గరిష్ఠ పెన్షన్‌ రూ.3000 అయితే ఎలా?

ABN , First Publish Date - 2021-08-05T07:58:08+05:30 IST

భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించింది. అయితే వాటి అమలులో సంస్థాగతంగా ఎన్నో వ్యత్యాసాలు, అసమానతలు చోటు చేసుకొంటున్నాయి...

గరిష్ఠ పెన్షన్‌ రూ.3000 అయితే ఎలా?

భారత రాజ్యాంగం దేశ పౌరులకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించింది. అయితే వాటి అమలులో సంస్థాగతంగా ఎన్నో వ్యత్యాసాలు, అసమానతలు చోటు చేసుకొంటున్నాయి. ప్రభుత్వం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం కడు శోచనీయం. దీనికి పర్యవసానమే ఈ రోజున ఈపీఎస్ 95 పెన్షనర్లకు దాపురించిన దుర్భర పరిస్థితి. 


ప్రైవేట్ సెక్టారులో పనిచేస్తున్న ఉద్యోగులకు పింఛను సౌకర్యం కల్పించాలనే సదాశయంతో ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వోద్యోగులతో పాటుగా తమకూ పెన్షన్‌ సదుపాయం కలుగచేసినందుకు ప్రైవేటు సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు ఎంతో సంబరపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతోకాలం నిలబడలేదు. ఈ స్కీమ్ అశాస్త్రీయంగా ఏక పక్షంగా రూపొందించబడి కార్మికుల భవిష్యత్‌ ప్రయోజనాలను కాపాడలేని విధంగా అమలవుతోంది. ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టినపుడు కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. పెన్షన్‌ కాంట్రిబ్యూషన్‌ను ఉద్యోగి నుంచి వసూలు చేయకుండా మూడవ ప్రయోజనంగా కల్పించాలని ఆందోళనలు చేశాయి. ఈ స్కీమ్ వివరాలలోకి వెళితే యాజమాన్యం తన వంతు వాటాగా ప్రావిడెంట్ ఫండ్‌కు జమ చేస్తున్న 8.33% కాంట్రిబ్యూషన్‌ను పెన్షన్‌ ఫండ్‌లోనికి తీసుకురావడం జరిగినది. ప్రభుత్వం తన వంతు వాటాగా 1.16% పెన్షన్‌ ఫండ్‌కు జమ చేస్తోంది. అయితే వారు చెల్లించే భాగం ఏ మాత్రం సారూప్యతలేని నామమాత్రంగా చెల్లిస్తున్నటువంటి చందా మాత్రమే.  


2013లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం నియమించిన కోషియార్‌ కమిటీ కనీస పింఛను రూ.3000గా నిర్ధారించి దానికి కరువు భత్యాన్ని అంద జేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వారు సమర్పించిన రిపోర్టు ఆధారంగా జేసుకొని ఈ ఏడు సంవత్సరాల కాలానికి ధరల సూచీ ఆధారంగా కనీస పింఛను 7500/-–తో పాటు కరువుభత్యం చెల్లించాలని దాదాపు నాలుగు సంవత్సరాలుగా పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. పార్లమెంటు సభ్యులు ఈ అంశాన్ని పలుమార్లు సంవత్సరాల తరబడి సభ దృష్టికి తీసుకొని వచ్చారు. 2020 మార్చి నెలలో మథుర ఎంపీ హేమమాలిని, నేషనల్‌ ఏజిటేషన్‌ కమిటి చైర్మన్‌ అశోక్‌ రావత్‌ మొదలైన వారు పెన్షనర్ల సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి సవివరంగా తీసుకువెళ్ళారు. ప్రధాని మోదీ సావధానంగా ఆలకించి తక్షణమే స్పందించి పెన్షనర్ల సమస్యలను త్వరగా పరిష్కరించ వలసినదిగా సంబంధిత మంత్రికి ఆదేశాలు ఇచ్చారు. 


