చేసుకోకూడదని యుద్ధ చట్టంలో స్పష్టంగా తెలిపారు. పౌరులతో పాటు, ఆరోగ్య కార్యకర్తలు, జర్నలిస్టులను యుద్ధంలో లక్ష్యంగా చేసుకోకూడదు. నివాస ప్రాంతాలు, భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, సాధారణ గృహాలను లక్ష్యంగా చేసుకో కూడదు. అలాగే చారిత్రక, మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వంపై కూడా దాడి చేయకూడదు. అదే అలాగే యుద్ధ సమయంలో సాధారణ పౌరుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లపై కూడా దాడి చేయకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించడం యుద్ధ నేరంగా పరిగణిస్తారు. అలాగే ఏ దేశం నుంచి అయినా దాడికి దిగే ముందు హెచ్చరికలను తప్పనిసరిగా జారీ చేయాలి. హెచ్చరిక లేకుండా ఏ దేశం మరో దేశంపై యుద్ధం ప్రారంభించకూడదు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి అక్కడి పౌరులను తరలించే బాధ్యత కూడా ఆ దేశంపైనే ఉంది. యుద్ధ సమయంలో సైనిక లక్ష్యాలను టార్గెట్‌గా చేసుకోవచ్చు. యుద్ధ సమయంలో శత్రుదేశపు సైన్యం లొంగిపోతుంటే మానవత్వంతో వ్యవహరించాలి. యుద్ధ ఖైదీలుగా ఉన్న సైనికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలన్నారు. ఏ దేశమైనా యుద్ధ సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే, దానిని యుద్ధ నేరంగా పరిగణిస్తారు. యుద్ధ చట్టంలోని 44వ అధ్యాయం ప్రకారం, నిబంధనలను ఉల్లంఘించిన దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. 

Updated Date - 2022-03-03T15:51:04+05:30 IST