పార్థివ వాహనమేదీ?

ABN , First Publish Date - 2022-01-22T04:08:51+05:30 IST

ఇటీవల కల్లూరుకు చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి చెందాడు.

పార్థివ వాహనమేదీ?
పార్థివ వాహనం(ఫైల్‌)

మూలనపడిన అంబులెన్స్‌ ఇబ్బందులు పడుతున్న 

మృతుల కుటుంబ సభ్యులు

ఖమ్మంకలెక్టరేట్‌, జనవరి21: ఇటీవల కల్లూరుకు చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావటంతో మృతదేహాన్ని తరలించడానికి జిల్లా ఆస్పత్రిలో పార్థివ దేహాన్ని తరలించే వాహనం కోసం సంప్రదించారు. వాహనం లేదనడంతో.. ప్రైవేటు అంబులెన్స్‌కు రూ.10వేలు ఖర్చుపెట్టి దేహాన్ని తరలించారు. అసలే డబ్బులు లేక ప్రభుత్వ వైద్యాన్ని చేపించుకున్న ఆ కుటుంబీకులు మృతదేహాన్ని తరలించడానికి వేలకువేలు ఖర్చు చేయాల్సి వచ్చింది.’’ ఇదేదో ఒక్క కుటుంబానికి చెందిన ఇబ్బంది కాదు.. ప్రభుత్వ ఆస్పత్రికి  నిరుపేదలు, బడుగులుబయట హాస్పటల్‌లో వైద్యానికి ఖర్చు చేయలేక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విధివశాత్తు మరణిస్తే వేలకువేలు పెట్టి పార్థివ దేహాలను తరలించుకోవాల్సి వస్తోందని. ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  మూలనపడిన అంబులెన్స్‌

 ఆరునెలలుగా జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న పార్థివ వాహనం తుక్కుగా మారి మూలనపడింది. దీంతో జిల్లా ఆస్పత్రిలో మృతి చెందిన వారి పార్థివ దేహాలను తరలించడానికి నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా ఆస్పత్రికి నలుమూలల నుంచి రోగులు, ప్రమాదాల్లో గాయపడిన వారిని తరలించి చికిత్సలు అందిస్తుంటారు. ఈ సందర్భంగా ఎవరైనా మృతి చెందితే మృతదేహాలను తరలించడానికి ప్రభుత్వం కేటాయించింది. ఇది  ఎందరికో ఉపయుక్తంగా ఉండేది. కానీ ఆరునెలలుగా పార్థివ వాహనం  సేవలు నిలిచిపోయాయి. జిల్లా ఆస్పత్రిలో ఉన్న వాహనం ఫిట్‌నెస్‌కు పంపించారు. అక్కడ ఆర్టీవో అధికారులు తుక్కుకింద మార్చినట్లు సమాచారం. దీంతో అంబులెన్స్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మృత దేహాలను తరలించడానికి   ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని చెబతున్నారు.

2017 నుంచి సేవలు

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తే ఆ మృత దేహాలను వారి స్వస్థలాలకు పంపించడానికి ఆర్థి కంగా ఇబ్బందులు పడుతున్నామని వారు చెబుతున్నారు. ఇలాంటి పేదల కోసం 2017లో జిల్లా ఆస్పత్రికి పార్థివ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి నిర్వహణను 108 సంస్థకు అప్పగించారు. తొలుత ఉమ్మడి జిల్లాకు రెండు వాహనాలు కేటాయించగా జిల్లా విభజన తర్వాత భద్రాద్రి జిల్లాకు ఒకటి, ఖమ్మం జిల్లాకు ఒకటి కేటాయించారు. వాహనంలో కనీసం రెండు మృతదేహాలను తీసుకెళ్లడానికి వీలుగా ఫ్రీజర్‌ బాక్సులు ఒక సహాయకుడు, అంబులెన్స్‌ డ్రైవర్‌ ఉండే వారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు శోకంతో ఉన్న నిరుపేదలకు స్వస్థలానికి మృత దేహాన్ని తరలించేందుకు ఈ వాహన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇలాంటి విశేష సేవలందించే వాహనం మూలన పడడంతో అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో మరింత అవసరం

కొవిడ్‌ మొదటి రెండు నేపథ్యంలో జిల్లాలో నెలకు కనీసం 70 నుంచి 80 మృతదేహాలను పార్థివ వాహనాలు తరలించాయి. అంతకు ముందు కనీసం నెలకు 50 వరకు మృతదేహాలను తరలించే వారు. ప్రస్తుతం మూడో వేవ్‌ నేపథ్యంలో ఆస్పత్రికి పార్థివ వాహనాన్ని కేటాయిస్తే ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో పనిచేసే సిబ్బంది హెల్పర్‌ను డ్రైవర్‌ను 108 కి డిప్యూట్‌ చేశారు.

 ప్రైవేటు అంబులెన్స్‌ల దందా 

జిల్లా ఆస్పత్రిలో పార్థివ దేహాన్ని తరలించే వాహనం లేకపోవడంతో  బయట ఉండే ప్రైవేటు ఆస్పత్రుల అంబులెన్స్‌ల యజమానులు మృతదేహాలను తరలిం చడానికి వారు చెప్పిందే రేటు.. అన్నట్లుందని వాపోతున్నారు. కనీస దూరాన్ని కూడా చూడకుండా రూ 7 వేల నుంచి రూ.10వేల  పైగానే గుంజుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స చేయించుకోవడమే కష్టంగా ఉండి తమ వారిని కోల్పోయిన బాధితులు మృతదేహాన్ని తరలించడానికి ఆర్థిక భారాన్ని మోయలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఆస్పత్రికి పార్థివ వాహనాన్ని కేటాయించాలని కోరుతున్నారు. 

మార్చినాటికి కొత్త వాహనం 

నజీరుద్దీన్‌, 108 వాహానాల మేనేజర్‌

ఖమ్మంలో ఉన్న పార్థివ వాహనం దాదాపు 6లక్షల కిలోమీటర్లు పైగానే తిరిగింది. దీంతో వాహానానికి ఆర్టీఏ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ఫలితంగా ప్రస్తుతానికి వాహనం అందుబాటులో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 40 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మార్చి నాటికి జిల్లాకు కొత్త పార్థివ వాహనం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నాం.

Updated Date - 2022-01-22T04:08:51+05:30 IST