రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే..

ABN , First Publish Date - 2022-05-25T05:59:17+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా చంద్రబాబునాయుడు అవుతారని పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు పేర్కొన్నారు.

రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే..
నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న కోరాడ రాజబాబు

టీడీపీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు

భీమునిపట్నం, మే 24: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా స్పష్టంగా తెలుస్తోం దని.. అందువల్ల వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎంగా చంద్రబాబునాయుడు అవుతారని పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు పేర్కొన్నారు. మంగళవారం చిన్నబజారులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో మహానాడుకు తరలివెళ్లడంపై సమావేశాన్ని నిర్వహించారారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించామని, వీటన్నింటిపై సమగ్ర నివేదికను రూపొందించి జిల్లా కమిటీ ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేస్తామన్నారు. ‘దేశం’ ఆవిర్భావం నుంచి వ్యవస్థాపక అధ్యక్షులునందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడును పండుగలా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈసారి ఒంగోలులో జరిగే మహానాడుకు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కష్టించి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవారికి తప్పకుండా ప్రాధాన్యం వుంటుందన్న విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ జీవీఎంసీ భీమిలి జోన్‌లో ప్రతీ వేసవిలోనూ నీటి ఎద్దడి సమస్య తలెత్తుతుందని, గోదావరి జలాలను ఇక్కడకు మళ్లించినప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సముద్ర తీర ప్రాంత మత్స్యకార గ్రామాలకు రక్షణగా రిటర్నింగ్‌ వాల్‌ నిర్మించాల్సిన ఆవశ్యకతం ఉందన్నారు. పద్మనాభం మాజీ జడ్పీటీసీ కె.దామోదరరావు మాట్లాడుతూ పద్మనాభంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదో వార్డు టీడీపీ నాయకుడు మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి సొంత భవనం లేనందున సొంతంగా నిర్మించుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఒకటో వార్డు నాయకుడు పిట్టా సురేశ్‌ మాట్లాడుతూ జూట్‌ మిల్లు మూతపడినందున నిరుద్యోగులకు ఉపాధినందించే పరిశ్రమలను స్థాపించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ మొల్లి హేమలత, నాయకులు పాసి త్రినాథకుమార్‌, వానపల్లి సత్య, చోడిపల్లి సాయి, వాండ్రాసి అప్పలరాజు, దాసరి శ్రీనివాసరావు, గొల్లంగి ఆనందబాబు, కురిమిన లీలావతి, బి.రమాదేవి, జి.అరుణ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T05:59:17+05:30 IST