యువతి కాళ్లూ చేతులు కట్టేసి... నోటిలో దుస్తులు కుక్కి...

ABN , First Publish Date - 2021-03-02T05:10:51+05:30 IST

అది నిత్యం రద్దీగా ఉండే రహదారి. సోమవారం ఉదయం ..

యువతి కాళ్లూ చేతులు కట్టేసి... నోటిలో దుస్తులు కుక్కి...
నిస్సహాయ స్థితిలో విద్యార్థిని

ఏమైందో! 

ముళ్ల పొదల్లో యువతి
గుర్ల మండలంలో కలకలం  


గుర్ల/తెర్లాం(విజయనగరం): 
అది నిత్యం రద్దీగా ఉండే రహదారి. సోమవారం ఉదయం ఆ రహదారిపై నుంచి వెళుతున్న స్థానికులకు ఏవో మూల్గులు వినిపించాయి. కొంతమంది పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. మరికొందరు ఏదో అనుమానంతో అటు వైపు అడుగులు వేశారు. అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. అక్కడ రోడ్డకు సమీపంలోని పొదల్లో కాళ్లూ చేతులూ కట్టేసిన స్థితిలో ఓ యువతి పడి ఉంది. ఆమె నోటిలో దుస్తులు కుక్కి ఉన్నాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లాలో కలకలం సృష్టించిన ఈ సంఘటన గుర్ల మండల కేంద్రంలో.. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. దీనికి సంబంధించి ఎస్పీ రాజకుమారి అందించిన వివరాలిలా ఉన్నాయి...


విజయనగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతి (20)హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్‌ నుంచి తెర్లాం మండలంలోని స్వగ్రామానికి బయలుదేరింది. అంతలో ఏమైందో గానీ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్ల పోలీసు స్టేషన్‌కు సమీపంలోని పొదల్లో దిక్కుతోచని స్థితిలో స్థానికుల కంట పడింది. విద్యార్థినికి కాళ్లు, చేతులు కట్టేసి.. నోటిలో దుస్తులు కుక్కేయడంతో బాధను చెప్పుకోలేక విలవిల్లాడింది. అప్పటికే ఎండ అధికంగా కాయడంతో నరకయాతన అనుభవించింది. స్థానికుల సమాచారం మేరకు గుర్ల పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి యువతిని పరిశీలించారు. ప్రాథమిక వైద్యం కోసం పీహెచ్‌సీకి తరలించారు. ఆమెకు మైగ్రేన్‌ సమస్య ఉందని, కళ్లు తిరిగి పడిపోయి ఉండొచ్చునని, అదే సమయంలో ఆమె పట్ల దుండగులు తప్పుగా ప్రవర్తించారా? లేదా? అనేది వైద్యుల పరిశీలనలో తేలుతుందని పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాసుపత్రికి తరలించామన్నారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి ఎస్పీ రాజకుమారి చేరుకుని ఆరా తీశారు. బాధితురాలు నీరసంగా... మాట్లాడలేని స్థితిలో ఉందని విలేకరులకు తెలిపారు.


గుర్ల స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఓ విద్యార్థిని నిస్సహాయ స్థితిలో పడి ఉన్న విషయం మండలంలో దావానలంలా వ్యాపించింది. నిత్యం రద్దీగా ఉండే పాలకొండ- విజయనగరం రోడ్డు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. తెర్లాం మండలంలోని విద్యార్థిని గ్రామానికి స్థానిక ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్పీ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.

Updated Date - 2021-03-02T05:10:51+05:30 IST