What not to feed your pets: మీ పెట్స్ కు ఈ ఆహారం ఇస్తున్నారా?

ABN , First Publish Date - 2022-09-20T18:16:23+05:30 IST

అసలు పెంపుడు జంతువు వయసు, తీసుకునే ఆహారపు పరిమితి, శారీరక శ్రమ, పరిమాణం. జాతి, రకాన్ని బట్టి తేడా ఉంటుంది.

What not to feed your pets:  మీ పెట్స్ కు ఈ ఆహారం ఇస్తున్నారా?

పెంపుడు జంతువుల ప్రేమికులు ఎప్పుడూ తమ పెట్స్ ని కుటుంబంలో భాగంగా భావిస్తారు. వాటికి టీకాలు వేయించడం దగ్గరనుంచి వాకింగ్ కు తీసుకువెళ్ళడం, సంతానోత్పత్తి సీజన్స్ వరకూ చాలా శ్రద్ధగా ఉంటారు. మరి వాటి ఆహారం విషయానికి వస్తే పెట్స్ కు ముఖ్యంగా కుక్కలకు, పిల్లులకు ఇచ్చే ఆహారంలో ఎలాంటి పోషకాలను అందివ్వాలనే విషయానికి వస్తే అందరిలోనూ డైలమా తప్పదు. అసలు వాటికి ఏ ఆహారం ఇవ్వాలి, వేటిని ఇవ్వడం వల్ల పెట్స్ ఆరోగ్యం చెడిపోతుంది. 


రోజులో టెలివిజన్స్, రకరకాల చానల్స్ లో వస్తున్న ప్రకటనలకైతే లెక్కే లేదు. ఈ ఆహారాన్ని పెడితే మీ పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి అంటూ చెపుతాయి. అసలు ఏది ఎంచుకోవాలి, ఏ ఆహారం పెట్స్ కి బలాన్ని ఇస్తుంది అనే విషయంగా డైలమా ఎప్పుడూ ఉంటుంది. అసలు పెంపుడు జంతువు వయసు, తీసుకునే ఆహారపు పరిమితి, శారీరక శ్రమ, పరిమాణం వాటి జాతి, రకాన్ని బట్టి తేడా ఉంటుంది. ఏది పడితే అది పెట్టడం వల్ల కూడా కొన్ని అనారోగ్యాల బారిన పడతాయి. అవేంటో చూద్దాం.

ఆహారంలో ఇవి ఇస్తున్నారా?

1. మసాలాలు, ఉప్పు.. 

ఇంట్లో వండిన ఆహారాన్ని ఇస్తున్నారా? మనం వంటల్లో వాడే మసాలాలు పిల్లులు, కుక్కల జీర్ణవ్యవస్థను పాడు చేస్తాయి. మిరప పొడి, జాజికాయ వంటి మసాలా దినుసులు పెంపుడు జంతువులను ఉద్రేకపూరితంగా తయారు చేస్తాయి. అలాగే ఉప్పు అధికంగా అలవాటు చేసినా డీహైడ్రేట్ అవుతుంది. ఉప్పు, మసాలా దినుసులు మూర్చా, వణుకు, అతి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. 


2. కెఫిన్, చాక్లెట్లు

టీ, కాఫీ , సోడాలలో ఉండే కెఫిన్ పెంపుడు జంతువులలో అతిసారం, వాంతులు కలిగిస్తుంది. గుండె, నాడీ వ్యవస్థ పనితీరును కెఫిన్ దెబ్బతీస్తుంది. బేకింగ్ చాక్లెట్, కోకో, చాక్లెట్లు మొదలైన ఏ రూపంలోనైనా చాక్లెట్లు ప్రాణాంతకం కావచ్చు.


3. కొవ్వు పదార్ధాలు..

కుక్కలు,పిల్లులు కొవ్వును జీర్ణం చేసుకోలేవు. ఇది వాంతులు, విరేచనాలకు కలిగిస్తుంది. పెంపుడు జంతువులకు మాంసాహారాన్ని ఉడికించి ఇవ్వడం మంచిది. 


4. ఉల్లిపాయ, వెల్లుల్లి..

పచ్చి, వండిన ఉల్లిపాయలు, వెల్లుల్లి పెంపుడు జంతువులకు ఖచ్చితంగా పెట్టకూడదు. ఇవి ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు ఆటంకం అవుతాయి. ఇవి జంతువులలో రక్తహీనతకు దారితీస్తుంది.


5. చక్కెర, స్వీట్లు..

కుక్కలు, పిల్లులకు చక్కెర, స్వీట్లు నీరసాన్ని కలిగిస్తాయి. ఇవి మధుమేహం, దంత సమస్యలను పెంచుతాయి. చక్కెర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. మూర్ఛ కలిగిస్తుంది. స్వీట్లు తీసుకోవడం వల్ల అవయవాల సమన్వయాన్ని కోల్పోతాయి.


6. ముడి ఆహారం..

ఏదైనా పచ్చి ఆహారాన్ని జాగ్రత్తగా ఇవ్వాలి. ఈస్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలిగిన పదార్థాలు తీసుకుంటే శ్వాస ఆడకపోవడానికి కారణమవుతుంది. ఉడికించిన పిండి, చేపలు, మాంసం, గుడ్లు ఆరోగ్యానికి మంచిది.


7. విత్తనాలు, పండ్లు..

ద్రాక్ష, ఎండుద్రాక్ష వంటి పండ్లు పిల్లులు, కుక్కలలో వాంతులు, విరేచనాలకు కారణమవుతాయి. యాపిల్స్, పీచెస్, రేగు పండ్లు విత్తనాల్లో సైనెడ్ కలిగి ఉండటం వల్ల పెంపుడు జంతువులలో హైపర్‌వెంటిలేషన్ ఏర్పడుతుంది. 


8. మద్యం..

ఆల్కహాల్ పెంపుడు జంతువులలో కాలేయం, మెదడును దెబ్బతీస్తుంది. వాంతులు, విరేచనాలు, స్ట్రోక్స్, గుండె వైఫల్యం రావచ్చు. ఆల్కహాల్ పెంపుడు జంతువులలో శ్వాస ఆడకపోవడాన్ని, భయాన్ని కలిగిస్తుంది. 


9. పాల ఉత్పత్తులు..

వెన్న, చీజ్, పనీర్ , పాలు కూడా పెంపుడు జంతువులకు సరిపోని ఆహార పదార్థాలు. 

Updated Date - 2022-09-20T18:16:23+05:30 IST