మాన్సాస్‌ ట్రస్టుతో విజయసాయికి సంబంధమేమిటి?

ABN , First Publish Date - 2021-06-18T05:35:38+05:30 IST

విజయనగర సంస్థానం ఏర్పాటు చేసిన మాన్సాస్‌ ట్రస్టుతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సంబంధం ఏమిటని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

మాన్సాస్‌ ట్రస్టుతో విజయసాయికి సంబంధమేమిటి?
మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు

అశోక్‌పై మాట్లాడే నైతిక హక్కు లేదు

ఫ్ర్లాంక్లిన్‌ టెంపుల్టన్‌పై ప్రభుత్వానిది ద్వంద్వనీతి 

టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా ధ్వజం

విశాఖపట్నం, జూన్‌17(ఆంధ్రజ్యోతి): విజయనగర సంస్థానం ఏర్పాటు చేసిన మాన్సాస్‌ ట్రస్టుతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సంబంధం ఏమిటని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రతోపాటు పొరుగు రాష్ట్రాలు, దేశంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది విద్యార్థులు మాన్సాస్‌ పరిధిలోని విద్యా సంస్థల్లో చదువుకున్నారని, ఇంకా అనేక ఆలయాలకు వేలాది ఎకరాల భూమి దానంగా ఇచ్చిన ఘనత విజయనగరం రాజులదని అన్నారు. మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌ అశోక్‌గజపతిరాజుపై మాట్లాడే నైతిక హక్కు విజయసాయికి లేదన్నారు. అశోక్‌గజపతిపై విజయసాయి చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని పల్లా వెల్లడించారు. అశోక్‌గజపతిరాజు కాలిగోటికి విజయసాయి సరిపోరని వ్యాఖ్యానించారు. వేలాది ఎకరాల భూములు దానం చేసిన ఆయన, భూములు తీసుకున్నారని ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని నిలదీశారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారాల్లో తలదూర్చి ఇప్పటికే ఘోరమైన తప్పిదాలు చేశారని దుయ్యబట్టారు. మహారాజైనా అశోక్‌గజపతిరాజు దర్పం ప్రదర్శించని వ్యక్తి అని కొనియాడారు. అటువంటి వ్యక్తిపై ఆరోపణలు చేస్తారా? అని విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. ఇప్పటికైనా మాట్లాడే విధానం మార్చుకోవాలన్నారు. పంచగ్రామాలపై ఎవరు కేసులు వేశారో  చెప్పాలన్నారు. అనువంశిక ధర్మకర్తగా సింహాచలం దర్శనానికి వచ్చిన అశోక్‌ పట్ల అక్కడ అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. అధికారులు నిబంధనలు పాటించాలే తప్ప, వారికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖకు ప్రఖ్యాత ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆహ్వానించారన్నారు. మధురవాడలో ఎకరా రూ.32.5 లక్షల చొప్పున 40 ఎకరాలు కేటాయించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో జెన్సీ జాన్స్‌ విశాఖ వచ్చి మధురవాడలో ఏర్పాటు చేయనున్న కంపెనీలో 2,500 మందికి ఉపాధి  కల్పిస్తామని చెప్పారన్నారు. తాత్కాలికంగా టెక్‌మహేంద్రలో కార్యాలయం ప్రారంభించారన్నారు. అయితే 2020లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌కు కారుచౌకగా భూములు కట్టబెట్టారని మిఽధున్‌ రెడ్డి లోక్‌సభలో ఆరోపణలు చేశారన్నారు. అదే సంస్థకు ఎకరా రూ. 65లక్షలకు 25 ఎకరాలు ఇస్తామని చెప్పడం వెనుక వాటాల కోసమేనని అర్థమవుతుందని శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ నగరంలో పన్నుల పెంపుపై ప్రజల్లో వ్యతిరేకతను మళ్లించడానికి మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారం తెరపైకి తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై గతంలో కేసులు వేశారన్న కక్షతోనే అశోక్‌గజపతిరాజుపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌, విల్లూరి చక్రవర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T05:35:38+05:30 IST