ఇక విద్యుత్ కూడా విలాసమే!

ABN , First Publish Date - 2020-06-27T06:30:59+05:30 IST

2003 విద్యుత్ చట్టంలో వివిధ తరగతుల ప్రజలకు సబ్సిడీలివ్వడం, పి.పి.ఎ లను రద్దు చేయడం, విద్యుత్తు రేట్లను నిర్ణయించడం వంటి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త...

ఇక విద్యుత్ కూడా విలాసమే!

2003 విద్యుత్ చట్టంలో వివిధ తరగతుల ప్రజలకు సబ్సిడీలివ్వడం, పి.పి.ఎ లను రద్దు చేయడం, విద్యుత్తు రేట్లను నిర్ణయించడం వంటి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త  బిల్లులో ఇటువంటి వాటిని కూడా అపహరించేలా ప్రతిపాదనలు చేశారు. ఈ బిల్లు ఇలా ప్రజలపై భారాలు మోపడమేకాక, రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థపై కూడా దాడి చేస్తోంది. విద్యుత్ సంస్థల సిబ్బంది,కేంద్ర కార్మిక సంఘాలు దీనిపై ఇప్పటికే  ఉద్యమిస్తున్నాయి. అత్యవసరమైన విద్యుత్తును కూడా ఒక విలాసవంతమైన సరుకుగా మార్చే ఇటువంటి చట్ట సవరణను నిలువరించేలా పౌర సమాజం కదలాలి.


కేంద్రప్రభుత్వం విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనికి అనుగుణంగా విద్యుత్ చట్టం 2003లో అనేక సవరణలు చేయడానికి విద్యుత్ బిల్లు 2020ని రూపొందించింది. సులభతర వాణిజ్యం పేరుతో విద్యుత్ ఉత్పత్తిలోనే కాక, పంపిణీలో కూడా ప్రవేటు సంస్థలను పెంచేలా మార్పులు చేయడం ఈ బిల్లు ఉద్దేశ్యమని ఉపోద్ఘాతంలోనే పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే 2003 చట్టంలో 39 ప్రధాన సవరణలు, వందకు పైగా ఉపసవరణలతో ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. 

స్థూలంగా సబ్సిడీలు తీసివేయడం, ప్రజలకు జవాబుదారీకాని ఒక సంస్థకు సర్వాధికారాలు కట్టబెట్టడం, డిస్కంలను ముక్కలు చేసి సబ్ కాంట్రాక్టులకివ్వడం అనే మూడు ప్రధాన ప్రమాదాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.


2003 చట్టానికి, అంతకు ముందున్న అన్ని చట్టాలకు మౌలికంగా ఒక తేడా ఉంది. అదేమిటంటే అప్పటివరకూ విద్యుత్ ప్రజలకు చేరవేసే ఒక సౌకర్యంగా చూడబడింది. దీనికి భిన్నంగా 2003లో నాటి వాజపేయి ప్రభుత్వం చేసిన చట్టం విద్యుత్తును వ్యాపార సరుకుగా మార్చివేసింది. విద్యుత్తు రేట్లను నిర్ణయించడానికి ఒక రెగ్యులేటరీ కమిషన్‍ను ఏర్పాటు చేసింది. అప్పటివరకూ ఏకీకృతంగా ఉన్న విద్యుత్తు సంస్థను జెన్కో, ట్రాన్స్కో, డిస్కం (జనరేషన్ కార్పొరేషన్, ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) అనే మూడు ముక్కలుగా విడగొట్టి, విద్యుత్ ఉత్పత్తిలో ప్రవేటు రంగానికి పెద్ద పీట వేసింది. ఈ ప్రవేటు సంస్థల నుండి విద్యుత్తును కొనుక్కుని డిస్కం లు సరఫరా చేయడానికి చేసుకునే ఒప్పందాలకే పి.పి.ఎ. (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్) అని నామకరణం చేసింది. ఈ పి.పి.ఎ ల సారమేమిటంటే ప్రవేటు సంస్థల నుండి ఒప్పందం ప్రకారం తప్పకుండా విద్యుత్తును కొని తీరవలసిందే. అలా కొనకపోతే, ఆ సంస్థలకు మాత్రం ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించవలసిందే. దీనితో ప్రవేటు సంస్థలకు లాభాల పంట పండింది. అదే సమయంలో డిస్కంలు నష్టాల బాట పట్టాయి. దీనితో రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్తు రేట్లను దఫదఫాలుగా పెంచే ప్రక్రియను ప్రారంభించింది. 


అయినా 2003 విద్యుత్ చట్టంలో వివిధ తరగతుల ప్రజలకు సబ్సిడీలివ్వడం, పి.పి.ఎ లను రద్దు చేయడం, విద్యుత్తు రేట్లను నిర్ణయించడం వంటి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త 2020 బిల్లులో ఇటువంటి వాటిని కూడా అపహరించేలా ప్రతిపాదనలు చేశారు. అన్ని అంశాలూ కేంద్ర ప్రభుత్వం వద్ద కేంద్రీకరించబడేలా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎన్ఫోర్స్ మెంటు ఆధారటి (ఇ.సి.ఇ.ఎ.) అనే సంస్థను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికై 109 అనే ఒక చాప్టర్ జత చేశారు. ఈ ఆథారిటీకి సర్వాధికారాలు ఉంటాయి. వీరు నిర్ణయించిన రేట్లే దేశమంతా అమలవుతాయి. వీరిని నియమించే అధికారం, తొలగించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంటుంది. ఈ సంస్థకు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ఆధారంగా సివిల్ కోర్టుకుండే అధికారాలన్నీ ఉంటాయి. దీని నిర్ణయాన్ని సమీక్షించే అధికారం కేవలం అపలట్ ట్రిబ్యూనల్, తరువాత సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంటుంది.


మరో ప్రధాన సవరణ ఏమిటంటే, విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలను ముక్కలు చేసి కొన్ని స్వతంత్ర ప్రవేటు సంస్థలకు అప్పజెప్పడం, వారికి తిరిగి సబ్ కాంట్రాక్టు ఇచ్చే అధికారమివ్వడం. ఈ సంస్థలు విధిగా పి.పి.ఎ ల ద్వారా గాలి, నీరు, సూర్యరశ్మివంటి రెన్యువబుల్ శక్తితో ఉత్పత్తి చేయబడ్డ కరెంటును కొంత శాతం విధిగా కొనాలనే షరతు విధించింది. ఇలాంటి ప్రయోగాలు ఇప్పటికే బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలోని కొన్ని పట్టణాలలో ఘోరంగా విఫలం చెంది, ఆ ప్రవేటు సరఫరా సంస్థలను రద్దు కూడా చేశారు. అయినా మన పభుత్వానికి ఇదేమీ పట్టడం లేదు.


ఈ బిల్లులో మరో సవరణేమిటంటే వినియోగదారులు డిస్కంలకు పూర్తి బిల్లులను చెల్లించి, తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీని పొందాలని పేర్కొన్నారు. ఇప్పుడు గ్యాసుపై సబ్సిడీలాగా ప్రజలకు నగదు బదిలీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే చెల్లించవచ్చు. ఉదాహరణకు తెలంగాణాలో రైతుల వ్యవసాయానికి నెలకు సగటున నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు కరెంటు అవసరవవుతుంది. ఇప్పడు ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్న రైతులు ఆ డబ్బంతా ముందే కట్టి, ప్రభుత్వ సహాయానికై ఎదురుచూడాలి. రైతులు మొత్తం బిల్లు కట్టకపోతే, డిస్కంలు వెంటనే కనెక్షన్ కట్ చేసేస్తారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా ప్రిపైడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తారట. అంటే, ముందే డబ్బు కట్టి రీచార్జ్ చేసుకుంటేనే కరంటు సరఫరా చేస్తారు. ఆ డబ్బు అయిపోతే, సెల్‍ఫోన్ లాగానే దానంతటదే సరఫరా నిలిచిపోతుంది.