పెన్షన్‌ను నిర్ధారించటంలో, ఉద్యోగికి చివరి 12 నెలల్లో లభించిన సగటు వేతనాన్ని పరిగణనలోనికి తీసుకొనకుండా దానికి వేతనపరిమితులు విధించడం వలన అతితక్కువ పెన్షన్‌ రాబడితో చాలా నష్టపోతున్నారు. ఈ అంశం పై పిటీషన్ ఒకటి సుప్రీం కోర్టులో దాదాపు నాలుగు సంవత్సరాలుగా విచారణకు నోచుకోక వాయిదా పడుతూ వస్తున్నది. పెన్షన్‌ అనే పదానికి ఈపీఎఫ్ ఓ సరికొత్త నిర్వచనం తీసుకొని వచ్చినది. అదే పెన్షన్‌ మూల్యాంకనంలో స్థిరత్వం, దానికి కరువు భత్యం అను సంధానం చేయకపోవడం. సమీప కాలంలో ప్రభుత్వం కరువు భత్యంతో కూడిన పెన్షన్‌ చెల్లించాలని నిర్ణయం తీసుకుంటే, 10 నుంచి 15 సంవత్సరాల మధ్యకాలంలో ఉద్యోగ విరమణ పొందిన కడు వృద్ధులకు ఆ కాలానికి నష్టపరిహారం చెల్లిస్తుందా అనే ఒక మీమాంస పెన్షనర్ల మదిలో నెలకొని వున్నది. పబ్లిక్‌ సెక్టారులో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి లభిస్తున్న పింఛను పై కరువు భత్యం చెల్లిస్తున్న విధంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు మూడు సంవత్సరాల కొకసారి లేక అంతకు ముందుగాని వారికి చెల్లిస్తున్న మూల్యాంకనలో సవరణలు చేపట్టడం జరుగుతుందని ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన కాలంలో హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ హామీ గానే మిగిలిపోయింది. దానికి అనుగుణంగా ఆ దిశగా ఫండ్ బాధ్యతలు నిర్వర్తించక సరైన భవిష్యత్‌ ప్రణాళిక లేక పెన్షన్‌ ఫండ్‌లో వృద్ధి నవెూదుకాక దాదాపు రెండు దశాబ్దాలుగా పెన్షనర్ల ప్రయోజనాలకు తీవ్ర అనిశ్చిత స్థితి ఏర్పడింది. అసలు వారి మనుగడే ప్రశ్నార్థకంలో పడింది.


పెన్షన్‌ సర్వీస్ నిర్వచనంలో రెండు విషయాలు ముడిపడివున్నవి. 1971లో ఫ్యామిలీ పెన్షన్‌ స్కీమ్ తీసుకొనిరాబడినది. దాని స్థానంలో ఈపీఎస్ 95 పెన్షన్‌ స్కీమ్ నియమ నిబంధనలతో కూడుకుని ఉంది. అయితే 20 సంవత్సరాల కాంట్రిబ్యూషన్‌ సర్వీస్ పూర్తిచేసిన వారికి వెయిటేజి కలపడం జరిగినది. కాని పెన్షన్‌ లెక్కించుటకు 1971లో ప్రవేశపెట్టిన స్కీమ్‌ని లెక్కలోనికి తీసుకోకుండా 1995 నుంచి మాత్రమే పెన్షనబుల్‌ సర్వీస్‌ను లెక్కిస్తున్నారు. దీని వలన 1995 నుంచి కనీస పెన్షనబుల్‌ సర్వీస్ 10 సంవత్సరాలు, ఆ పైగా పూర్తికాబడి పదవీ విరమణ పొందిన ఉద్యోగి, 2005–-2010 సంవత్సరాల మధ్య కాలంలో అతి తక్కువ వేతనంతో పదవీ విరమణ పొందినటువంటి అధికసంఖ్యాకులైన ఉద్యోగులు అతి తక్కువ పెన్షన్‌ (కనీసంగా రూ.1000/- గరిష్ఠంగా రూ.3000) పొందుతూ చాలా నష్టపోతున్నారు.


ప్రభుత్వ ఉద్యోగంలో కనీసంగా 15 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఎటువంటి కాంట్రిబ్యూషన్‌ చెల్లించకుండా కనీసంగా రూ.8,500/- పెన్షన్‌ పొందగల్గుచున్నారు. దానికి ప్రతి ఏటా కరువు భత్యం తోడవుతున్నది. ఈపీఎస్ 1995 అమలు తేదీ నుంచి ఏ ప్రభుత్వం కూడా ఈ సున్నితమైన ఈపీఎస్ 95 పెన్షనర్ల జీవన మనుగడ గురించి వారికి ఇవ్వవలసిన కనీస పెన్షన్‌ గురించి ఎటువంటి చర్య తీసుకొని ఉండలేదు. సామాజిక రక్షణ ప్రయోజనాన్ని భవిష్యనిధి కాంట్రిబ్యూషన్‌తో ముడి పెట్టకూడదు. దీనివలన పెన్షనర్లు సుమారు 25 సంవత్సరాల పైబడి ఆర్థిక అనిశ్చిత స్థితిని ఎదుర్కొంటున్నారు.


దేశ నిర్మాణ పాత్రలో కార్మికుల భాగస్వామ్యం ఎంతైనా ఉంది. వారి కఠోర పరిశ్రమ ఫలితంగా పారి శ్రామికంగా ఎంతో ప్రగతి సాధించాము. జీవిత చరమాంకంలో ఉన్న వారి జీవిత గమనాన్ని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కనీస పింఛన్ రూ.10,000/– చేసి, కరువు భత్యాన్ని అందించాలని ఈపీఎస్ 95 పెన్షనర్లు కోరుచున్నారు. వారి న్యాయమైన కోర్కెలను తీర్చవలసిన బాధ్యత భారత ప్రభుత్వం పై ఉంది. తద్వారా వారు సంఘంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మార్గమేర్పరచాలి.

కొల్లిపర శ్రీనివాసరావు

Updated Date - 2021-08-05T07:58:08+05:30 IST