‘తెలుగుతల్లి’ కవికి గుర్తింపేది?

ABN , First Publish Date - 2021-04-08T05:43:15+05:30 IST

పిల్లలు ప్రతి రోజూ ప్రార్థన సమయంలో మా తెలుగుతల్లికి మల్లె పూదండ గీతం అలపిస్తారు. ఈ గీతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా ఉండేది...

‘తెలుగుతల్లి’ కవికి గుర్తింపేది?

పిల్లలు ప్రతి రోజూ ప్రార్థన సమయంలో మా తెలుగుతల్లికి మల్లె పూదండ గీతం అలపిస్తారు. ఈ గీతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార గీతంగా ఉండేది. తెలంగాణ విభజన తరువాత ఈ గీతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అయ్యింది. రాను రాను రాష్ట్ర గీతంతో పాటు, గీత రచయిత శంకరం బాడి సుందరాచారి కూడా ఈ తరానికి గుర్తుండే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. తెలుగు వారి వైభవాన్ని వర్ణించిన గీతమిది.


సుందరాచారి ‘తేటగీతి’ పద్యానికి ప్రసిద్ధుడు. బాపూజీ మరణాన్ని ‘బలిదానం’ పేరుతో సుందరాచారి ఒక గేయం రాసారు. ఆయన ‘మా దేశం మా దేశం మహ మంచిదిరా మా దేశం’ అనే గేయంతో భారతదేశంలో జన్మించిన అనేకమంది కవుల గురించి ప్రస్తావించారు. సుందరాచారి ఇంకా పలు రచనలు చేశారు. సుందర రామాయణం అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం కూడా వ్రాసాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుద్ధ చరిత్ర కూడా రాసాడు. రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించాడు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసాడు. జానపద గీతాలు వ్రాసాడు, స్థల పురాణ రచనలు చేసాడు. ఇవే కాక అపవాదు, పేదకవి, నాస్వామి, నేటికవిత్వము, బలిదానము, కార్వేటి నగరరాజ నీరాజనము మొదలైనవి వీరి ఇతర రచనలు.


సుందరాచారి 1942లో దీన బంధు అనే సినిమాకి మా తెలుగుతల్లి గీతాన్ని ఆయన రాశారు. ఎందుకోగాని ఆ చిత్ర నిర్మాత ఈ గీతాన్ని ఆ సినిమాలో ఉపయోగించుకోలేదు. తర్వాత ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమారి ఈ గీతాన్ని గానం చేశారు. 1975లో మా తెలుగుతల్లి గీతాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర గీత రచయితకి తగిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

యమ్. రామ్ ప్రదీప్

(నేడు శంకరంబాడి సుందరాచారి వర్ధంతి)

Updated Date - 2021-04-08T05:43:15+05:30 IST