మన నాయకులకు ఏమైంది?

ABN , First Publish Date - 2021-06-13T06:18:04+05:30 IST

తొలి వేవ్‌కన్నా..

మన నాయకులకు ఏమైంది?

కనిపించని కరోనా తొలిఅల రోజులనాటి సందడి 


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తొలి వేవ్‌కన్నా రెండో వేవ్‌లో కరోనా జిల్లాను రోగమయం చేస్తోంది. కేసుల వ్యాప్తి పెరిగింది. వేగం పెరిగింది. శరీరంలో వైరస్‌ విలయతాండవం పెరిగింది. ఆసుపత్రుల్లో చేరాల్సిన అనివార్య స్థితి ఎక్కువైంది. ఆక్సిజన్‌ అవసరం అధికమైంది. మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా జనం జబ్బులపాలవుతున్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవల మీద జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, ఆక్సిజన్‌ కొరత, సిబ్బంది కొరత. ప్రయివేటులో ఫీజుల భారం. కరోనా కోరల్లో జనం విలవిలలాడుతున్న ఈ రోజుల్లో ఎందుకో ప్రభుత్వ యంత్రాంగంలో మునుపటి కార్యదీక్ష లేదు. వారిని కార్యోన్ముఖులను చేయడంలో ప్రజాప్రతినిధులు కూడా ఉదాశీనంగా ఉన్నారు. కరోనా మృత్యు బీభత్సంగా మారిన ఈ సమయంలో ప్రజలు ఏడాదిన్నర కాలం నాటి తొలి అలరోజులను గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి హడావుడి లేదు. అప్పటి పరుగులు లేవు. అప్పటి అంకితభావం, దృఢచిత్తం కనిపించడం లేదు. కరోనా కట్టడి ని దాదాపుగా గాలికొదిలేశారు. పారిశుధ్యచర్యలు లేవు. పాజిటివ్‌ అని తేలితే వారి కాంటాక్ట్‌లను గుర్తించే ప్రయత్నం అసలు లేదు. దీంతో వైరస్‌ విరుచుకుపడుతూనే ఉంది. 


ఎందుకిలా?

తొలి అల రోజుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌ల వలె పనిచేసిన జిల్లా ప్రజాప్రతినిధులో మునుపటి క్రియాశీలత లోపించడమే కారణంగా కనిపిస్తోంది. అప్పటిలా తాము పరుగులు పెడుతూ అన్ని విభాగాలవారినీ పరుగులు పెట్టించే నాయకులు ఒక్కరూ రెండో వేవ్‌లో కనిపించడం లేదు. ఆసుపత్రుల్లో వైద్య సేవల పర్యవేక్షణ కరువైంది. ఆసుపత్రులకు అవసరమైన మందులు, పరికరాలను సమకూర్చడంలో నాయకుల్లో చొరవ లోపించింది. పైపై సమీక్షలకే నాయకులంతా పరిమితమైనట్టుగా తొలి, మలి కరోనా అలలను పోల్చుకుంటే అనిపిస్తోంది. రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ప్రాణాంతక కరోనాతో పోరాడుతున్న ప్రజలకు భరోసా ఇవ్వడంలో నాయకులు ఎందుకు వెనుకబడ్డారనేది అంతుపట్టని అంశంగా కనిపిస్తోంది. ప్రజల్లోనూ ఈ అసంతృప్తి వినిపిస్తోంది. మునుపటిలా నాయకులు ముందుండి కరోనాపై పోరాటసైన్యాన్ని నడిపితే బావుండుననే ఆకాంక్ష జనంలో ఉంది. 