ఈ బిల్లు ఇలా ప్రజలపై భారాలు మోపడమేకాక, రాజ్యాంగ ఫెడరల్ వ్యవస్థపై కూడా దాడి చేస్తోంది. ఉదాహరణకు విద్యుత్తు మన రాజ్యాంగంలోని ఏడవ అధికరణ ప్రకారం ఉమ్మడి జాబితాలోనికి వస్తుంది. నేడు రాష్ట్రాలకున్న హక్కులు కూడా ఇ.సి.ఎన్.ఎ సంస్థ ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం హరించివేస్తోంది. మరో పక్క రాష్ట్రాలు కేంద్ర సహాయం పొందాలంటే తప్పక వీటిని అమలు చేయవలసిందేననే షరతు విధిస్తోంది. దీని అర్థమేమిటంటే, కేంద్రం ప్రజలకు సబ్సిడీలివ్వదు. రాష్ట్ర ప్రభుత్వాలివ్వడం కూడా ప్రోత్సహించదు. వెరసి ప్రజలపైనే మరిన్ని భారాలు పడతాయి. మరోపక్క ఫ్రేంచైజీల పేరుతో అక్రమ కాంట్రాక్టులు కేంద్ర స్వతంత్ర సంస్థ ద్వారా రుద్దబడతాయి. రాష్ట్రాలు ప్రేక్షక పాత్రకే పరిమితం కావలసి ఉంటుంది.


అదే సమయంలో ప్రవేటు సంస్థలకు మాత్రం మంచి లాభాలు సమకూర్చి పెట్టేలా బిల్లు తయారుచేయబడింది. ఉదాహరణకు ప్రవేటు ఉత్పత్తి కంపెనీలు తాము ఎంత రేటుకు అమ్మదలచుకున్నారో ఇ.సి.ఎన్.ఎ సంస్థకు ప్రతిపాదించిన 60 రోజుల్లోగా సంస్థ తన సమాధానాన్ని ఈ కంపెనీలకు తెలపాలి. అలా తెలపకపోతే సెక్షన్ 62 ప్రకారం ఆ కంపెనీ నిర్ణయించిన రేటే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రవేటు కంపెనీలకు బాగా లాభం సమకూర్చే నిబంధన. ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగితే ముప్పే. ఈ ప్రవేటు కంపెనీలు అలా ఆలస్యం జరిగేటట్లు చేయగల సమర్థత గలవి కూడా. 

ప్రవేటు కంపెనీల వద్ద తప్పక విద్యుత్ కొనాలనే నిబంధన విధించడం, వారు చెప్పిన రేటుకే కొనాలనడం, మొత్తం సొమ్ము ప్రజలు ముందే చెల్లించాలనడం, వంటివన్నీ చూస్తుంటే ఈ చట్ట సవరణ గుండుగుత్తగా విద్యుత్ వ్యవస్థను ప్రవేటీకరించడానికి, బడా ప్రవేటు సంస్థలకు లాభాలు కురిపించడానికే తప్ప, ప్రజలకు గాని, దేశానికి గాని ఇసుమంత కూడా లబ్ధి చేకూర్చడానికి కాదని తేటతెల్లవవుతోంది.


విద్యుత్ సంస్థల సిబ్బంది, కేంద్ర కార్మిక సంఘాలు దీనిపై ఇప్పటికే ఉద్యమిస్తున్నాయి. ఈ సవరణలనే కేంద్ర ప్రభుత్వం 2014, 2018 లలో కూడా చేయడానికి ప్రయత్నించింది. అయితే సిబ్బంది ప్రతిఘటన, పార్లమెంటులో చర్చలు, రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. దేశం ఆదమరిచిన వేళ నేడు మరలా బయటకు తీసింది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఆఖరుకు ఎన్డీయే ప్రభుత్వమున్న బిహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా బహిరంగంగా తన వ్యతిరేకతను తెలపాలి. అత్యవసరమైన విద్యుత్తును కూడా ఒక విలాసవంతమైన సరుకుగా మార్చే ఇటువంటి చట్ట సవరణను నిలవరించేలా పౌర సమాజం కదలాలి.



ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2020-06-27T06:30:59+05:30 IST