ఇకపై విదేశాలకు వెళ్లేవారికి ఈ-పాస్‌పోర్టులు.. అయితే ఈ 4 రకాల పాస్‌పోర్టుల గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-02-03T14:07:22+05:30 IST

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి..

ఇకపై విదేశాలకు వెళ్లేవారికి ఈ-పాస్‌పోర్టులు.. అయితే ఈ 4 రకాల పాస్‌పోర్టుల గురించి మీకు తెలుసా?

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ-పాస్‌పోర్ట్‌ గురించి ప్రకటించారు. విదేశీ ప్రయాణాలకు ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తామని తెలిపారు. ఈ-పాస్‌పోర్టులో చిప్ ఉంటుంది. దీని సహాయంతో ప్రయాణం సులభతరం అవుతుంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర రద్దీ తగ్గుతుంది. అయితే బడ్జెట్‌కు ముందునుంచే ఈ-పాస్‌పోర్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎలక్ట్రానిక్ చిప్‌ని కలిగి ఉండే సాధారణ పాస్‌పోర్ట్ లాగా ఉంటుంది. దీనిలోని చిప్‌లో ప్రయాణీకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉదాహరణకు.. పుట్టిన తేదీ, చిరునామా మొదలైనవి దానిలో ఉంటాయి. ఈ చిప్ కారణంగా ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గడంతోపాటు తక్కువ సమయంలోనే వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఇదిలాఉంటే దేశంలో జారీ అయ్యే 4 రకాల పాస్‌పోర్టుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


సాధారణ పాస్‌పోర్ట్ (Ordinary Passport)

పాస్‌పోర్ట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. సాధారణ పాస్‌పోర్ట్ 36 నుండి 60 పేజీల వరకు ఉంటుంది. ఇది నీలి రంగులో ఉంటుంది. ఇది పెద్దల కోసం జారీ చేస్తారు. దీని చెల్లుబాటు 10 సంవత్సరాల వరకు ఉంటుంది. మైనర్లకు దీని చెల్లుబాటు 5 సంవత్సరాలు. 18 ఏళ్ల దాటినవారికి 10 సంవత్సరాల చెల్లుబాటుతో ఈ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. 

దౌత్య పాస్‌పోర్ట్ (Diplomatic Passport)

దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌లు నిర్దిష్ట అధీకృత వ్యక్తులకు మాత్రమే భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ఇది కాన్సులేట్‌లు లేదా దౌత్యవేత్తలకు ఇస్తారు. దీని రంగు మెరూన్. సీఎన్బీసీ తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తికి దౌత్యపరమైన పాస్‌పోర్ట్ జారీ అయితే, దానిని అతని కుటుంబీకులకు కూడా జారీ చేయవచ్చు. ఇమ్మిగ్రేషన్‌పై వెళ్లే సాధారణ ప్రయాణీకుల మాదిరిగా వారు వరుసలో ఉండాల్సిన అవసరం లేదు. 

అధికారిక పాస్‌పోర్ట్ (Official Passport)

దీనిని ప్రభుత్వ ఉద్యోగుల కోసం జారీ చేస్తారు. దీనిని సర్వీస్ పాస్‌పోర్ట్ అని కూడా అంటారు. ప్రభుత్వ ఉద్యోగిని.. ప్రభుత్వం ఏదైనా పని నిమిత్తం విదేశాలకు పంపినప్పుడు దీనిని జారీ చేస్తారు. 


తాత్కాలిక  పాస్‌పోర్ట్ (Temporary  Passport)

సాధారణ పాస్‌పోర్ట్ కోల్పోయినట్లయితే, తాత్కాలిక పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. ప్రయాణీకులు తమ దేశానికి తిరిగి వచ్చే వరకు ఈ పాస్‌పోర్ట్‌ను ఉపయోగిస్తారు.

ఈ-పాస్‌పోర్ట్‌తో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ప్రయాణం కోసం ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌లో ఈ-పాస్‌పోర్ట్ సాయంతో స్కానింగ్ చేస్తారు. ఫలితంగా క్యూ లైన్ల సమస్య నుంచి బయటపడతారు. కౌంటర్‌లో త్వరగా వెరిఫికేషన్ చేయడం వల్ల ప్రయాణీకుల సమయం ఆదా అవుతుంది. నకిలీ పాస్‌పోర్టును గుర్తించగలుగుతారు. దీంతో మోసగాళ్లు నకిలీ పాస్‌పోర్ట్‌లను వినియోగంచలేరు. ఇ-పాస్‌పోర్ట్ జారీ చేసేటప్పుడు.. మీరు అనేక రకాల పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఏఏ దేశాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి?

ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. ఈ విధానం1998లో మలేషియాలో ప్రారంభమైంది. ఆ తరువాత అమెరికా, బ్రిటన్, జపాన్ జర్మనీతో సహా అనేక దేశాలలో ఇటువంటి పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి. ఈ ఏడాది నుంచి భారతదేశంలో సామాన్యులకు ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ కానున్నాయి. 



Updated Date - 2022-02-03T14:07:22+05:30 IST