Opposition Unity: మమత, కేసీఆర్, స్టాలిన్, శరద్ పవార్ భేటీ వెనుక....!

ABN , First Publish Date - 2022-09-12T00:29:34+05:30 IST

ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా శరద్ పవార్‌కు మాత్రమే ఉందని

Opposition Unity: మమత, కేసీఆర్, స్టాలిన్, శరద్ పవార్ భేటీ వెనుక....!

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా శరద్ పవార్‌కు మాత్రమే ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆయనను కలవడానికి కారణం ఇదేనని వివరించింది. న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో ఆదివారం జరిగిన ఎనిమిదో జాతీయ సమావేశంలో తన విజన్‌ను వెల్లడించింది.


ఎన్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్, ఆ పార్టీ కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీసీ చాకో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, వాటన్నిటినీ ఏకతాటిపైకి తేగలిగే ఏకైక నాయకుడు శరద్ పవార్ అని చెప్పారు. 


శరద్ పవార్ వద్దకు కేసీఆర్, స్టాలిన్, మమత బెనర్జీ, సీతారాం ఏచూరి, ఓం ప్రకాశ్ చౌతాలా, కాంగ్రెస్ నేతలు వస్తుండటానికి కారణం మనందరినీ కలిపే వ్యక్తి ఒకరు వారికి కావాలి కాబట్టేనని ప్రఫుల్ పటేల్ చెప్పారు. మనకు ఓ దార్శనికతను ఇవ్వగలిగే వ్యక్తి అవసరం కాబట్టే వస్తున్నారని తెలిపారు. 


పీసీ చాకో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్వహించిన సమావేశంలో 21 రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒకే ఒకరి పేరును సూచించారని తెలిపారు. ఆ నేత శరద్ పవార్ అని తెలిపారు. ఒకే ఒకరు మాత్రమే ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయగలరని వారు నమ్మినందువల్లే ఆయన పేరును సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ, గత వైభవం తిరిగి రాదన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో గత నాలుగేళ్ళలో కనీసం ఒక పంచాయతీ ఎన్నికలోనైనా ఆ పార్టీ గెలవలేదన్నారు. అలాంటి పార్టీ దేశానికి ఎలా నాయకత్వం వహిస్తుందని ప్రశ్నించారు. 


శరద్ పవార్ మాట్లాడుతూ, ముఖ్యంగా ఏడు అంశాలపై దృష్టి సారించాలని తన పార్టీ నేతలను కోరారు. రైతు సమస్యలు, మత సామరస్యం దెబ్బతినడం, ద్రవ్యోల్బణం, మహిళల రక్షణ, నిరుద్యోగం, సరిహద్దులకు సంబంధించిన అంశాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై దృష్టి సారించాలని తెలిపారు. 


Updated Date - 2022-09-12T00:29:34+05:30 IST