భాగ్యనగరం, వినాయక్‌ సాగర్‌ ఏమిటి?

ABN , First Publish Date - 2022-09-27T09:19:41+05:30 IST

హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగాను, హుస్సేన్‌సాగర్‌ పేరును వినాయక్‌ సాగర్‌గానూ మారుస్తామంటూ కొందరు మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్లను సమాజం క్షమించదు అని..

భాగ్యనగరం, వినాయక్‌ సాగర్‌ ఏమిటి?

  • కొందరివి మూర్ఖపు వ్యాఖ్యలు
  • కన్నడ రచయిత వీరభద్రప్ప ఆక్షేపణ 
  • తానా బహుమతి నవలలు ‘అర్ధనారి’, ‘మున్నీటిగీతలు’ ఆవిష్కరణ

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగాను, హుస్సేన్‌సాగర్‌ పేరును వినాయక్‌ సాగర్‌గానూ మారుస్తామంటూ కొందరు మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్లను సమాజం క్షమించదు అని.. అలాంటి మాటలను ప్రధాని మోదీ కూడా ఉపేక్షించరు అని ప్రముఖ కన్నడ రచయిత వీరభద్రప్ప అన్నారు. సత్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నవాళ్లను హత్యచేస్తున్నారని ఆరోపించారు. మత ఛాందసవాదుల నుంచి తాను చాలాసార్లు బెదిరింపులకు గురైనట్లు చెప్పారు. తానా బహుమతి పొందిన... బండి నారాయణస్వామి ‘అర్ధనారి’, చింతకింది శ్రీనివాసరావు ‘మున్నీటిగీతలు’ నవలల ఆవిష్కరణ సభ సోమవారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ‘అర్ధనారి’ నవలను ఆవిష్కరించిన వీరభద్రప్ప మాట్లాడుతూ రాయలసీమలోని అణగారిన వర్గాల జీవితాలను, చరిత్రను నవలీకరించడం ద్వారా, తెలుగు వచన సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అద్భుతమైన రచయిత బండి నారాయణస్వామి అని ప్రశంసించారు. 


తన కన్నతల్లి కన్నడ తల్లి అయితే, తిరుగుబాటు తత్వాన్ని నేర్పింది మాత్రం తెలుగు తల్లి అని వీరభద్రప్ప అన్నారు. ‘మున్నీటి గీతలు’ నవలను ఆవిష్కరించిన అనంతరం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ మాట్లాడుతూ భౌగోళిక అడ్డుగీతలను చెరిపే నవల ఇది అంటూ అభివర్ణించారు. మత్స్యకారుల జీవితాలు ఇతివృత్తంగా సాగే ఈ నవలను తాను వెబ్‌సిరీ్‌సగా తీస్తున్నట్లు చెప్పారు. ‘మున్నీటి గీతలు’ నవల చదివిన తర్వాత, రచయిత చింతకింది శ్రీనివాసరావును ‘హరిహరవీర మల్లు’ సినిమా రచనలోనూ తాను భాగస్వామ్యం చేసినట్లు క్రిష్‌ పేర్కొన్నారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ గతంలో చాలా నవలలు సినిమాలుగా వచ్చినప్పటికీ, సినిమా కొలమానాలు వేరు, సాహిత్య కొలమానాలు వేరు అన్నారు. సినిమా కొలమానాలు సాహిత్యంలోకి వస్తే మాత్రం ప్రమాదకరమేనని హెచ్చకరించారు. సినిమాకు సరిపోని కథలను, నవలలను ఆదరణలేనివాటిగా చూడటం సరికాదని హితవు పలికారు. కార్యక్రమంలో నవలల పోటీ న్యాయనిర్ణేత మధురాంతకం నరేంద్ర, కథాసాహితీ సంపాదకుడు వాసిరెడ్డి నవీన్‌, తానా ప్రతినిధి కొల్లా అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. నవలల విజేతలు బండి నారాయణ స్వామి, చింతకింది శ్రీనివాసరావు లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నిర్వాహకులు బహుమతి ప్రదానం చేశారు. 

Updated Date - 2022-09-27T09:19:41+05:30 IST