Abn logo
Apr 16 2021 @ 00:29AM

‘పారిస్’ వాగ్దానాలు ఏమయ్యాయి?

వాతావరణ మార్పుపై ఢిల్లీలో ఇటీవల ఒక కదలిక కనిపించింది. అదేమీ ఆ విపత్తును అరికట్టడానికి ఉద్దేశించిన కార్యాచరణ కాదు సుమా! వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న హరితగృహ వాయువుల ఉద్గారాలను అరికట్టడానికి సంబంధించి నెట్ జీరో లక్ష్యం గురించిన భారత్ ఎలాంటి వైఖరి అనుసరించాలనే విషయమై జరిగిన చర్చల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మానవ చర్యల మూలంగా వాతావరణంలోకి చేరుతున్న హరిత గృహ వాయువుల పరిమాణం, వాతావరణం నుంచి తొలగిస్తున్న ఆ వాయువుల పరిమాణం కంటే ఎక్కువగా లేని పరిస్థితిని నెలకొల్పడమే నెట్ జీరో లక్ష్యం. పారిస్ వాతావరణ సదస్సు లక్ష్యాల పరిపూర్తి విషయమై ఈ నెల 22, 23 తేదీలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చొరవతో జరగనున్న ఒక ఉన్నతస్థాయి సదస్సు సందర్భంగా ఆయన ప్రత్యేక దూతగా న్యూఢిల్లీకి వచ్చిన జాన్ కెర్రీతో భారత ప్రతినిధులు ముమ్మర చర్చలు జరిపారు. 


ప్రపంచ నాయకుల ఎజెండాలో వాతావరణ మార్పు మళ్ళీ ప్రాధాన్యం వహించడం ఒక శుభవార్త కాగా ఆ సంక్షోభానికి సంబంధించి తప్పుడు విషయాలపైనే మనం చర్చించడం నిస్సందేహంగా ఒక దుర్వార్త. ఢిల్లీలో చర్చలను గమనిస్తే వాతావరణ మార్పును అరికట్టడంలో అన్ని దేశాలూ సమస్థాయిలో వ్యవహరించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పేఅవకాశాన్ని మనం మరొకసారి కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. వాతావరణ మార్పును అరికట్టేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంలో భాగస్వాములయిన దేశాలు, 2021–-30 దశాబ్దంలో హరిత గృహ వాయువుల ఉద్గారాన్ని నిరోధించేందుకు ప్రపంచ దేశాలు స్వచ్ఛందంగా నిర్దేశించకున్న లక్ష్యాలను నెరవేర్చడం కోసం తగిన చర్యలు చేపట్టాయా లేదా  అనే విషయమై చర్చలు జరగలేదు. వివిధ దేశాలు స్వయంగా నిర్దేశించకున్న లక్ష్యాలు వాస్తవానికి భూతాపాన్ని అరికట్టేందకు దోహదం చేసేలా లేవు. ఈ అంశాలపైన కాకుండా నెట్ -జీరో లక్ష్యం పైనే చర్చలు జరగడం పూర్తిగా అర్థరహితం. 


ఎందుకు అర్థరహితమో వివరిస్తాను. వివిధ దేశాలు ప్రకటించిన నెట్–-జీరో లక్ష్యం సారరహితమైనది. అదొక ఆకాంక్షాయుతమైన భావన మాత్రమే. ఆ భావనను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయవలసిఉంటుంది. 2050 నాటికి హరిత గృహ వాయువులను అరికట్టడంలో నెట్–-జీరో లక్ష్యాన్ని సాధిస్తామని పలు దేశాలు ప్రకటించాయి. చైనా ఆ లక్ష్యాన్ని 2060 సంవత్సరం నాటికి సాధించేందుకు నిబద్ధమయింది. అన్ని దేశాలు కలసికట్టుగా ఒకే లక్ష్యంతో పని చేయనప్పుడు వాతావరణ విపత్తును అరికట్టడం ఎలా సాధ్యమవుతుంది? అసలు ‘నెట్ -జీరో’ భావనే లోపభూయిష్టమైనది. అన్ని దేశాలు మరింత ఎక్కువగా హరితగృహ వాయువులను వాతావరణంలోకి వదులుతాయి. అయితే అవే ఆ వాయువులను వాతావరణం నుంచి తొలగించేందుకు చర్యలు చేపడతాయి! కాలుష్యకారక వాయువులను వాతావరణం నుంచి తొలగించడానికి ఇందుకు రెండు పద్ధతులను అనుసరించవలసి ఉంది. ఒకటి- వృక్షాలను మరింత అధికంగా పెంచడం. తద్వారా మానవచర్యల ద్వారా ఉత్పన్నమవుతున్న కార్బన్ డై ఆక్సైడ్‌ను వృక్షజాలం కట్టడి చేస్తుంది. రెండు- వాతావరణంలోకి ప్రవేశించిన బొగ్గుపులుసువాయువును అధునాతన సాంకేతికతలతో అదుపు చేయడం. అయితే ఈ రెండు పద్ధతులకు సంబంధించి పలు ప్రశ్నలకు సరైన సమాధానాలు లభించడం లేదు. వాతావరణంలోకి ఉద్గారమవుతున్న కార్బన్ డైఆక్సైడ్‌ను చెట్లు ఎంతవరకు కట్టడి చేయగలుగుతాయి? అలాగే హరితగృహ వాయువుల ఉద్గారాలను అదుపు చేసే అధునాతన సాంకేతికతలు నిజంగా మనకు అందుబాటులో ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే లేవనే చెప్పక తప్పదు. ఉన్నా అవి ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. కనుక వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అర్థరహితమే అవుతుంది. వాతావరణ విపత్తు నివారణకు తక్షణ ప్రాతిపదిక చేయవల్సిన, చేసితీరాల్సిన వాటి గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. అంతేగాని నెట్–-జీరో లక్ష్యం గురించి కాదు. 


