బంగాళదుంపలు ఆకుపచ్చ రంగులోకి మారుతోంటే అర్థమేంటి..? వాటిని తింటే...

ABN , First Publish Date - 2022-07-15T21:43:35+05:30 IST

సోలనిన్ అధిక స్థాయి బంగాళాదుంపలను చేదుగా చేస్తుంది అలాగే ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు.

బంగాళదుంపలు ఆకుపచ్చ రంగులోకి మారుతోంటే అర్థమేంటి..? వాటిని తింటే...

మనలో చాలా మంది బంగాళ దుంపలతో చేసిన పదార్థాలంటే ఇష్టంగా తింటాం. కూరలైనా, ఫ్రై లైనా కూడా పిల్లలు పెద్దలూ అందరూ తింటుంటారు. మామూలుగా బంగాళ దుంపలు పాడుకాకుండా ఎక్కవకాలం నిల్వ ఉంటాయి. అందుకే వీటిని కొని ఓపక్కన వేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండేస్తూ ఉంటాం. కాకపోతే మనం గమనించని విషయం ఏమిటంటే కాస్త నిల్వ ఉన్న బంగాళ దుంపలు చిన్న చిన్న మొలకలు వచ్చి కనిపిస్తాయి. వాటిని కూడా కూరల్లోకి వాడేస్తాం. అలాగే కొన్ని దుంపలు కాస్త పచ్చరంగులో పచ్చిగా కనిపించినా సరే వాటిని కూడా వంటకు వాడేస్తాం. అసలు ఇలా పచ్చగా ఉంటే బంగాళ దుంపల్ని ఆహారంలో తినచ్చా? అసలు ఈ విషయాన్ని  ఇప్పటిదాకా ఆలోచించి ఉండరు కదా. ఈ దుంపలు రంగు మారడానికి కారణాలు ఏంటి.


బంగాళదుంపలు ఎందుకు ఆకుపచ్చగా మారుతాయి?

బంగాళ దుంపలపై సూర్యకాంతి పడినప్పుడు అవి సహజంగానే ఆకుపచ్చగా మారతాయి. బంగాళా దుంపలకు ఆ పచ్చరంగు క్లోరోఫిల్ నుంచి వస్తుంది. ఈ క్లోరోఫిల్ అనేది మొక్కలకు పచ్చదనాన్ని ఇచ్చే పదార్థం. దీనిని తీసుకోవడం వల్ల ప్రమాదం ఏం ఉండదు. 


పచ్చి బంగాళదుంపలు తినడం సురక్షితమేనా?

కాకపోతే నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ నివేదిక ప్రకారం, మరీ పచ్చిగా మారిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి అంత సురక్షితం కాదంటున్నారు. బంగాళాదుంపలో క్లోరోఫిల్ పెరిగి, దానిని ఆకుపచ్చగా మార్చినప్పుడు, సోలనిన్ సమ్మేళనం కూడా పెరిగే అవకాశం ఉంది.


సోలనిన్ అధిక స్థాయి బంగాళాదుంపలను చేదుగా చేస్తుంది అలాగే ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు. కిరణజన్య సంయోగక్రియకు క్లోరోఫిల్ అవసరం, మొక్కలు తమను తాము పోషించుకోవడానికి ఉపయోగించే ప్రక్రియ ఇది. సూర్యరశ్మికి గురికావడం వల్ల బంగాళదుంపలలో క్లోరోఫిల్ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, వికారం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలతో పాటు తలనొప్పి, నరాల సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. అయితే, ఈ ప్రభావాలన్నీ బంగాళ దుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జరుగుతాయి. రుచి కొద్దిగా మారినా, రంగులో తేడా కనిపించినా వీటిని చేదుగా ఉన్నాకూడా తినకూడదు. 


పచ్చ బంగాళాదుంపలను ఎలా వాడుకోవాలి?

రంగుమారిన బంగాళదుంపలను మొత్తానికి తినకూడదని కాదు.. ఆకుపచ్చ భాగాన్ని కత్తిరించి, మిగిలిన బంగాళాదుంపలను వాడుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం, బంగాళాదుంప పై పొరను కూడా తొలగించడం ఉత్తమం, ఎందుకంటే వీటి చర్మంలో ఎక్కువ సోలనిన్ కనిపిస్తుంది. మీ బంగాళాదుంపలు చాలా త్వరగా ఆకుపచ్చగా మారకుండా ఉండడానికి వాటిని ఎప్పుడూ ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. చల్లగా, కాస్త చీకటిగా ఉండే చోట వీటిని నిల్వ ఉంచడం ఉత్తమం. 



Updated Date - 2022-07-15T21:43:35+05:30 IST