ఏడాదిలో ఏం జరిగింది

ABN , First Publish Date - 2020-06-02T09:34:14+05:30 IST

ఊరూరికీ చెరువులున్నా నింపడానికి నీళ్ళులేని పరిస్థితి చిత్తూరు జిల్లాది. కరువు నీడలో వ్యవసాయం కునారిల్లుతున్న ప్రాంతం ఇది.

ఏడాదిలో ఏం జరిగింది

పైసా నిధులు ఇవ్వలేదు

పార మట్టి ఎత్తలేదు

అడుగు ముందుకు పడని ఇరిగేషన్‌ ప్రాజెక్టులు

713 జలసంరక్షణ పనుల రద్దు

పెండింగ్‌లోనే రూ.140కోట్ల నీరు ప్రగతి పనుల బిల్లులు


చిత్తూరు-ఆంధ్రజ్యోతి:

ఊరూరికీ చెరువులున్నా నింపడానికి నీళ్ళులేని పరిస్థితి చిత్తూరు జిల్లాది. కరువు నీడలో వ్యవసాయం కునారిల్లుతున్న ప్రాంతం ఇది. సాగునీటి ప్రాజెక్టులు సాకారం అయితేనే ఈ నేల పచ్చబారుతుంది. పథకాలైతే గతంలోనే ఘనంగా మొదలయ్యాయి. కొంతకాలం నత్తలతో పోటీపడ్డాయి. రైతాంగం ఆశలు పెంచుతూ కొంతకాలం జోరుగా సాగాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మాత్రం జరుగుతున్న పనులు కూడా స్తంభించిపోయాయి. జరిగిన పనులకూ బిల్లులు ఆగిపోయాయి. కొత్తగా నిధులు లేవు. కొత్త పనులూ లేవు. ఏడాది పాలనలో నీళ్ళపథకాలకు అడ్డుకట్టలే తప్ప నిర్మాణాలు జరిగిన దాఖలాలు లేవు. 


టీడీపీ పాలనలో ఏం జరిగింది?

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జలసంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం నీరు-ప్రగతి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. చెక్‌డ్యాంల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణం, చెరువుల అభివృద్ధి, జంగిల్‌ క్లియరెన్సు, కాలువల పునరుద్ధరణ వంటి జలసంరక్షణ పనులు చేశారు. 2015 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా రూ.650.28 కోట్ల విలువైన 5978 పనులు మంజూరయ్యాయి. వీటిలో రూ.366.26 కోట్ల అంచనాలతో 3697 పనులు దశల వారీగా పూర్తయ్యాయి. వీటిలో 3068 చెక్‌డ్యాం పనులు, 304 సరఫరా కాలువల పనులు, 180 జంగిల్‌ క్లియరెన్సు పనులు, 2430 చెరువుల అభివృద్ధి పనులను చేశారు.


ఏడాదిలో వైసీపీ ఏం చేసింది?

నీరు ప్రగతి కార్యక్రమం ద్వారా టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.120 కోట్ల విలువచేసే 713 పనులను వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసింది. పూర్తయిన నీరు ప్రగతి పనులకు సంబంధించిన రూ.140 కోట్ల బిల్లులను విజిలెన్సు విచారణ పేరుతో ఆపేశారు.  దీంతో వందల మంది గుత్తేదారులు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు.


టీడీపీ పాలనలో ఏం జరిగింది?

ఎన్టీఆర్‌ జలాశయంలో మిగులు జలాలను పెనుమూరు, జీడీనెల్లూరు మండలాల పరిధిలోని 36 చెరువులను నింపేందుకు గత ప్రభుత్వం పూనుకుంది. దీనికోసం రూ.266.05 కోట్లను మంజూరు చేసింది. పనులు 90శాతం పూర్తయ్యాయి.


ఏడాదిలో వైసీపీ ఏం చేసింది?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.


ఏడాదిలో చేసిందొక్కటే

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదుల పునరుజ్జీవ పథకం కింద తంబళ్లపల్లె, పూతలపట్టు, పీలేరు నియోజకవర్గాల్లో రిజర్వాయర్లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిర్మించడానికి రూ.2700 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇంతవరకూ అవి ఆమోదం పొందలేదు. ప్రతిపాదన దశలోనే ఉన్నాయి.


మాటలు తప్ప చేతల్లేవు

హంద్రీనీవా ఆలస్యమవుతుందని, దీనికి ప్రత్యామ్నాయంగా పడమటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈ పైపులైన్లు నిర్మిస్తామని వైసీపీ నాయకులు ఏడాదిగా చెబుతున్నారు.  కడప జిల్లా గండికోట నుంచి అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట వరకు రూ.2 వేల కోట్లతో పైపులైను నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.


సాగని హంద్రీనీవా ..టీడీపీ పాలనలో ఏం జరిగింది?

టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్యకాలంలో హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి ఫేజ్‌-1, ఫేజ్‌-2లలో రూ.11,300 కోట్లను ఖర్చు చేశారు. 90శాతం పనులు పూర్తయ్యాయి. 2019 జనవరిలో జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి తొలిసారిగా నీళ్ళు వచ్చాయి. కరువు ప్రాంతమంతా భవిష్యత్తును తలచుకుని సంబరాలు చేసుకున్నారు. 


ఏడాదిలో వైసీపీ ఏం చేసింది?

 వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టు గురించి అస్సలు పట్టించుకోలేదు. పైసా నిధులు కేటాయించలేదు. పార మట్టి ఎత్తలేదు. పైగా ఈ పథకానికి సంబంధించిన రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 


కదలని గాలేరు నగరి ..టీడీపీ పాలనలో ఏం జరిగింది?

 కడప, చిత్తూరు జిల్లాల్లో 3.25 లక్షల ఎకరాలకు సాగునీటిని, తాగునీటినీ అందించే ఉద్దేశంతో గతంలో ప్రారంభించిన గాలేరు-నగరి పథకం పనులు టీడీపీ హయాంలో 17.01శాతం  పూర్తయ్యాయి. 2018-19లో 350.12 కోట్లు మంజూరవ్వగా.. 2019-20లో 391.01కోట్లు విడుదలయ్యాయి.


ఏడాదిలో వైసీపీ ఏం చేసింది?

తాజాగా విడుదలైన నిధులు పెండింగ్‌ బిల్లులకే  సరిపోయాయి. ఈ ఏడాది పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు. మల్లెమడుగు, వేణుగోపాల్‌సాగర్‌, బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు తొలుత ప్రారంభించినా.. అంచనా వ్యయం పెరగడంతో ఆపేశారు. 

Updated Date - 2020-06-02T09:34:14+05:30 IST