తర్వాత ఏమైతది

ABN , First Publish Date - 2020-08-17T05:58:57+05:30 IST

తర్వాత ఏమైతది పతాక శీర్షికలుంటయా పతాకం తల వాలుస్తదా పతంగి తిరిగొస్తదా పొర్లి పొర్లి ఏడుపులుంటయా...

తర్వాత ఏమైతది

తర్వాత ఏమైతది

పతాక శీర్షికలుంటయా

పతాకం తల వాలుస్తదా

పతంగి తిరిగొస్తదా

పొర్లి పొర్లి ఏడుపులుంటయా

ఏమైతదోనని ఇటుచూడకు


తార నేల రాల్తదా

కంటిచుక్క కిందబడ్తదా

కడసారి చూపులు 

‘కట్టె’ను తడుముతయా

            

కొంగు అడ్డం పెట్టుకుంటరు

చేతుల్ల ఛిద్ర నయనాల్ని చూడరు

పగిలిన పదాలను చూడరు


చీదుతూ ముక్కుతూ మూల్గుతూ

ఎవరో మోస్తూనో మోయకనో

అక్కడ పడేస్తరు

ఇటుకై చూడకు

            

పొగలు ఎవలి కండ్లల్లనైన జొరబడ్తయా

ఈ కన్ను చివర మొదలై 

ఆ కన్ను చివర చితి ఆరిపోతది

ఆట అయ్యింది డోలు బగిలింది-ముఖం కిందికి దించకు

అస్థికలు ఆస్తులు ఏవి చెప్పేవి అవి చెప్తయి

పతంగి వస్తే వస్తది

ఉంటే గింటే నలుగురు విడిపోతరు

మర్లా ఏడాదికి కలుస్తరు

అప్పుడుగిన లేచి చూడకు

అదే సీన్‌ మరింత పల్చగా....

సుంకిరెడ్డి నారాయణరెడ్డి 


Updated Date - 2020-08-17T05:58:57+05:30 IST