ఆకుపచ్చని వేర్లను కలిగి ఉన్న మొక్క ఏది? పోటీ పరీక్షల ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-06-28T22:42:35+05:30 IST

పరిసరాలకు అనుగుణంగా నూతన విధులను నిర్వహించడానికి మొక్క శాఖీయ భాగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను ‘రూపాంతరాలు’ అంటారు.

ఆకుపచ్చని వేర్లను కలిగి ఉన్న మొక్క ఏది? పోటీ పరీక్షల ప్రత్యేకం!

వేరు రూపాంతరాలు

పరిసరాలకు అనుగుణంగా నూతన విధులను నిర్వహించడానికి మొక్క శాఖీయ  భాగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను ‘రూపాంతరాలు’ అంటారు.


  • నూతన విధులను నిర్వహించడానికి వేరులో జరిగే నిర్మాణాత్మక మార్పులను ‘వేరు రూపాంతరాలు’ అని అంటారు.

  • నిలువ చేసే వేర్లు, వృక్షోపజీవి వేర్లు, కిరణ్యజన్య సంయోగక్రియ జరిపే వేర్లు, పరాన్న జీవి వేర్లు, శ్వాస వేర్లు, ఊత వేర్లు, ఊడ వేర్లు, బొడిపె వేర్లు మొదలైనవి వేరు రూపాంతరాలు.

నిలువజేసే వేర్లు(దుంప వేర్లు): మొక్కలు సాధారణంగా ఎక్కువ ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. కాబట్టి ఆహారపదార్థాలను మొక్కలు వేర్వేరు భాగాలలో నిల్వచేసుకుంటాయి. కొన్ని మొక్కల్లో ఈ ఆహారం వేర్లలో నిలువ ఉంటుంది. ఇటువంటి వేర్లు ఉబ్బి ఒక నిర్ధిష్ట ఆకారాన్ని సంతరించుకుంటాయి. వీటినే ‘నిలువ చేసే వేర్లు’ లేదా ‘దుంప వేర్లు’ అని అంటారు.

ఉదాహరణ: క్యారట్‌, ముల్లంగి, బీట్‌రూట్‌, ఆస్పరాగస్‌

వృక్షోప జీవి వేర్లు: దట్టమైన వృక్షాలు గల ప్రాంతాలలో సూర్యరశ్మి భూమిని చేరకపోవడం వల్ల కొన్ని మొక్కలు ధృఢంగా, పొడవుగా వృద్ధి చెందే ఇతర మొక్కలపై పెరుగుతాయి. ఇటువంటి మొక్కలను ‘వృక్షోప జీవులు’ అంటారు.

  • వృక్షోపజీవుల్లో రెండు రకాల వేర్లు ఉంటాయి. అవి... అంటువేర్లు, వెలామెన్‌ వేర్లు
  • అంటువేర్లు చిన్నవిగా ఉండి అతిథేయి మొక్క బెరడ పగుళ్లలో ప్రవేశించి మొక్కను ఆధారానికి ధృడంగా అంటిపెట్టి ఉంచుతాయి. 
  • వెలామిన్‌ వేర్లు పొడవుగా, స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటాయి. ఈ వేర్లలో వెలామిన్‌ అనే ప్రత్యేకమైన కణజాలం ఉండటం వల్ల వీటిని ‘వెలామిన్‌’ వేర్లు అని పిలుస్తారు.
  • వెలామిన్‌ వేర్లు గాలిలో ఉండే తేమను, వర్షపు నీటిని గ్రహిస్తాయి.
  • ఉదాహరణ: వాండా

కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు: కొన్ని మొక్కల్లో కాండం, పత్రాలు పూర్తిగా క్షీణించి ఉంటాయి. ఇలాంటి మొక్కల్లో వేర్లు కిరణజన్య సంయోగక్రియను జరిపి ఆహారాన్ని తయారు చేస్తాయి. ఇటువంటి వేర్లు ఆకుపచ్చగా ఉంటాయి. 

ఉదాహరణ: టినియోఫిల్లం, ట్రాపా

శ్వాస వేర్లు: బురద నేలలో పెరిగే ఉప్పునీటి మొక్కలను ‘మాంగ్రూవ్స్‌’ అంటారు. బురద నేలలో నీరు నిలువ ఉండటం వల్ల ఆమ్లజని లభ్యం కాదు. కాబట్టి వేర్లు భూమ్యాకర్షణ దిశకు వ్యతిరేకంగా పెరిగి వాయుగతమవుతాయి. ఈ చివరిభాగంలో చిన్న, చిన్న రంధ్రాలుంటాయి. ఈ రం ధ్రాలను ‘వాయురంధ్రాలు’ అంటారు. వాయు రంధ్రాల ద్వారా భూమిలోపల ఉండే భాగాలలో వాయువుల ప్రసరణ జరుగుతుంది.