తొలి వేవ్‌లో దూకుడు... మలి వేవ్‌లో కనపడని మధుసూదనుడు

కరోనా తొలి అల రోజుల్లో నిరంతరం వార్తల్లో కనిపించిన నాయకుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి. ఒక యుద్ధవీరుడిలా రంగంలోకి దిగి వైరస్‌ వ్యాప్తి కట్టడిని పర్యవేక్షించారు. ఆసుపత్రులు, కోవిడ్‌ కేంద్రాలను సందర్శించి మెరుగైన వైద్యసాయం అందేలా చూశారు. లాక్‌డౌన్‌తో అలమటిస్తున్న ప్రజలకు సరకులు పంచుతూ భరోసా ఇచ్చారు. ఒక దశలో ఆయన వితరణ కార్యక్రమాలు జరిపిన తీరు కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతోందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయినా ఆయన వెనుకడుగేయలేదు. తనకు కరోనా సోకినా వైద్య సాయంతో బయటపడి మళ్లీ ప్రజల్లోనే కనిపించేవారు. ఒక తుఫాన్‌లా కనిపించిన బియ్యపు మధుసూదన్‌రెడ్డి కరోనా రెండో అల రోజుల్లో మాత్రం మునుపటి ఉత్సాహంతో లేరు. కేసులు పెరుగుతున్నా, మరణాలు చుట్టుముడుతున్నా ఆసుపత్రులను సందర్శించలేదు. బాధితులను పరామర్శించడం లేదు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించినా, ఆ తర్వాత అటు వెళ్ళిందీ లేదు. సేవా కార్యక్రమాల జాడ మాయమైంది. 


స్పీడు తగ్గిన సత్యవేడు ఎమ్యెల్యే 

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పీడు కూడా సెకండ్‌ వేవ్‌లో బొత్తిగా లేదు. గతంలో వైరస్‌ ప్రబలిన గ్రామాల్లో అధికారులను వెంటబెట్టుకుని పర్యటించి సహాయక చర్యలతో పాటు విరాళాలు సేకరించి ప్రభుత్వ సహాయక నిధికి అందించి ప్రజల మెప్పు పొందిన ఈ నాయకుడిలో అప్పటి స్ఫూర్తి ఏమయ్యిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తరచూ అధికారులతో సమీక్షలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసిన ఆదిమూలం కొవిడ్‌ కేర్‌ కేంద్రం ఏర్పాటు తో సరిపెట్టుకోవడం విచిత్రం. తొలి అల రోజుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌లా పనిచేసే క్రమంలో వైరస్‌ బారినపడి చెన్నై ఆపోలో ఆస్పత్రిలో నెల పాటు చికిత్స తీసుకుని కోలుకున్న ఆదిమూలంలో మునుపటి స్పీడు కనిపించడం లేదు. 


జనంలోనే నారాయణస్వామి

తొలి వేవ్‌ సమయంలో జీడీనెల్లూరులో ఎమ్మెల్యే నారాయణస్వామి వైరస్‌ నియంత్రణకు చొరవ చూపించారు. ఎక్కువగా జనం మధ్యే గడిపారు. పార్టీ ముఖ్యనేత విజయానందరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతల ద్వారా పెద్ద ఎత్తున పేదలకు సాయమందించారు. ఆ క్రమంలో కుటుంబీకులతో సహా కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే సెకండ్‌ వేవ్‌లో కూడా అధికారులను వెంటబెట్టుకుని మండలాల్లో పర్యటిస్తున్నారు. రెండు చోట్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయించారు. ఓ పరిశ్రమ ద్వారా ఆ సెంటర్లకు, పీహెచ్‌సీలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించారు. తిరుపతి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న బాధితులకు బిల్లుల తగ్గించడంలో సాయం చేస్తున్నారు. అయితే తొలివేవ్‌ తరహాలోనే ఇపుడు కూడా అపుడపుడూ మాస్కు లేకుండానే కనిపిస్తుంటారు. 


సెకండ్‌ వేవ్‌కు స్పందించని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు

చిత్తూరులో తొలివేవ్‌ సమయంలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చురుగ్గా స్పందించారు. తరచూ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. సొంత నిధులతో ప్రజలకు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ఎన్‌ 95 మాస్కులు, శానిటైజర్లు, నగరంలో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయించారు. అయితే సెకండ్‌ వేవ్‌ రోజుల్లో వ్యాక్సిన్‌ అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా  చొరవగా నియంత్రణ చర్యలు, సహాయక చర్యలు చేపట్టడం లేదు. చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రిలో వైద్యసేవలపై ఫిర్యాదులున్నా మెరుగుపరిచే ప్రయత్నం చేయలేదన్న విమర్శలున్నాయి. పూతలపట్టులో నిరంతరం జనం మధ్యే కనిపించిన  ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు కూడా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు మినహా మరే ఇతర సహాయక కార్యక్రమాలు చేపట్టలేదు.


పలమనేరులో ఎమ్మెల్యే సేవలేవీ?

పలమనేరు నియోజకవర్గంలో కరోనా తొలి, మలి వేవ్‌లు రెండింటిలోనూ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఉదాసీనంగానే వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. తొలి వేవ్‌లో సహాయక చర్యలు చేపట్టకపోగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. వి.కోట పట్టణంలో ఓ కల్వర్టును ఆయన అట్టహాసంగా ప్రారంభించి, దానికి భారీ ఎత్తున కార్యకర్తలను పోగేశారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో పాత్రికేయులపైనా మండిపడ్డారు. ఇక సెకండ్‌ వేవ్‌ విషయానికొస్తే ఇప్పటి వరకూ అధికారులతో సమీక్షలకు మాత్రమే పరిమితమయ్యారు. పలమనేరు వంద పడకల ప్రభుత్వాస్పత్రిలో 35 పడకలు కొవిడ్‌ విభాగానికి కేటాయించారు. ఒకసారి మాత్రమే ఆస్పత్రిని సందర్శించినా కొవిడ్‌ వార్డులోకి ఆయన వెళ్ళలేదు. వైద్యులతో సమావేశమై వెనుదిరిగారు. 


పుంగనూరులో మలి ఉధృతిలో మెరుగైన సేవలు

పుంగనూరులో తొలి వేవ్‌ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిమితంగా మాత్రమే పర్యటించారు. అయితే మున్సిపల్‌ అధికారులు, మండల అధికారులు చురుగ్గా పనిచేసి పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. పుంగనూరులో సహాయక చర్యలు కూడా అధికారుల చొరవతోనే జరిగాయి. అయితే సెకండ్‌ వేవ్‌లో మాత్రం పెద్దిరెడ్డి చొరవ చూపుతున్నారు. కొవిడ్‌ నియంత్రణ చర్యలకు ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తిగత సహాయకులను నియమించారు. పుంగనూరు, సదుంలలో  ప్రభుత్వ ఆస్పత్రులను కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చారు. ఎంపీ మిధున్‌రెడ్డి కొవిడ్‌ నియంత్రణకు సొంత నిధులు రూ. కోటి విరాళమిచ్చారు. అలాగే కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ స్కీమ్‌ కింద సేకరించిన నిధులతో ఈ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయం కల్పించారు. మండల కేంద్రాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయించారు.


తంబళ్ళపల్లెలో అంతంతమాత్రపు సేవలే!

తంబళ్ళపల్లెలో తొలి వేవ్‌లో పార్టీ స్థానిక నాయకులు మినహా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి సహాయక కార్యక్రమాలేవీ చేపట్టలేదు. కేవలం అధికారులతో సమీక్షలు, మండలాల పర్యటనలకే పరిమితమయ్యారు. సెకండ్‌ వేవ్‌లో ములకలచెరువు, తంబళ్ళపల్లె, బి.కొత్తకోటలలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయించారు. వాటిని సందర్శించారు. బి.కొత్తకోటలో మాత్రమే ఆక్సిజన్‌ సదుపాయం కల్పించగా మిగిలిన చోట్ల ఆక్సిజన్‌ అందుబాటులో లేదు. అవసరమైన బాధితులు మదనపల్లెకు వెళ్ళాల్సిందే. వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ఎమ్మెల్యే పెద్దగా చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి. 


మదనపల్లెలో అయిన వారికి ఆకుల్లో... 

మదనపల్లెలో కరోనా సంక్షోభంలో అధికార పార్టీ నేతల తీరు అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో అన్నట్టుగా మారింది. తొలి వేవ్‌లో లాక్‌డౌన్‌ పర్యవేక్షణ మినహా మానవీయ సేవలకు చొరవ చూపని ఎమ్మెల్యే నవాజ్‌ బాషా సెకండ్‌ వేవ్‌  తొలి రోజుల్లో మాత్రం చురుగ్గా పనిచేశారు. ప్రభుత్వ ఆస్పత్రి కొవిడ్‌ ఆస్పత్రిగా మారడంతో తరచూ ఆస్పత్రికి వెళ్ళడం, వైద్యులతో సమీక్షించడం వంటివి చేశారు. ఆ తర్వాత క్రమేపీ ఆస్పత్రికి వెళ్ళడం తగ్గించారని, బెడ్లు, ఇంజక్షన్లు తమకు కావాల్సిన వారికి మాత్రమే కేటాయించాలని వైద్యాధికారులపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే వ్యాక్సినేషన్‌ విషయంలో కూడా అయిన వారికి పెద్ద పీట వేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఏ వేవ్‌లోనూ మాస్కు ధరించరన్న విమర్శ ఇక్కడి ఎమ్మెల్యేని వెంటాడుతోంది.