మరో ముఖ్యమైన విషయమేమిటంటే నెట్–జీరో స్వతస్సిద్ధంగా అసమమైనది. 2030 సంవత్సరం నాటికి మానవచర్యల ఫలిత కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను 2010 నాటి స్థాయి ఉద్గారాలలో 45 శాతానికి తగ్గించాల్సిన అవసరమున్నదని, 2050 సంవత్సరం నాటికి అవి నెట్-జీరో స్థాయికి తగ్గితీరాలని ఐపిసిసి (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) పేర్కొంది. కాలుష్యకారక వాయువుల ఉద్గారాలకు సంబంధించి అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి ఇదివరకే అభివృద్ధి చెందిన దేశాలు చైనా మొదలైన కొత్తగా అభివృద్ధి చెందిన దేశాల మధ్య పెద్ద వ్యత్యాసముంది. మరి 2050 సంవత్సరం నాటికి నెట్-జీరో లక్ష్య పరిపూర్తి ఎలా సాధ్యమవుతుంది? వాతావరణ విపత్తు తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే ఆ దేశాలు ఇప్పటికే ఆ లక్ష్యానికి చేరుకునిఉండాల్సింది. లేదా 2030 సంవత్సరం నాటికి ఆ లక్ష్యాన్ని సాధించి తీరాలి. ఎట్టి పరిస్థితులలోనూ అంతకు మించి జాప్యం జరగకూడదు. 


సరే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాతావరణ మార్పు ఒక వాస్తవమని అంగీకరిస్తున్నారు. 2050 నాటికి తమ దేశం నెట్–-జీరో లక్ష్యాన్ని సాధించడానికి కట్టుబడి ఉన్నదని ఆయన ప్రకటించనున్నారు. అయితే ఇదే సరిపోదు. ఆయన ఆ ప్రకటన చేసినప్పుడు చప్పట్లు కొట్టవద్దు. హర్ష ధ్వానాలు చేయవద్దు. పారిస్ ఒప్పందం వాగ్దానాలను 2025 సంవత్సరంనాటికి సాధించేందుకు అమెరికా కట్టుబడి ఉన్నదా అని ఆయన్ని అడగవలసిఉన్నది. 2025 సంవత్సరం నాటికి అమెరికా, తన 2005 సంవత్సరం నాటి గరిష్ఠస్థాయి ఉద్గారాల కంటే 26 నుంచి 28 శాతం తగ్గించుకుని తీరాలి. నిజానికి 2019లో అమెరికాలో హరితగృహ వాయువుల ఉద్గారాలు 2016 సంవత్సరాంతంలో కంటే అధికంగా ఉన్నాయి! ఈ దృష్ట్యా నెట్-–జీరో లక్ష్యాన్ని మనం 2050 నాటికి కాకుండా 2030 నాటికే సాధించి తీరాలి. ధరిత్రి పరిరక్షణకు ఇది అత్యావశ్యకం. వాతావరణ విపత్తు తీవ్రతను జోబైడెన్ అంగీకరిస్తున్నారు. ఇది సంతోషకరమైన వార్తే. అయితే దీనివల్ల ప్రయోజనమేమిటి? ఆచరణలో ఎంతో చేయవలసిఉంటుంది. బైడెన్ అంగీకరించినా అంగీకరించకపోయినా వాతావరణ మార్పు ఒక మహావిపత్తు. దాన్ని నివారించడంలో ఇంకెంత మాత్రం జాప్యం తగదు. ప్రపంచ దేశాలు సమష్టిగా ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.

సునీతా నారాయణ్

‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’

డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు


Advertisement
Advertisement
Advertisement