నేను చెప్పినదే మే2న జరుగుతుంది‌: ప్రశాంత్‌ కిషోర్‌

ABN , First Publish Date - 2021-02-28T08:21:52+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరిగే కీలక ఎన్నికల పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరగనుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు.

నేను చెప్పినదే  మే2న జరుగుతుంది‌: ప్రశాంత్‌ కిషోర్‌

సొంత బిడ్డనే కోరుకుంటున్న బెంగాల్‌: ప్రశాంత్‌ కిషోర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరిగే కీలక ఎన్నికల పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరగనుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఈ రాష్ట్రంలో మార్చి 27 నుంచి జరిగే శాసనసభ ఎన్నికలను ప్రస్తావిస్తూ ‘సొంత బిడ్డను మాత్రమే కోరుకుంటున్న బెంగాల్‌’ అనే తృణమూల్‌ కాంగ్రెస్‌  పార్టీ(టీఎంసీ) ప్రధాన నినాదాన్నే ఆయన కూడా శనివారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి రూపొందించిన నినాదం అది. ఈ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కోవడం కోసం రూపొందించే వ్యూహరచనలో కిషోర్‌ కంపెనీ ఐ-ప్యాక్‌(ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ) అధికార టీఎంసీకి సహాయపడుతోంది. బెంగాల్‌ ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, మే 2న తన చివరి ట్వీట్‌ కోసం వేచిచూడండని కిషోర్‌ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో బెంగాల్‌లో బీజేపీ రెండంకెలకు మించి స్థానాలను గెలుచుకుంటే తాను ట్విటర్‌ నుంచి తప్పుకుంటానని గత డిసెంబర్‌ 21న కిషోర్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. బెంగాల్‌లో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-02-28T08:21:52+05:30 IST