మాస్టర్‌ప్లాన్‌ ఏమిటో!?

ABN , First Publish Date - 2021-06-24T05:20:39+05:30 IST

మారుమూల గ్రామంలో..

మాస్టర్‌ప్లాన్‌ ఏమిటో!?

వీఎంఆర్‌డీఏలో అంతా రహస్యం

నోరువిప్పని అధికారగణం

20 ఏళ్ల అభివృద్ధి ప్రణాళికపై కరవైన ప్రచారం 

సమావేశాలూ లేవు...సదస్సులూ లేవు

ప్రజలు అభిప్రాయాలు తెలియజేస్తే...పరిశీలిస్తారట!!


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామంలో ఏదైనా అభివృద్ధి పని చేపట్టాలంటే...స్థానిక నేతలు, అధికారులు కూర్చుని చర్చిస్తారు. ఆ విషయాన్ని గ్రామంలో దండోరా వేయిస్తారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా ముందుకువెళతారు. ఎక్కడైనా ఇదే ఆనవాయితీ. కానీ విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)లో మాత్రం అలాంటిదేమీ కనిపించడం లేదు. ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే అమరావతి వెళ్లి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. ప్రణాళికలు రూపొందించేస్తారు. ప్రజలకు మాత్రం వాటి వివరాలు ఏవీ వెల్లడించరు. ఇదీ గత రెండేళ్లుగా జరుగుతున్న తతంగం. ఇప్పుడు నాలుగు జిల్లాల్లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే అభివృద్ధికి సంబంధించిన ‘మాస్టర్‌ ప్లాన్‌’ను కూడా ఈ విధంగానే తయారుచేశారు. నాలుగు జిల్లాల్లో ప్రాధాన్య అంశాలు ఏమిటి?, ఏయే ప్రాంతాల్లో ఎటువంటి పనులు చేయబోతున్నారు?...అనే విషయాలు ప్రజా ప్రతినిధులతో చర్చించాలి. వారి సలహాలు తీసుకోవాలి. అవి ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలి. వారి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆ తరువాత సమగ్ర ప్రణాళికతో ముందుకువెళ్లాలి. ఈ క్రమంలో వీటికి సంబంధించిన అంశాలు ప్రజలకు చేరేందుకు పత్రికా విలేఖరులతో సమావేశాలు కూడా నిర్వహించాలి. కానీ, అధికారులు ఇవేవీ మాస్టర్‌ ప్లాన్‌ తయారీలో పాటించడం లేదు. 


వీఎంఆర్‌డీఏపై ప్రభుత్వం పెద్ద బాధ్యత పెట్టింది. పరిపాలనా రాజధాని కాబోతున్న ఈ మహా నగరాన్ని రాబోయే రెండు దశాబ్దాల్లో ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చునో సూచిస్తూ మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేయాల్సిందిగా ఆదేశించింది. గతంలో 2006లో పదిహేనేళ్లకు రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ 2021తో ముగిసింది. దాంతో కొత్త మాస్టర్‌ప్లాన్‌ అవసరమైంది. ఈ బాధ్యతలను కన్సల్టెన్సీలకు అప్పగించి ముసాయిదా తయారుచేయించారు. అమరావతి తీసుకువెళ్లి పెద్దలతో చర్చించారు. నాలుగు రోజుల క్రితం ఓ పత్రికలో మాత్రమే దాని వివరాలు ప్రచురించారు. అంతకు మించి దీనికి సంబంధించిన విషయాలు ఈ ప్రాంత ప్రజలకు తెలియనివ్వడం లేదు. దీనిని వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో పెట్టామని, దానిని చదివి సూచనలు, సలహాలు ఇస్తే...వాటిని పరిగణలోకి తీసుకుంటామని నాలుగు లైన్ల పత్రికా ప్రకటనలో అధికారులు సెలవిచ్చారు. 


ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవీ?

- వీఎంఆర్‌డీఏ నుంచి శ్రీకాకుళం జిల్లాను గతంలో మినహాయించారు. ఇప్పుడు ఆ జిల్లాను వదిలేసి, ప్రణాళిక రూపొందించారా?, కలిపి తయారుచేశారా?

- సంస్థ పరిధిలో ఎంత ప్రాంతం ఉంది? ఎన్ని జిల్లాలు? ఎన్ని మండలాలు?, ఎన్ని గ్రామాలు?

- ఏ ప్రాంతం ఏ విఽధంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు? అక్కడ ఏమి వస్తాయని అనుకుంటున్నారు?

- పరిపాలనా రాజధానిగా ప్రకటించిన దృష్టా ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు ఏమిటి?

- భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోంది. ఆ పరిసరాలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు?

- కాపులుప్పాడలో రాజధాని అంటున్నారు? ఆ ప్రాంతంలో ఏమి ప్రతిపాదించారు?

- ఐటీ డెస్టినేషన్‌గా విశాఖ అని ప్రకటిస్తున్నారు? వాటి కోసం ఏమి కేటాయించారు? 

- సాగరతీరం పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం. ఆ దిశగా ఏమి చేయబోతున్నారు?

- విస్తరిస్తున్న నగరానికి తగ్గట్టుగా కొత్తగా ఎన్ని రహదారులు వేయబోతున్నారు. ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ ఏమిటి?

- పెరుగుతున్న ట్రాఫిక్‌ను తట్టుకునేలా ఏమి చేయబోతున్నారు? 

- కాలుష్య నివారణకు చేయబోయేదేమిటి?


...ఇటువంటివి సవాలక్ష ఉన్నాయి. ఈ సమస్యలు, అవసరాలు ప్రస్తావించి, వాటిని ఏ విధంగా ఎదుర్కొనబోతున్నదీ ప్లాన్‌లో తెలియజేయాలి. ఒకవేళ అలా తయారుచేస్తే...ఆ వివరాలు ప్రజలకు తెలిసేలా వివరించి చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వెబ్‌సైట్‌లో పెట్టి, మీరు చూసి తెలుసుకోండి...అని చెబితే అయిపోయే పని కాదిది.  


తెలుగులోనే ఉండాలి

గతంలో 2006లో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినప్పుడు అంతా ఇంగ్లీష్‌లోనే వుందంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దాంతో తెలుగులో మాస్టర్‌ప్లాన్‌ వుండాలని, ప్రజలకు అర్థమయ్యే స్థానిక భాషలో అందుబాటులో వుంచాలని ఆదేశించింది. ఇప్పుడు వెబ్‌సైట్‌లో వున్నది ఇంగ్లీష్‌ వెర్షనే. అది ఒకంతట ఓపెన్‌ కావడం లేదు. 


కరోనా సాకు చెల్లుతుందా?

కరోనా కారణంగా సమావేశాలు పెట్టలేకపోయామని అధికారులు సాకులు చెప్పే అవకాశం ఉంది. ప్రభుత్వంలో అన్ని శాఖలు సమీక్ష సమావేశాలు బాగానే నిర్వహిస్తున్నాయి.  అందువల్ల ఒక్క వీఎంఆర్‌డీఏకే ఈ సమస్య అంటే నమ్మే అవకాశం లేదు. పైగా అంతా దూరంగా కూర్చొని సమావేశం నిర్వహించుకోవడానికి పెద్ద చిల్డ్రన్‌ ఎరీనా కూడా ఉంది.

Updated Date - 2021-06-24T05:20:39+05:30 IST