‘62 ఏళ్ల సర్వీసు’ మాకేదీ?

ABN , First Publish Date - 2022-07-04T08:10:56+05:30 IST

‘62 ఏళ్ల సర్వీసు’ మాకేదీ?

‘62 ఏళ్ల సర్వీసు’ మాకేదీ?

సహకార ఉద్యోగులకు అమలు కాని 

62ఏళ్ల రిటైర్మెంట్‌ ఉత్తర్వులు 

రిటైర్‌కానున్న 200మంది ఆవేదన

తాజాగా పదుల సంఖ్యలో రిటైర్మెంట్‌

అందరికీ వర్తింపజేసి.. తమకెందుకు లేదని నిలదీత

వయోపరిమితిపై సర్కారు పిల్లిమొగ్గలు

ఎందుకు చేయడంలేదో స్పష్టత కూడా ఇవ్వని వైనం

ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోర్టుకు కొందరు..


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ఓవైపు రిటైరయ్యే ఉద్యోగులకు వారి ప్రయోజనాలను చెల్లించే దిక్కులేదు. మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే సత్తా అసలే లేదు. దీంతో అటు నిరుద్యోగుల భవిష్యత్తును కాలరాస్తూనే.. ఇటు ఉద్యోగుల సర్వీసును 62 ఏళ్లకు పెంచి తాత్కాలికంగా గండం గట్టెక్కి ఊరట చెందింది రాష్ట్ర ప్రభుత్వం. పదవీ విరమణ పెంపుపై భిన్నాభిప్రాయాలు, అనేక విమర్శలు ఉన్నప్పటికీ జగన్‌ సర్కారుకు అంతకంటే గత్యంతరం లేదు. పోనీ, ఈ విధానం అందరికీ వర్తింపజేశారా అంటే..  సహకార బ్యాంకులు, సొసైటీ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపించింది. ఈ కారణంగా డీసీసీబీలు, డీసీఎంఎ్‌సలు, పీఏసీఎ్‌సల్లో పని చేస్తూ 60ఏళ్ల వయోపరిమితి పూర్తైన ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్ల పెంపుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయి ఆరు నెలలు గడిచినా తమకు అమలు చేయకపోవడంతో ఈ మూడు విభాగాల్లో అనేక మంది గురువారం ఉద్యోగ విరమణ చేయాల్పి వచ్చింది. అలాగే రానున్న నెలల్లోనూ 200మందికిపైగా ఉద్యోగ విరమణ చేయాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించిన 62ఏళ్ల వయో పరిమితి ఉత్తర్వులు సహకార బ్యాంకులు, సంఘాల ఉద్యోగులకు మాత్రం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పైగా ఎందుకు అమలు చేయడం లేదో కూడా స్పష్టతనివ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. 


ఉన్నతాధికారుల సహకారం లేకే?

62ఏళ్ల వయోపరిమితి జీవోను సహకారశాఖ విడుదల చేస్తేనే సదరు ఉత్తర్వులకు డీసీసీబీ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ పాలకవర్గాలు ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన వయో పరిమితి జీవోను ఆరు నెలలుగా సహకారశాఖ అమలు చేయలేదు. రాష్ట్రంలోని 13డీసీసీబీలు, 13డీసీఎంఎ్‌సలు, 2005పీఏసీఎ్‌సల్లో 4500 వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 60ఏళ్ల సర్వీస్‌ పూర్తిన చాలామందే ఉన్నారు. వయోపరిమితి పెంపుదల జీవో అమలు కాకపోతే ఈ ఒక్క ఏడాదే 2022-23లో 200 మందికి పైగా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. అయితే, సాంకేతిక కారణాలను చూపుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు  ఇప్పటికీ జీవో అమలును తాత్సారం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో రెండేళ్ల సర్వీస్‌ నష్టపోతున్న పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. 


ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

దీనిపై సహకారశాఖ ముఖ్యకార్యదర్శి మధుసూదన్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఈ అంశం ఆర్థికశాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. సహకార ఉద్యోగులకు 62ఏళ్ల వయో పరిమితిని అమలు చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.


ఖాళీ పోస్టుల భర్తీ ఏదీ?

మరోవైపు, డీసీసీబీల్లో ఖాళీ పోస్టులను 25ు పీఏసీఎస్‌ రెగ్యులర్‌ ఇన్‌సర్వీ్‌స ఉద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. గతేడాది కొన్ని డీసీసీబీల్లో ఖాళీ పోస్టులకు ఐబీపీఎస్‌ ద్వారా పరీక్ష నిర్వహించినా.. ఇన్‌సర్వీ్‌స ఉద్యోగులు ఉత్తర్ణత సాధించకపోవడంతో ఆ పోస్టులు ఇతర అభ్యర్థులతో భర్తీకి చేసే ప్రయత్నాలు జరగ్గా.. ఉద్యోగ సంఘాల అభ్యంతరంతో ప్రక్రియ నిలిచిపోయింది. సదరు పోస్టులకు అర్హత కలిగిన ఉద్యోగులను సీనియార్టీ లేదా.. శాఖపరమైన పరీక్షతో ఎంపిక చేయాలని పీఏసీఎస్‌ ఉద్యోగ సంఘం డిమాండ్‌ చేస్తోంది. కానీ అధికారులు దీనిపై శ్రద్ధ చూపడం లేదని ఉద్యోగ సంఘ నాయకులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-07-04T08:10:56+05:30 IST