Abn logo
Apr 9 2020 @ 13:01PM

ఎంట్రీ ఫీజే రూ.లక్ష.. ఇంతకీ గుడివాడలో అసలేం జరుగుతోంది..?

ఇదేం బరితెగింపు!

బ్లాక్‌లో మద్యం అమ్మకాలు 

జోరుగా జూదం నిర్వహణ

లాక్‌డౌన్‌లో అధికార పార్టీ నేతల దందా


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): గుడివాడ రూరల్‌ మండలం దొండపాడు.. నందివాడ మండలంలోని తమిరిస గ్రామాల మధ్య ఉన్న చేపల చెరువుల వద్ద కోలాహలం నెలకొని ఉంది. సుమారు 100 మంది పేకాటరాయుళ్లు గుంపులు గుంపులుగా కొలువుదీరి పేకాట ఆడుతున్నారు. ప్రవేశ రుసుం ఎంతో తెలుసా? అక్షరాలా లక్ష రూపాయలు. దాన్ని నిర్వహిస్తున్నది సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి అనుచరులు. అందుకే పోలీసులకు తెలిసినా అటువైపు చూడరు.. 


విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న ఓ అపార్ట్‌మెంటు ఎదుట ఉదయం తొమ్మిది గంటల సమయంలో స్కూటీ ఆగింది. కూరగాయల సంచితో ఓ వ్యక్తి ఓ ఫ్లాటు ముందు ఆగి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు. డోరు తెరిచిన వ్యక్తి కూరగాయల సంచి తెచ్చి ఇచ్చిన వ్యక్తికి రూ.4వేలు అందించాడు. కూరగాయలు అంత ఖరీదైపోయాయా? అని ఆశ్చర్యపోకండి. ఆ కూరగాయల సంచిలో బ్లెండర్స్‌ ప్రైడ్‌ బాటిల్‌ ఉంది. అది ప్రభుత్వ మద్యం దుకాణంలో కొంటే రూ.1200 ఖరీదు చేస్తుంది. ప్రస్తుతం మద్యం దుకాణాలు బంద్‌.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాని ధర బ్లాక్‌మార్కెట్‌లో అమాంతం పెరిగి రూ.4వేలకు చేరింది. 


లాక్‌డౌన్‌ కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు తినడానికి తిండి లేక కుటుంబాలను పోషించుకోలేక అల్లాడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారుల్లోనూ సంపాదనకు తెరదీసి జేబులు నింపుకొంటున్నారు. గుడివాడ ప్రాంతం మామూలుగానే పేకాటకు పెట్టింది పేరు. లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లలో కూర్చొని కూర్చొని బోర్‌ కొట్టిన బడాబాబులు ఎంత డబ్బు ఖర్చు పెట్టయినా సరే పేకాటకు సిద్ధమవ్వడంతో అధికార పార్టీ నేతలకు మంచి అవకాశం దొరికినట్లయింది. మంత్రి అనుచరులు రంగంలోకి దిగి పేకాటరాయుళ్లకు మంచి డెన్‌ ఏర్పాటు చేశారు. గుడివాడ రూరల్‌ మండలంలోని దొండపాడు, నందివాడ మండలంలోని తమిరిస మధ్య ఉన్న చేపల చెరువుల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎంట్రీ ఫీజు లక్ష రూపాయలుగా నిర్ణయించారు. రోజుకు 100 మంది ఇక్కడ పేకాడేందుకు వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు, అవసరమైన భోజన వసతి కల్పించేందుకు ఈ ఎంట్రీ ఫీజు. 


అంటే రోజుకు కోటి రూపాయలను వసూలు చేస్తున్నారు. ఖర్చుల కింద రూ.10 లక్షలు తీసేసినా, నికరంగా మిగిలేది రూ.90 లక్షలు. శిబిరం లోపల భారీభారీ పందేలు నడుస్తున్నాయని సమాచారం. మంత్రి ఆశీస్సులు ఉండటంతో పోలీసులు ఎవ్వరూ అటువైపే చూడటం లేదు. మరోవైపు జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు నిలిపివేయడంతో ఇదే అదునుగా వైసీపీ నాయకులు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. బార్‌ యజమానులను బెదిరించి మద్యంను బయటకు తీసుకొచ్చి బ్లాక్‌మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఫోన్‌ చేస్తే చాలు డోర్‌ డెలివరీ ఇచ్చి వస్తున్నారు. అసలు ధరకు నాలుగు రెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్‌స్టాగ్‌ బాటిల్‌ రూ.3500, విస్కీ బాటిల్‌ రూ.3500, చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ రూ.500 చొప్పున విక్రయిస్తున్నారు. అంతా అధికార పార్టీ నేతలు కావడం పైస్థాయి నేతల ఆశీస్సులు ఉండటంతో పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. 

మా స్థలం కబ్జా చేశారు: పమిడిముక్కల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైసీపీ నేతల భూదందాలు పెట్రేగిపోతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా పమిడిముక్కల మండలం పెనుమత్స గ్రామంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తమ స్థలం కబ్జా చేశారంటూ గ్రామానికి చెందిన సత్యవోలు సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి కోర్టులో వివాదం నడుస్తోందని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ స్థలంలో నిర్మించుకున్న గేటును, సిమెంటు స్తంభాలను ధ్వంసం చేసి, తమ స్థలం ఆక్రమించుకున్నారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement