అలాంటి ఖాతాలను సస్పెండ్ చేయడం స్వేచ్ఛా స్ఫూర్తికి విరుద్ధం: Koo సహ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ

ABN , First Publish Date - 2022-05-20T23:09:38+05:30 IST

ఈ సోషల్ మీడియా యుగంలో ‘ఫ్రీ స్పీచ్’ అర్థం మారిపోతోంది. సామాజిక మాధ్యమాలు చేతిలో ఉన్నాయి కాబట్టి,

అలాంటి ఖాతాలను సస్పెండ్ చేయడం స్వేచ్ఛా స్ఫూర్తికి విరుద్ధం: Koo సహ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ

న్యూఢిల్లీ: ఈ సోషల్ మీడియా యుగంలో ‘ఫ్రీ స్పీచ్’ అర్థం మారిపోతోంది. సామాజిక మాధ్యమాలు చేతిలో ఉన్నాయి కాబట్టి, ఏది పడితే అది మాట్లాడితే, రాసేస్తే వాక్ స్వాతంత్ర్యం అనిపించుకుంటుందా? ఈ ప్రశ్నకు దేశీయ మైక్రోబ్లాగింగ్ సైట్ కూ (Koo) సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ చెప్పిన సమాధానం ఇది. 


మన మాతృభాషలో ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవడమంటే జనాదరణ పొందిన నమ్మకాలకు విరుద్ధంగా నడుచుకోవడం కాదంటారు రాధాకృష్ణ. ఇతరుల అభిప్రాయాలతో విభేదించడం, దూషించడం, లైంగిక, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం, మరో వ్యక్తికి హాని కలిగించేలా బెదిరించడం, లేదంటే ద్వేషం కలిగించేలా నకిలీ వార్తలను ప్రచారం చేయడం వాక్ స్వాతంత్ర్యం కిందికి రాదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. ఉదాహరణకు మనం వేసవిలో ఓ బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నప్పుడు బస్సు ఎంతకీ రాకపోతే విసుగు చెంది వెంటనే సోషల్ మీడియా తెరిచేసి అధికారులపై దుమ్మత్తిపోయడం ఎంతమాత్రమూ వాక్‌స్వాతంత్ర్యం కిందకి రాదని స్పష్టం చేశారు.


ప్రతి ఒక్కరికీ తమ ఆలోచనలను పంచుకునే స్వేచ్ఛ ఉంటుందని రాధాకృష్ణ పేర్కొన్నారు. అవతలి వ్యక్తి అభిప్రాయాలు నచ్చకపోతే విమర్శలు కూడా చేయొచ్చు. ఇతరులను గౌరవిస్తూ మనం చెప్పేదాని పట్ల మనకు బాధ్యత ఉండాలని వివరించారు.


భారతదేశం వంటి బహుళ భాషలు మాట్లాడే దేశాల్లో ఆంగ్లం మాట్లాడేవారు జనాభాలో 10 శాతం కంటే తక్కువ ఉన్నారు. కాబట్టి నచ్చిన భాషలో తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ యూజర్లకు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. వినియోగదారులు అభిప్రాయాలకు విలువనివ్వాలని, వారు పోస్టు చేసేది చట్టాలకు అనుగుణంగా ఉన్నంత వరకు వారి ఖాతాను సస్పెండం చేయడం, నిషేధం విధించడం స్వేచ్ఛా స్ఫూర్తికి విరుద్ధమని రాధాకృష్ణ పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-20T23:09:38+05:30 IST