చంద్ర‘గిరి’ దాటని చెవిరెడ్డి 

కొవిడ్‌ తొలి, మలి అలలు రెండింటిలోనూ ప్రసంశనీయమైన సేవలందిస్తున్న నాయకుడిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కోట్లాది రూపాయల సొంత వ్యయంతో తన నియోజకవర్గం మొత్తం సరకులు, పండ్లు అందించారు. విటమిన్‌ మాత్రలు సైతం ఉచితంగా పంచారు. బాధితులకు ఆరోగ్యవంతమైన ఆహారం అందేలా పద్మావతి కొవిడ్‌ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరికతీ కొవిడ్‌ కిట్‌లు ఇచ్చేవారు. అంతటితో సరిపెట్టుకోకుండా తిరుపతి నగరంలోని ప్రధాన ఆసుపత్రులు సహా వైద్యసేవల పర్యవేక్షణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శిల్పారామం కేంద్రంగా హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించి వైరస్‌ బాధితులకు డాక్టర్ల బృందం నిరంతరం సలహాసూచనలు అందించే ఏర్పాటు చేశారు. అటు అధికారులను, ఇటు వైద్య సిబ్బందిని సమన్వయం పరచడంలో చొరవ తీసుకున్నారు. భయం విపరీతంగా ఉన్న రోజుల్లోనూ ఆసుపత్రులోకి వెళ్లి బాధితులను ధైర్యం చెప్పారు. రెండో అల రోజుల్లోనూ చెవిరెడ్డి సేవల్లో లోటు లేకపోయినా ఆయన చంద్రగిరికే పరిమితం అయ్యారు. తిరుపతి ఆసుపత్రుల్లో వైద్యసేవల పర్యవేక్షణ ప్రయత్నం చేయడం లేదు. బాధితులు గోడుగోడుమంటున్నా ఆయన చంద్రగిరి దాటడం లేదు. చొరవ తీసుకుని ఆనందయ్య మందును  తయారు చేయిస్తున్న చెవిరెడ్డి దానిని కడా తన నియోజకవర్గం ప్రజలకే పరిమితం చేసుకున్నారు. పద్మావతి కొవిడ్‌ కేంద్రాన్ని సందర్శిస్తున్నా, మునుపటి శ్రద్ధ లేదు. కొవిడ్‌ కిట్‌లు లేవు. భోజన సదుపాయాల లోనూ తొలి అలరోజులనాటి నాణ్యత కనిపించడం లేదు. 


కరోనాను వదలి గంజాయి కట్టడిమీద పడ్డ భూమన

భయం విపరీతంగా ప్రచారం అవుతున్న కరోనా తొలిఅల రోజుల్లో జిల్లాలో ధైర్యంగా స్పందించి జనంలో తిరిగిన తొలి నాయకుడుగా  భూమన కరుణాకర్‌రెడ్డి అభినందనలు అందుకున్నారు. వీధుల్లో తిరుగుతూ మందులు స్వయంగా పిచికారీ చేస్తూ, ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ జనంలోనే కనిపించారు. స్వయంగా రెండుసార్లు కొవిడ్‌ బారిన పడినా ఆయన వెనకడుగువేయలేదు. కుమారుడు అభినయరెడ్డిని కూడా సేవలందించేలా ఉత్సాహపరిచారు. రెండో అలరోజుల్లోనూ కరుణాకర్‌రెడ్డి నిరంతరం జనంలోనే కనిపిస్తున్నారు. ఆటోలు పెట్టి మైకుల్లో తన గొంతు వినిపిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. అయితే తిరుపతిలోని ప్రధాన ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవల పర్యవేక్షణ మీద ఆయన తగినంత శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శ రెండో అల రోజుల్లో ఉంది.  తొలివేవ్‌లో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకరరెడ్డి, సెకండ్‌వేవ్‌ బీభత్సకాలంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి మరింత సమర్ధంగా పనిచేసేలా పర్యవేక్షిస్తారని అందరూ ఆశించారు. ఆయన ఆ ప్రయత్నం చేయకుండా కరోనా మృతదేహాల దహనం మీద దృష్టిపెట్టారు. మధ్యలో ఏమైందో గానీ హఠాత్తుగా తిరుపతి నగరంలో గంజాయి వినియోగం పెరిగిపోతోందంటూ నియంత్రించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణ ప్రజల్లో కలిసిపోయి గంజాయి వినియోగం ఉండే ప్రాంతాల్లో తిరుగుతూ కరోనా కట్టడికన్నా ఎక్కువగా గంజాయి కట్టడికి ప్రయత్నిస్తున్నారు. 