ఉదా: అవిసీనియ, రైజోఫోరా

ఊతవేర్లు: కాండం కింది కణుపుల నుంచి ఏర్పడి మొక్కకు అదనపు స్థిరత్వాన్నిచ్చే 

వేర్లను ‘ఊత వేర్లు’ అంటారు. భూమిలో ఆధారం సరిగా లేక బురద ప్రాంతంలో పెరిగే మొక్కలు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మొక్కల్లో అదనపు స్థిరత్వాన్ని ఇవ్వడం కొరకు ‘ఊతవేర్లు’ అభివృద్ధి చెందుతాయి.

ఉదాహరణ: మొక్కజొన్న, చెరుకు

ఊడవేర్లు: మర్రివంటి వృక్షాల్లో బరువైన శాఖలకు ప్రధాన కాండం ఇచ్చే యాంత్రిక బలం తక్కువగా ఉండటం వల్ల అవి సులభంగా విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి  కొన్ని శాఖల నుంచి అబ్బురపు వేర్లు ఉద్భవించి నిటారుగా కిందికి పెరిగి క్రమంగా భూగతమవుతాయి. క్రమంగా ఇవి బలపడి, స్థంభాల వలె తయారై శాఖలకు ఆధారాన్ని అందిస్తాయి. ఇటువంటి వేర్లను ‘ఊడవేర్లు’ అంటారు.

పరాన్న జీవి వేర్లు: పోషక పదార్థాల కోసం ఇతర మొక్కలపై సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ ఆధారపడే మొక్కలను ‘పరాన్న జీవి మొక్కలు’ అంటారు. పోషక పదార్థాలను పరాన్నజీవికి అందించే మొక్కను ‘అతిథేయి’ అంటారు.


పరాన్నజీవి మొక్కల్లో రూపాంతరం చెందిన వేర్లను ‘హాస్టోరియం’లు అంటారు. ఈ హాస్టోరియంలు లేదా పరాన్నజీవి వేర్లు అతిథేయి కాండంలోనికి గానీ, లేదా వేరులోనికి గానీ ప్రవేశించి నీరు, ఖనిజ లవణాలను గ్రహిస్తాయి.

ఉదాహరణ: కస్క్యూటా, స్ర్టైగా, విస్కమ్‌

బొడిపె వేర్లు: లెగ్యుమినెసి కుటుంబానికి చెందిన మొక్కల్లో వేర్లపై బుడిపెల వంటి నిర్మాణాలుంటాయి. ఈ బుడిపెలలో నత్రజనిని స్థాపించే రైజోబియం వంటి బ్యాక్టీరియా ఆవాసం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్న నత్రజనిని ఆమ్మోనియాగా మార్చి మొక్కకు అందజేస్తుంది. దానికి ప్రతిసహాయంగా మొక్క బ్యాక్టీరియాలకు ఆశ్రయం, ఆహారాన్ని అందజేస్తుంది. ఈ విధమైన పరస్పరం ఉపయోగకరంగా ఉండే సహవాసాన్ని ‘సహజీవనం’ అంటారు.


మాదిరి ప్రశ్నలు

1. చిలగడ దుంప అనేది ఒక?

ఎ) వేరు రూపాంతరం

బి) కాండ రూపాంతరం

సి) పత్ర రూపాంతరం డి) మొగ్గ

2. ఆకుపచ్చ వేర్లను కలిగిన మొక్క?

ఎ) ఆస్పరాగస్‌ బి) టీనియోఫిల్లం

సి) వాండా డి) విస్కం

3. కిందివాటిలో దుంప వేరు కానిది ఏది?

ఎ) క్యారట్‌ బి) బీట్‌రూట్‌ సి) అల్లం డి) చిలగడ దుంప

4. కింది ఏ మొక్కలో వేర్లు భూమ్యాకర్షణ దిశకు వ్యతిరేకంగా పెరుగుతాయి?

ఎ) ట్రాపా బి) రైజోఫోరా

సి) మొక్కజొన్న డి) ఏదీకాదు

5. కింది ఏ మొక్కలో ఎగబాకే వేర్లు ఉంటాయి?

ఎ) తమలపాకు బి) వాండా

సి) ట్రాపా డి) పైవన్నీ

6. కిందివాటిలో పరాన్న జీవి వేర్లను కలిగి ఉన్న మొక్క?

ఎ) విస్కం బి) టీనియోఫిల్లం

సి) ట్రాపా డి) పైవన్నీ

సమాధానాలు: 

1-ఎ;   2-బి;   3-సి;   4-బి;   5-ఎ;  6-ఎ


-ఆర్‌. సురేష్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2022-06-28T22:42:35+05:30 IST