అనారోగ్యంతో విశ్రాంతిలో రోజా

నగరిలో కరోనా తొలివేవ్‌ సందర్భంగా సేవా కార్యక్రమాలతో మెరిసిన ఎమ్మెల్యే రోజా ఇపుడు సెకండ్‌ వేవ్‌లో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. గతంలో పెద్దఎత్తున పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన ఆమె, తన ట్రస్టు ద్వారా పేదలకు నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఆస్పత్రులకు కూడా అవసరమైన పరికరాలు అందజేశారు. అయితే సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలోనే అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలో శస్త్రచికిత్స చేయించుకుని రెండు నెలల విశ్రాంతి అనంతరం ఇటీవలే కోలుకున్నారు. తమ ట్రస్టు ద్వారా నగరి, పుత్తూరు ప్రభుత్వాస్పత్రులకు, నియోజకవర్గంలోని పీహెచ్‌సీలకు అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చారు.


పీలేరులో తేడా లేని కొవిడ్‌ సేవలు

పీలేరులో కరోనా తొలి-మలి వేవ్‌ల నడుమ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పనితీరులో ఎలాంటి తేడా కనిపించడం లేదు. తొలి వేవ్‌ సమయంలో ఎమ్మెల్యే, ఆయన తనయుడు సాయికృష్ణారెడ్డి పలువురు దాతలతో కలసి పెద్ద ఎత్తున మానవీయ సేవలందించారు. ముఖ్యంగా వలస కూలీలకు, నిరాశ్రయులకు, పేదలకు నిత్యావసర వస్తువులు, భోజనాలు అందించారు. మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణీ చేశారు. కరోనా సోకిన బాధితులకు తిరుపతిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్మిషన్ల విషయంలోనూ, బిల్లుల తగ్గంపు విషయంలోనూ ఎమ్మెల్యే చొరవ తీసుకుని సాయం చేశారు. సెకండ్‌ వేవ్‌లో బాధితుల సంఖ్య పెరగడంతో పాటు బెడ్లు, ఆక్సిజన్‌ కొరత తీవ్రం కావడంతో నియోజకవర్గ బాధితుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశారు. దానికి వచ్చే ఫిర్యాదులు, వినతులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. పీలేరు, వాల్మీకిపురాల్లో కొత్తగా కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయించారు. తమ కుటుంబానికి చెందిన షిర్డీ సాయి ఆలయ ట్రస్టు ద్వారా వాల్మీకిపురంలో పేదల కోసం శాశ్వత అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.


కుప్పానికి ఆక్సిజన్‌ అందిస్తున్న చంద్రబాబు

కుప్పంలో కొవిడ్‌ నియంత్రణకు స్థానిక ఎమ్మెల్యే హోదాలో చంద్రబాబు చొరవ తీసుకున్నారు. విలయతాండవం చేస్తున్న రెండో వేవ్‌లో ఆయన కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బాధితులకు పార్టీ తరపున సాయమందించేలా స్థానిక నేతలకు మార్గనిర్దేశం చేశారు. పార్టీ అండగా వుంటుందని ప్రజలకు లేఖ రాశారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలను ఫోన్‌ ద్వారా పరామర్శిస్తున్నారు. తమవంతుగా ఎన్టీయార్‌ ట్రస్టు ద్వారానూ, వ్యక్తిగత నిధులతోనూ కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రూ. 36 లక్షలు కేటాయించారు. ఇప్పటికే రూ. 19.20 లక్షలు విడుదల చేశారు. రూ. 3.43 లక్షలతో ఆక్సిజన్‌ సరఫరా యూనిట్‌కు మరమ్మతులు చేయించారు. 20 పల్స్‌ ఆక్సీ మీటర్లు అందించారు. నియోజకవర్గంలోని పీహెచ్‌సీలకు రూ. 11 లక్షలతో మందులు కొనుగోలు చేసి అందజేశారు. ట్రస్టు ద్వారా బాధిత కుటుంబాలకు భోజనాలు పంపిణీ చేయిస్తున్నారు. అధికారంలో లేకపోయినా సాయంలో ఆయన ముందున్నారు. ప్రజలకు అండగా ఉన్నారు.



Updated Date - 2021-06-13T06:18:04+05:30 IST